రాజమౌళిని ఇంకా తిడుతూనే ఉన్నారట

Update: 2015-07-23 12:11 GMT
విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నారు ఈ తండ్రీ కొడుకులిద్దరూ. బాహుబలి దర్శకుడిగా రాజమౌళిని.. బాహుబలితో పాటు భజరంగి భాయిజాన్ కథకుడిగా విజయేంద్ర ప్రసాద్ ను నేషనల్ మీడియా సైతం ఆకాశానికెత్తేస్తోంది. ఐతే తనను పొగడ్డం కంటే తన కొడుకును ప్రశంసల్లో ముంచెత్తుతున్నందుకే విజయేంద్ర ప్రసాద్ ఎక్కువ సంతోషిస్తుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఐతే చిన్నతనంలో తన తండ్రి తనను తెగ తిట్టేవాడని అంటున్నాడు రాజమౌళి. ఇంటర్లోనే చదువు మానేసి ఆవారాగా తిరుగుతుండేవాణ్నని.. అప్పట్లో నాన్న పరిస్థితి కూడా ఏమంత బాగా ఉండేది కాదని.. తాను ఖాళీగా కనిపించినపుడల్లా తిట్టేవాడని.. తన వదిన శ్రీవల్లి తనను వెనకేసుకుని వచ్చేదని రాజమౌళి తెలిపాడు. తన తండ్రితో కథా చర్చల్లో పాల్గొన్నపుడే ఆయనకు తన టాలెంట్ తెలిసిందని.. ఆ తర్వాత ఆయన దగ్గరే ఆరేళ్లు అసిస్టెంటుగా పని చేశానని చెప్పాడు రాజమౌళి.

తన తండ్రి ఇప్పటికీ తనను తిడుతుంటాడని.. ఐతే ఈ తిట్లు వేరే రకమని చెప్పాడు జక్కన్న. తాను వేగంగా సినిమాలు చేయట్లేదని, బాలీవుడ్ కు వెళ్లకుండా తెలుగు పరిశ్రమకే పరిమితమైపోతున్నానని ఆయన తిడుతుంటాడని చెప్పాడు రాజమౌళి. దర్శకుడిగా తాను సాధించిన విజయాల పట్ల ఆయన చాలా సంతోషంగా ఉన్నారని రాజమౌళి చెప్పాడు. తన సినిమాల్లో ఎమోషన్స్ బాగా ఎలివేట్ అవుతోందన్నా.. డ్రామా బాగా పండుతోందన్నా.. అదంతా తండ్రి నుంచి నేర్చుకున్నదే అంటూ తండ్రిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు రాజమౌళి.
Tags:    

Similar News