చిరుతో పెరిగిన గ్యాప్ మొన్నటి దెబ్బకు తగ్గిపోయిందట!

Update: 2020-01-14 05:30 GMT
ఏమాటకు ఆ మాటే చెప్పాలి. కొన్ని మాటల్ని సినిమావాళ్లు మాత్రమే చెప్పగలరేమో? లాజిక్ కు భిన్నమైన సీన్లు చూపించటం. అదేమిటని ప్రశ్నిస్తే.. సర్లే బాసూ.. అన్నింటికి లెక్కలు.. తొక్కలు అంటే ఎలా? కాస్త వాటికి భిన్నంగా ఉన్న వాటిని చూసీచూడనట్లుగా వదిలేయాలి. అదేకదా సినిమా అంటే? అంటూ సమర్థించుకోవటం కనిపిస్తుంది. రీల్ వరకూ ఆ సర్దుబాటు మాటలు ఓకే అనుకున్నా.. రియల్ లోనూ అలాంటి మాటలే చెబితే ఏమనాలి? ఎలా చెప్పాలి? అన్నది ప్రశ్న.

ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఇప్పుడెందుకు వచ్చిందంటారా? అక్కడికే వస్తున్నాం. ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించిన ప్రిరిలీజ్ ఫంక్షన్ వేళ.. మెగాస్టార్ చిరంజీవి.. లేడీ అమితాబ్ విజయశాంతిలు ఒకే వేదిక మీదకు రావటం.. ఈ సందర్భంగా రాజకీయాల్లో తనను విజయశాంతి ఎన్ని మాటలు అన్నా.. తాను మాత్రం అనలేదంటూ వ్యాఖ్యానించటం.. దానికి విజయశాంతి తెలివిగా సమాధానం ఇవ్వటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటికి విజయశాంతిలో హాట్ ఏ మాత్రం తగ్గలేదంటూ చిరు చేసిన సరస వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల కాలంలో అంత బోల్డ్ గా విజయశాంతి అందాన్ని ఎవరూ పొగడలేదేమో? అంత సాహసం కూడా చేసే చాన్స్ లేదు. అందుకు భిన్నంగా మెగాస్టార్ చెప్పిన మాట విజయశాంతిని ఫిదా అయ్యేలా చేసినట్లుగా కనిపిస్తోంది.

తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో.. మొన్న జరిగిన ఫంక్షన్ తో చిరుతో తనకున్న దూరం తగ్గిందని.. అపార్థాలన్నీ తొలిగిపోయాయని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరుతో తనకు దూరం బాగా పెరిగిన వైనాన్ని గుర్తు చేసుకొని.. ఇప్పుడు అలాంటిదేమీ లేదని తేల్చేశారు. ఒక్క ఫంక్షన్ లోనే తగ్గిపోయే దూరమైనప్పుడు.. ఇన్నేళ్లుగా ఎందుకు తగ్గించుకోలేదన్నది ప్రశ్న. భిన్న భావజాలాలు ఉన్నప్పుడు వ్యతిరేకత సహజం. అయితే.. అందుకు భిన్నమైన మాటలు మాట్లాడుతున్న విజయశాంతిని చూసినప్పుడు.. రీల్ లోనే కాదు.. రియల్ లోనూ అదరగొట్టే డైలాగులు చెప్పటం రాములమ్మకు సింఫుల్ పని అన్నట్లు అనిపించకమానదు.ఏమైనా రాములమ్మా.. మజాకానా?
Tags:    

Similar News