MAA ఎన్నిక‌ల‌పై వ‌ర్చువ‌ల్ మీటింగ్ లో ఏం తేలుస్తారు?

Update: 2021-07-27 15:30 GMT
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల హంగామా చూస్తున్న‌దే. ఈసారి మునుపెన్న‌డూ లేనంత గా పోటీ క‌నిపిస్తోంది. ఏకంగా ఆరుగురు అధ్య‌క్ష ప‌ద‌విపై క‌న్నేసారు. అయితే ప్ర‌ధానంగా మంచు విష్ణు వ‌ర్సెస్ ప్ర‌కాష్ రాజ్ వార్ గురించే చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే ఎవ‌రికి వారు ప్ర‌చార‌బ‌రిలో ఉన్నారు. ఎన్నిక‌లు తేదీ ప్ర‌క‌టించ‌కుండానే ఎవ‌రికి వారు వ‌ర్గాలుగా ఏర్ప‌డి ప్ర‌చారం చేసుకుంటున్నారు. మ‌రోవైపు ఏక‌గ్రీవం చేయాలంటూ అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఈసారి ఏక‌గ్రీవం అవుతుందా?  పోటీ జ‌రుగుతుందా? అన్న‌దానిపై ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి స్ప‌ష్ఠ‌తా రాలేదు.

`మా` ఎగ్జిక్యుటివ్ బాడీ (ఈసీ) ప‌ద‌వి కాలం ఈ ఏడాది మార్చి తో ముగిసింది. కానీ క‌రోనా రాక‌తో ఎన్నికలు జ‌ర‌గ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఎప్పుడు జ‌ర‌పాల‌న్న దానిపై కూడా స్ఫ‌ష్ట‌త లేదు. ప్ర‌స్తుతం ఆ బాధ్య‌త‌ల‌న్నీ సీనియ‌ర్ న‌టుడు కృష్ణం రాజు చేతుల్లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. `మా` క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం అధ్య‌క్షుడిగా కృష్ణం రాజు  తొంద‌ర్లోనే ఈసీ సమావేశం నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వ‌హించాల‌న్న దానిపై ఈ ఐదుగురితో కూడుకున్న సినీపెద్ద‌ల బృందం నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉందని ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. `మా` బాడీలో ఉన్న మిగ‌తా స‌భ్యులంతా నిర్ణ‌యం క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికే వ‌దిలేసిన‌ట్లు స‌మాచారం.

తాజా స‌మాచారం మేర‌కు.. మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) వ‌ర్చువ‌ల్ సమావేశం ఈ బుధవారం లేదా గురువారం నిర్వహించనున్నారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో ఎన్నికల తేదీపై క్లారిటీ రానుంద‌ని తెలుస్తోంది. అంతా అనుకున్న‌ట్టే అయితే సెప్టెంబ‌ర్ లోనే ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తారు. మూడో వేవ్ రాకపోతే మా ఎన్నికలు సెప్టెంబర్ లో నిర్వ‌హించాల‌నే ప్ర‌తిపాద‌న సినీపెద్ద‌ల వ‌ద్ద‌కు వ‌చ్చింద‌ట‌. ఈసీ స‌మావేశంలో ఈ విష‌యంపై ఏదో ఒక‌టి క్లారిటీ రానుంది.

మా కార్య‌క‌లాపాలు ఆగ‌కుండా..

మూవీ ఆర్టిస్టుల సంఘంలో సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఆగ‌కుండా క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ ఈసీ స‌మావేశంలో మాట్లాడి నిర్ణ‌యాలు తీసుకుంది. జీవిత బీమా .. ఫించ‌ను కార్య‌క్ర‌మాలు స‌హా ఏవీ వాయిదా ప‌డ‌కుండా ఈసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక జీవిత కాల మెంబ‌ర్ షిప్ లు .. కొత్త మెంబ‌ర్ షిప్ ల‌పైనా నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో ఈసీ సభ్యులతో పాటుగా క్రమశిక్షణా సంఘ ఛైర్మన్‌ కృష్ణంరాజు స‌హా సినీపెద్ద‌లు ఉంటారు. వారితో పాటు న్యాయసలహాదారు.. ఆడిటర్ లు కూడా పాల్గొనున్నారు. ఇది వ‌ర్చువ‌ల్ మీటింగ్ అని కూడా తెలిసింది.

గొడ‌వ‌ల్ని అణిచేస్తారా?

గ‌డిచిన నాలుగేళ్లుగా మా అసోసియేష‌న్ వ‌రుస వివాదాల‌తో అప్ర‌తిష్ఠ పాలైంది. ఇదే విష‌యంపై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు బ‌హిరంగంగానే కామెంట్ చేశారు. దీనికి సీనియ‌ర్ న‌రేష్ చిన్న‌బుచ్చుకున్నార‌ని కూడా ఆయ‌న అన్నారు. అయితే ఇంత జ‌రిగినా కానీ.. ఇప్పుడు ఎన్నిక‌ల పేరుతో మ‌రోసారి ర‌చ్చ‌వుతోంది. వీకే న‌రేష్ వ‌ర్సెస్ ప్ర‌కాష్ రాజ్ ఎపిసోడ్స్ అనంత‌రం నాగ‌బాబు అండ్ టీమ్ ఇంట‌ర్వ్యూలు.. ఆ త‌ర్వాత బాల‌కృష్ణ మీడియా ఇంట‌ర్వ్యూలు.. మంచు విష్ణు ఇంట‌ర్వ్యూలు ఇవ‌న్నీ కూడా మాలో ఉన్న లొసుగుల‌ను బ‌య‌ట‌పెట్టాయి. సంఘంలో తార‌త‌మ్యాలు భేధాభిప్రాయాలు ఎలా ఉన్నాయో సామాన్యుల‌కు కూడా ఇ్పుడు క్లారిటీగా తెలిసింది. లొసుగులు ఏవి ఉన్నా మ‌న‌లో మ‌న‌మే చ‌ర్చించుకోవాల‌న్న పెద్దల నియ‌మాన్ని ఎవ‌రూ ఖాతరు చేయ‌లేదని ప్రూవైంది. అయితే ఈ స‌న్నివేశంపై చ‌ర్చ‌లు తీసుకునే దిశ‌గా వ‌ర్చువ‌ల్ మీటింగ్ లో కృష్ణం రాజు చర్చిస్తార‌ని పెద్ద‌రికం నెరుపుతార‌ని భావిస్తున్నారు. మంచి మాట టీవీ చానెళ్ల‌కు చెప్పాలి.. చెడ్డ మాట చెవిలో చెప్పాల‌ని ఇంత‌కుముందు మెగాస్టార్ చిరంజీవి సూత్రికరించిన‌ట్టు సభ్యుల్లో క‌ట్టుబాటు లేదెందుకో తేలాల్సి ఉంది.
Tags:    

Similar News