చిత్ర‌పురిలో మ‌హ‌మ్మారీ.. లైట్ తీస్కున్న క‌మిటీ?

Update: 2020-06-19 10:30 GMT
హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌రోనా విజృంభ‌ణ గురించి తెలిసిందే. మెజారిటీ ఏరియాల్లో కంటోన్ మెంట్ జోన్లు ఉన్నాయి. మ‌హ‌మ్మారీ ఎట్నుంచి ఎలా త‌రుముకొస్తోందో ఎవ‌రికీ తెలీని ప‌రిస్థితి ఉంది. ఇక వినోద‌ప‌రిశ్ర‌మ‌లోని కార్మికుల్లోనూ క‌రోనా క‌ల‌క‌లం చేల‌రేగ‌డం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ప‌రిశ్ర‌మ 24 శాఖల కార్మికులు కొలువుండే చిత్ర‌పురి కాల‌నీలో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. దాదాపు 10 వేల మంది కార్మికులు నివ‌శించే కాల‌నీ ఒక్క‌సారిగా ఉలిక్కిపాటుకు గురైంది.

చిత్ర‌పురి -ఎల్.ఐ.జీ బ్లాక్ సింగిల్ బెడ్ రూమ్స్ లో ఎల్- 16 భ‌వంతిలో కొవిడ్ 19 ఒక‌రికి పాజిటివ్ అని తేల‌డంతో కాల‌నీ అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా పాజిటివ్ అని ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ కాగానే ఆ కార్మికుడు గాంధీ ఆస్ప‌త్రిలో చేరారు. ఇక అదే అపార్ట్ మెంట్ లో భ‌ర్త‌కు పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిశాక భార్య‌కు ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌డంతో ఒక‌టే ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. ఇక వారికి ఒక పాప ఉన్నార‌ని దాంతో ఆ కుటుంబం ఎంతో ఆందోళ‌న చెందుతున్నార‌ని చెబుతున్నారు. ఇక ఆ కుటుంబంతో కాంటాక్ట్ అయిన వారంద‌రినీ వెంట‌నే కొవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా కాల‌నీ వాసులు అప్ర‌మ‌త్తం చేశారు. అయితే చిత్ర‌పురిలో ఏ స‌మ‌స్య వ‌చ్చినా ప‌ట్టించుకోని క‌మిటీ ఇప్పుడు కొవిడ్ విష‌యంలోనూ స‌రిగా స్పందించ‌డం లేద‌ని ప‌లువురు కాల‌నీ వాసులు వాట్సాప్ గ్రూపుల్లో ఆరోపించారు. అలాగే కొవిడ్ 19 విష‌యంలో కాల‌నీ వాళ్ల‌తో అధికారుల కోఆర్డినేష‌న్ స‌రిగ్గా లేద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

అనంత‌రం అప్ర‌మ‌త్త‌మైన క‌మిటీ స‌భ్యులు కాల‌నీలో హై అలెర్ట్ ని ప్ర‌కటించారు. చిత్ర‌పురిలో LIG & EWS కుటుంబ సభ్యులంతా 20 రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ లో ఉండాల‌ని క‌మిటీ కోరంది. ఇప్పటికే ఇతరులు ఎవరైనా ( బంధుమిత్రులు) ఫ్లాట్స్ లో ఉంటే శుక్ర‌వారం సాయంత్రం లోపు పంపించేయాల్సిందిగా క‌మిటీ కోరింది. బ్యాచిలర్స్ ఫ్లాట్స్ లో KYC ఉన్న‌వాళ్లు మాత్రమే ఉండాలి. KYC లేని ఫ్రెండ్స్ వెంటనే వెళ్ళిపోవాల‌ని.. లేకపోతే ఆఫీస్ నుండి ఫ్లాట్ కు వచ్చి చెక్ చేసి పంపిస్తార‌ని హెచ్చ‌రించారు. అలాగే బయటకు వెళ్లిన వారు 10రోజుల‌కు సరిపడా నిత్యావసర వస్తువులు తెచ్చి పెట్టుకోవాల‌ని.. కాల‌నీలో ఎవ‌రూ బయట గుంపులు గుంపులుగా ఉండరాదని ప్ర‌క‌టించారు. ముఖ్యంగా పిల్ల‌లు.. పెద్దవారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చినదని అలెర్ట్ చేశారు. ఇక కాల‌నీలో కేసులు అధిక‌మైతే గేట్ నుండి ఎవరిని బయటకు కానీ లోపలికి కానీ అనుమ‌తించ‌ర‌ని.. పోలీసుల కంట్రోల్ లోకి వెళుతుంద‌ని హెచ్చ‌రించారు. అస‌లే తిండికి లేక న‌క‌న‌క‌లాడుతున్న సినీకార్మికుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ఈ క‌ష్ట‌కాలం నుంచి గ‌ట్టెక్కేదెలా? అన్న ఆందోళ‌న ప్ర‌తి ఒక్క‌రినీ నిలువ‌నీయ‌డం లేదు.
Tags:    

Similar News