థ్రిల్లర్ సినిమాను తలపించిన నాజర్ గెలుపు

Update: 2015-10-19 07:44 GMT
అత్యంత ఆసక్తి రేపిన నడిగర్ సంఘం ఎన్నికలు ముగిశాయి. మన ‘మూవీ ఆర్టిస్ట్’ ఎన్నికల తరహాలోనే అక్కడా సంచలన ఫలితమే వచ్చింది. అప్పటిదాకా ఏళ్లకు ఏళ్లు సంఘాన్ని ఏలుతున్న వారికి చెక్ పెట్టి.. వాళ్లను ప్రశ్నిస్తూ వచ్చిన కొత్త కార్యవర్గానికే పట్టం కట్టారు అక్కడి సభ్యులు. ఐతే ‘మా’ ఎన్నికలకు, నడిగర్ సంఘం ఎన్నికలకు కొన్ని తేడాలున్నాయి. మన ‘మా’లో సభ్యుల సంఖ్య చాలా తక్కువ. మొత్తం కలిపితే వెయ్యి మంది సభ్యులే. అందులో ఓటు హక్కు వినియోగించుకున్నది దాదాపు వెయ్యి మంది. కాబట్టి సంచలన ఫలితం రావడానికి స్కోప్ బాగానే ఉంది.

కానీ నడిగర్ సంఘం సంగతి అలా కాదు. అందులో 3 వేల మంది సభ్యులున్నారు. చెన్నై అనేది ఒకప్పుడు సౌత్ సినిమాకే కేంద్రం కావడంతో మన తెలుగువారితో పాటు వేరే భాషల నటీనటులకు కూడా అందులో సభ్యత్వముంది. అందుకే నంబర్ పెద్దది. ఇలాంటపుడు సంచలన ఫలితం రావడానికి ఛాన్సులు తక్కువే. అయినప్పటికీ విశాల్-నాజర్-కార్తి వర్గం జయకేతనం ఎగురవేసింది.

మొత్తం ఎన్నికల్లో రసవత్తరమైన గెలుపు అంటే నడిగర్ సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసిన నాజర్ దే. నిజానికి కౌంటింగ్ ఆరంభం నుంచి నాజర్ వెనకబడే ఉన్నారు. మొదట విశాల్, కార్తి కూడా వెనకబడ్డారు కానీ.. తర్వాత వాళ్లిద్దరూ పుంజుకున్నారు. కానీ నాజర్ మాత్రం దాదాపు చివరి దాకా వెనకబడే ఉన్నారు. ఓ దశలో శరత్ కుమార్ అధ్యక్షుడిగా, విశాల్ జనరల్ సెక్రటరీగా ఎన్నికవడం ఖాయమని అంతా అనుకున్నారు. అప్పటికి విశాల్ ను విజేతగా కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత మొదలైంది అసలు డ్రామా.

ఓ దశలో శరత్ కుమార్ 800 పైగా ఓట్లతో ఉన్నపుడు.. నాజర్ దాదాపు 150 వెనకబడి ఉన్నారు కానీ తర్వాత అంతరం తగ్గుతూ వచ్చి.. శరత్ 945 ఓట్లకు, నాజర్ 920 ఓట్లకు చేరుకున్నారు. అప్పుడు ఉత్కంఠ నెలకొంది. కాసేపటి తర్వాత అనూహ్యంగా అంతరం ఇంకా తగ్గి శరత్ 962-నాజర్ 960 మీద నిలిచారు. ఇక్కడి నుంచి నాజర్ హవా మొదలైంది. కాసేపటికే ఆధిక్యంలోకి దూసుకెళ్లిన నాజర్ చివరికి 1344-12311 ఓట్ల తేడాతో శరత్ కుమార్ ను ఓడించి అధ్యక్ష పదవికి ఎన్నికై సంచలనం రేపారు.
Tags:    

Similar News