వాల్తేరు వీర‌య్య Vs వీరసింహారెడ్డి: చిరంజీవి ఏమ‌న్నారు?

Update: 2022-12-28 04:04 GMT
2023 సంక్రాంతి అభిమానుల‌కు చాలా ప్ర‌త్యేక‌మైన ఈవెంట్ గా మారుతోంది. ఈసారి సంక్రాంతి బ‌రిలో పందెం పుంజులు నువ్వా? నేనా? అంటూ పోటీప‌డ‌బోతున్నాయి. టాలీవుడ్ లో ఇద్ద‌రు మాస్ హీరోలు న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ కి కొత్త క‌ళ తేబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన వాల్తేరు వీర‌య్య... న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన వీర‌సింహారెడ్డి బాక్సాపీస్ వద్ద కాలు దువ్వుతున్నాయి. ఎన్న‌డూ లేనంత ఉత్సాహం ఇటు మెగాభిమానులు అటు నంద‌మూరి అభిమానుల్లో క‌ట్ట‌లు తెంచుకుంటోంది.

అయితే దీనిపై సోష‌ల్ మీడియాల్లో రకర‌కాల డిబేట్లు న‌డుస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ వ‌ర్సెస్ నంద‌మూరి ఫ్యాన్స్ న‌డుమ వార్ గురించి తెలిసిన‌దే. కానీ ఇరువురు హీరోల మ‌నోగ‌తం ఎలా ఉంది? అన్న‌ది తెలుసుకునేందుకు తాజాగా వాల్తేరు వీర‌య్య ప్ర‌మోష‌న్స్ లో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు అడిగిన ప్ర‌శ్న ఆస‌క్తిని క‌లిగించింది.

సంక్రాంతి పుంజుల్లా ఎప్పుడూ పోటీప‌డే చిరంజీవి- బాల‌కృష్ణ చాలా కాలానికి మ‌రోసారి సంక్రాంతి బ‌రిలో వ‌స్తున్నారు. ఇప్పుడు బాల‌య్య‌తో పోరు విష‌యంలో చిరు అండ్ టీమ్ ఆలోచ‌న ఎలా ఉంది? అని ప్ర‌శ్నించ‌గా అందుకు మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తి దాయ‌క‌మైన జ‌వాబిచ్చారు.

మీ(చిరు) సినిమా సంక్రాంతి కి రావ‌డం.. సంక్రాంతి పండ‌గ‌ను అభిమానులు బాగా సెల‌బ్రేట్ చేసుకోవ‌డం.. ఇంత‌కుముందు కూడా బాల‌కృష్ణ గారి సినిమాలు పోటీప‌డటం ..ఇరు సినిమాలు వ‌సూళ్ల‌ను షేర్ చేసుకోవ‌డం తెలిసిన‌దే. కానీ ఈ రెండు సినిమాల‌కు నిర్మాత‌లు ఒక‌రే కావ‌డంతో ఇది చాలా ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భం. థియేట‌ర్ల ప‌రంగా ప‌బ్లిసిటీ ప‌రంగా నిర్మాత‌ల కాన్ స‌న్ ట్రేష‌న్ ప‌రంగా ప‌రిశీలిస్తే మీకేమ‌నిపించింది? అంటూ చిరుని జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు ప్ర‌శ్నించారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-"మాకు నిర్మాత‌లు చాలా ముఖ్యం. మేం న‌టించాం. ఆ త‌ర్వాత మేం ఇన్వాల్వ్ కాము. ఈ రెండు సినిమాలు నిర్మాత‌ల‌కు రెండు క‌ళ్లు. క‌న్న‌బిడ్డ‌లు. రెండిటిలో ఏ క‌న్ను పొడుచుకుంటారు? రెండూ బాగా ఆడాలని కోరుకుంటాం" అని చిరంజీవి స్ఫూర్తివంతంగా మాట్లాడారు.

వెంట‌నే మైత్రి మూవీ మేక‌ర్స్ అధినేత ర‌విశంక‌ర్ మైక్ అందుకుని మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా త‌మ‌తో రెండు సినిమాలు బాగా ఆడాల‌ని కోరుకున్నార‌ని ఆ మాట‌ను చాలా సార్లు త‌మ‌తో అన్నార‌ని అన్నారు. చిరంజీవి స‌హా మెగా ఫ్యాన్స్ నుంచి బాల‌య్య సినిమాకి చ‌క్క‌ని స‌హ‌కారం ఉంద‌ని అన్నారు. అలాగే ఇరు సినిమాలు భారీ ఓపెనింగుల‌తో స్టార్ట‌వుతాయ‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసారు. ఈ రెండు భారీ బ‌డ్జెట్ల‌తో తెర‌కెక్కుతున్న సినిమాలు. వాల్తేరు వీర‌య్య జ‌న‌వ‌రి 13న విడుద‌ల‌వుతుంటే వీర‌సింహారెడ్డి జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌వుతోంది. ఒక‌రోజు గ్యాప్ తో పోటీప‌డుతున్న రెండు సినిమాలు బాగా ఆడాల‌ని అంతా కోరుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News