దిల్ రాజుకు గ‌ట్టి పోటీ ఇచ్చాడు కానీ..

Update: 2022-04-30 08:30 GMT
ఎప్పుడూ ఒక్క‌రిదే ఆధిప‌త్యం అయితే మోనోప‌లి స‌మ‌స్య త‌లెత్త‌డం ఖాయం. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూష‌న్ విష‌యంలోనూ గ‌త కొన్నేళ్లుగా ఇదే జ‌రుగుతోందా? అంటే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అవున‌నే చెబుతున్నాయి. నైజాం లో ఏ స్టార్ హీరో సినిమా విడుద‌ల కావాల‌న్నా దాని వెన‌క స్టార్ ప్రొడ్యూస‌ర్‌, డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజు వుండాల్సిందే. ఆయ‌న లేకుండా ఇక్క‌డ ఏ స్టార్ సినిమా థియేట‌ర్ల‌లకు రావ‌డం లేదు. అంత‌గా మోనోప‌లి చేస్తున్నారాయ‌న‌.

ఇది గ‌త కొన్ని నెల‌లుగా ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దాన్ని బ్రేక్ చేయాల‌నే స‌దుద్దేశ్యంతో రంగంలోకి దిగారు వ‌రంగ‌ల్ శ్రీ‌ను. జిల్లా కేంద్రానికి స‌మీపంలోని ఆత్మ‌కూరుకు చెందిన వ‌రంగ‌ల్ శ్రీ‌ను అంచ‌లంచెలుగా ఎదురుగుతూ నైజాం డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో పాపులారిటీని సొంతం చేసుకుని ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తున్నారు. గ‌త కొంత కాలంగా పోటీ లేకుండా దిల్ రాజు భారీ చిత్రాల‌ని విడుద‌ల చేస్తూ వ‌చ్చారు. అయితే అత‌నికి నైజాం రీజియ‌న్ లో గ‌ట్టిని ఇవ్వాల‌ని ప్ర‌యత్నాలు చేస్తూ వ‌స్తున్నాడు వ‌రంగ‌ల్ శ్రీ‌ను.

మాస్ మహారాజా ర‌వితేజ న‌టించిన హై వోల్టేజ్ మూవీ 'క్రాక్‌' చిత్రంతో ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆక‌ర్షించారు. ఈ సినిమా 2021 జ‌న‌వ‌రి 9న విడుద‌లైం. దీని త‌రువాత వెంట‌నే అంటే నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో విజ‌య్ హీరోగా న‌టించిన డ‌బ్బింగ్ మూవీ 'మాస్ట‌ర్‌'ని రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం 'క్రాక్‌' థియేట‌ర్ల‌ని చాలా వ‌ర‌కు తొల‌గించ‌డంతో అస‌లు ర‌చ్చ మొద‌లైంది. ఈ స‌మ‌యంలో గ‌ట్టిగా వాదించి వార్తల్లో నిలిచారు వ‌రంగ‌ల్ శ్రీ‌ను. ఈ సినిమా నైజాం డిస్ట్రి బ్యూష‌న్ రంగంలో ఏర్ప‌డిన వార్ ని బ‌హిర్గ‌తం చేసింది. ఇక్క‌డి నుంచే డిస్ట్రిబ్యూట‌ర్ల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధానికి తెర‌లేపింది.

ఆ త‌రువాత దిల్ రాజుకు పోటీగా చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన వ‌రంగ‌ల్ శ్రీ‌ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టించిన 'ఆచార్య‌' మూవీ నైజాం ఏరియా డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కుల్ని అత్యంత బారీ మొత్తానికి దిల్ రాజుకు ఎదురెళ్లి మ‌రీ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా నైజాం హ‌క్కుల కోసం వ‌రంగ‌ల్ శ్రీ‌ను పెట్టిన మొత్తం 42 కోట్లు. ఇది నైజాం డిస్ట్రిబ్యూష‌న్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధికం కావ‌డంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.

దిల్ రాజుపై రివేంజ్ కోసం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించిన వ‌రంగ‌ల్ శ్రీ‌ను సినిమా ఫ‌లితం తారుమారు కావ‌డంతో ఇప్ప‌డు తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కున్న‌ట్టుగా చెబుతున్నారు. భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన 'ఆచార్య' ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ నిరుత్సాహాన్నివ్య‌క్తం చేస్తున్నారు.

దీంతో ఈ సినిమా కార‌ణంగా వ‌రంగ‌ల్ శ్రీ‌ను 50 శాతం న‌ష్టాల‌ని చ‌విచూడాల్సి వ‌చ్చేలా వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. న‌ష్ట‌పోయినా స‌రే దిల్ రాజుని నైజాంలో క‌ట్ట‌డి చేయాల‌న్న వ‌రంగ‌ల్ శ్రీ‌ను ప‌ట్టుద‌ల‌ని అబినందించాల్సిందే అంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నం. ఈ న‌ష్టాల నుంచి కోలుకుని వ‌రంగ‌ల్ శ్రీ‌ను మ‌ళ్లీ పుంజుకోవాల‌ని, మ‌రిన్ని భారీ చిత్రాల‌ని నైజాం రీజియ‌న్ లో డిస్ట్రిబ్యూట్ చేయాల‌ని అంతా అంటున్నారు.
Tags:    

Similar News