పూరి గుడిసెలో ఉన్న దాసరిని చూసి బాధపడ్డాం!

Update: 2021-11-17 04:30 GMT
దాసరి నారాయణరావు .. తెలుగు సినిమాను కొన్ని దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన రచయిత - దర్శకుడు .. నటుడు .. నిర్మాత. చిన్నప్పటి నుంచి నాటకాల పట్ల ఆయనకి గల ఆసక్తి ఆయనను సినిమాల దిశగా నడిపించింది. ఆయనకి సినిమాల్లో ఎలా అవకాశం వచ్చింది అనే విషయాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన సోదరుడు ప్రస్తావించారు. "ఒకసారి నారాయణరావు 'పన్నీరు - కన్నీరు' అనే నాటకం రాసి హైదరాబాద్ 'రవీంద్రభారతి'లో ప్రదర్శించాడు. ఆ నాటకాన్ని వై.కృష్ణయ్య చూశారు. ఆయన 'అందం కోసం పందెం' నిర్మాత.

ఆయన నారాయణరావును మద్రాసు రమ్మన్నారు .. తన సినిమాలో వేషం ఇస్తానన్నారు. నారాయణరావు వెళ్లకపోవడంతో ఆయన మళ్లీ లెటర్ రాశారు. దాంతో నారాయణరావు మద్రాసు వెళ్లి ఆయనను కలిశారు. అప్పటికి ఈయన కోసం అనుకున్న వేషాన్ని కమెడియన్ బాలకృష్ణకి ఇచ్చారు. వెనక్కి వచ్చేద్దామని నారాయణరావు అనుకుంటే, తొందరపడొద్దని చెప్పి కృష్ణయ్య గారు వారించారు. స్క్రిప్ట్ పై నారాయణరావుకు మంచి పట్టు ఉందని తెలిసిన ఆయన, వీటూరి దగ్గర పెట్టారు. అక్కడ కొంతకాలం పాటు పనిచేశారు. అలాగే మరికొంతమంది దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు.

ఒకసారి నేను .. మా ఆవిడ తిరుపతి వెళుతూ నారాయణరావును కలుసుకుందామని వెళ్లాము. 'తేనాంపేట'లో చిన్న పూరి గుడిసెలో అద్దెకు ఉన్నాడు. అలా ఆయనను చూసి మేము చాలా బాధపడ్డాము. భార్య మాత్రం చాలా మంచిది .. ధనవంతురాలు ఆమె. ఇంట్లోకి కావాల్సినవన్నీ ఆమె తరఫు నుంచే వచ్చేవి. నారాయణరావుకు ఆర్థికపరమైన సపోర్టును ఇస్తూ ప్రోత్సహించింది ఆమెనే. వాళ్లింటికి మేము వెళ్లేసరికి తెల్లవారు జాము 2:30 .. 3:00 గంటలు అవుతోంది. అప్పటికి ఆయన స్క్రిప్ట్ రాస్తున్నాడు. అది 'మా నాన్న నిర్దోషి' అనే సినిమాకి స్క్రిప్ట్. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ నని చెప్పాడు.

ఆ తరువాత స్క్రిప్టులు .. డైలాగులు రాస్తూ .. దర్శకత్వం చేస్తూ ముందుకు వెళ్లాడు. ఆయనను ఒక పొజీషన్ లో చూసిన తరువాత మాకు చాలా ఆనందం కలిగింది. మా వెనుక కొండంత అండగా ఉన్నాడనే ధైర్యం వచ్చింది. సినిమాల్లోకి వెళ్లడానికి ముందు కొన్ని ఉద్యోగాలు చేశాడు. కాకపోతే నెలకి రెండు కంపెనీలు మారేవాడు. పనిచేసే చోట నాటకాల రిహార్సల్స్ పెట్టేసేవాడు. దాంతో వాళ్లు ఒక నమస్కారం పెట్టేసి మాన్పించేవారు. ఆ తరువాత ఎంత సంపాదించినా ఎప్పుడూ కూడా మాలోఎవరినీ కూడా చిన్నచూపు చూడలేదు. ఎంతో ప్రేమించేవాడు .. ఎంతో గౌరవించేవాడు. మా అందరితో కలిసే భోజనం చేసేవాడు" అని ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు.
Tags:    

Similar News