అక్ష‌య్ 'ర‌క్షా బంధ‌న్' ప‌రిస్థితేంటీ?

Update: 2022-08-12 06:51 GMT
బాలీవుడ్ గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ లేక వెల వెల బోతోంది. ఏ ఒక్క స్టార్ అయినా బాలీవుడ్ కు బిగ్ బ్యాంగ్ లాంటి హిట్ ని అందించిన మ‌ళ్లీ పూర్వ వైభ‌వాన్ని తీసుకురాక‌పోతాడా? అని బాలీవుడ్ వ‌ర్గాలు ఆశ‌గా ఎదురుచూస్తున్నాయి. అయితే వారి ఆశ ప్ర‌తీసారి అడియాశ‌గానే మిగిలిపోతోంది. ప్ర‌తీ శుక్ర‌వారం బాలీవుడ్ కు గుడ్ ఫ్రైడేగా మారుతుందేమోన‌ని క‌ళ్ల‌ల్లో ఒత్తులేసుకుని చూస్తున్న స్టార్స్ కి, డైరెక్ట‌ర్స్‌, మేక‌ర్స్ కు ప్ర‌తీ ఫ్రైడే తీవ్ర నిరాశ‌నే మిగులుస్తూ షాకిస్తోంది.

ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ దృష్టి శుక్ర‌వారం నుంచి గురువారం వైపు మ‌ళ్లింది. కార‌ణంగా ఆగ‌స్టు 11న గురువారం అమీర్ ఖాన్ న‌టించిన 'లాల్ సింగ్ చ‌డ్డా' విడుద‌లైంది. ఇదే రోజు అక్ష‌య్ కుమార్ న‌టించిన 'ర‌క్షా బంధ‌న్‌' కూడా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. బాయ్ కాట్ నినాదాల కార‌ణంగా అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చ‌డ్డా' రిలీజ్ కు ముందు నుంచే పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జ‌ర‌క్క‌పోవ‌డంతో సినిమా ఫ‌లితం త‌రువాత అయినా పుంజుకుంటుందేమో అనుకున్నారు.

కానీ అంద‌రి అంచ‌నాల‌ని త‌ల‌కిందులు చేస్తూ అమీర్ ఖాన్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద తీవ్ర స్థాయిలో నిరాశ‌కు గురిచేసి షాకిచ్చింది. ఇక ఈ మూవీ ప‌రిస్థితి ఇలా వుంటే ఇదే రోజు అక్ష‌య్ కుమార్ న‌టించిన 'ర‌క్షా బంధ‌న్' థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. చాలా చోట్ల నెగెటివ్ టాక్ వున్నా.. కొన్ని చోట్ల మాత్రం ఈ మూవీకి పాజిటివ్ టాక్ వుంది. బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ మూవీకి మంచి రేటింగ్స్ ని అందించారు. కొన్ని ఇంగ్లీష్ డైలీస్ మాత్రం 1.5 రేటింగ్ ని ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

అమీర్ సినిమా 'లాల్ సింగ్ చ‌డ్డా' భ‌విత‌వ్యం తేలిపోవ‌డంతో అక్ష‌య్ 'ర‌క్షా బంధ‌న్‌' మౌత్ టాక్ తో పుంజుకుంటుందా? అని బాలీవుడ్ ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. పెళ్లీడుకొచ్చిన న‌లుగురు చెల్లెళ్ల బాధ్య తీసుకున్న ఓ ఛాట్ దేకాణం వాలా క‌థ‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇందులో అక్ష‌య్ పాత్ర పేరు కేదార్‌. న‌లుగురు చెల్లెళ్ల‌లో ఒక్కొక్క‌రికి ఒక్కో మైన‌స్ పాయింట్ వుంటుంది. కేదార్ చేసే పానీ పూరి తింటే గ‌ర్భ‌వ‌తుల‌కు మ‌గ సంతానం క‌లుగుతుంద‌ని ప్ర‌తీ ఒక్క‌రి సెంటిమెంట్. దీంతో కేదార్ పానీ పూరి సెంట‌ర్ ఫుల్ గిరాకీతో క‌ల‌క‌ల‌లాడిపోతూ వుంటుంది.

కేదార్ చిన్న‌నాటి స్నేహితురాలు స్వ‌ప్న (భూమీ పెడ్నేక‌ర్‌) ని పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. కానీ చెల్లెళ్ల పెళ్లిల కార‌ణంగా వాయిదా వేస్తూ వుంటాడు. చివ‌రికి త‌న కోసం ఎదురుచూస్తున్న చిన్న‌నాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడా? .. త‌న న‌లుగురు చెల్లెళ్ల‌కు పెళ్లిళ్లు చేశాడా? అన్న‌దే 'ర‌క్షా బంధ‌న్' క‌థ‌. షారుఖ్ తో 'జీరో', ధ‌నుష్ తో రాంఝానా, అత్రంగీరే వంటి చిత్రాల‌ని అందించిన ఆనంద్ ఎల్ రాయ్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

అన్నా చెల్లెళ్ల అనుబంధం నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్ డ్రామాగా ఈ మూవీని తెర‌కెక్కించాల‌ని ఆనంద్ చేసిన ప్ర‌య‌త్నం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. మెలో డ్రామా మ‌రీ ఎక్కువ కావ‌డంతో ఈ మూవీ కామెడీ కాస్తా ట్రాజెడీగా మారింది. మ‌న 'హిట్ల‌ర్‌'ని తీసుకుని ఎమోష‌న్స్ ని జోడించి రీమేక్ చేసినా ఫ‌లితం మ‌రోలా వుండేదేమో.
Tags:    

Similar News