వైరల్ అవుతోన్న ఆడియోపై బండ్ల గణేశ్ ఏమన్నారంటే..?

Update: 2022-02-22 13:30 GMT
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అంటే నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ కి ఎంత అభిమానమో ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి తెలిసిన విషయమే. ఎప్పుడూ పవన్ నామస్మరణ చేస్తూ.. సినిమా ఈవెంట్ లలో తన అభిమాన హీరోని ఉద్దేశిస్తూ స్టేజి మీద పూనకం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు బండ్ల. అయితే పవన్ నటించిన లేటెస్టు మూవీ 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్లకు ఆహ్వానం లేదనే న్యూస్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ నేపథ్యంలో ఓ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడినట్లు ఓ ఆడియో క్లిప్ నెట్టింట నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది. తనకు 'భీమ్లా నాయక్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కు ఆహ్వానించలేదని.. తాను వస్తే త్రివిక్రమ్ డౌన్ అవుతాడని రానివ్వకుండా చేస్తున్నారని ఆ ఆడియోలో చెప్పబడింది. అలానే వైసీపీ వాళ్ళతో కలిసి త్రివిక్రమ్ ఏదో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పడం అనేక సందేహాలు రేకెత్తేలా చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ఆడియో ఫైల్ నిజమా కాదా? అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ఎన్నో పుకార్లు - ఊహాగానాలు వినిపించాయి. దీనిపై బండ్ల క్లారిటీ ఇస్తారని అంతా భావిస్తున్న తరుణంలో.. బండ్ల గణేష్‌ స్వయంగా రంగంలోకి దిగి ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో దుమ్ముదుమారం చేయడం.. లీకైన ఆడియో గురించి ఏ ట్వీట్ లోనూ ప్రస్తావించకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది.

దీంతో అసలు బండ్ల గణేష్‌ విషయంలో ఏం జరుగుతుందన్న వార్తలు సోమవారం నుంచి తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరల్‌ అవుతోన్న ఆడియో క్లిప్‌ పై ఓ న్యూస్ ఛానల్ గణేశ్ నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం చేసింది. దీనిపై బండ్ల స్పందిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆడియో తనది కాదని కొట్టి పారేశారని సదరు న్యూస్ ఛానల్ లో పేర్కొన్నారు. ఈ విషయంపై తాను స్పందించనని తేల్చి చెప్పినట్లు రాసుకొచ్చారు.

ఆడియో తనది కాదంటూనే.. దీనిపై తాను స్పందించనని బండ్ల గణేష్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అవి బండ్ల గణేష్‌ మాటలు కాకపోతే.. ఆ ఆడియోలో మాట్లాడింది ఎవరు? త్రివిక్రమ్ శ్రీనివాస్ ని మధ్యలో పెట్టి బండ్లను ఎందుకు టార్గెట్ చేసారు? అంత అవసరం ఎవరికి ఉంది? ఆలీకి రాజ్యసభ సీటు.. వైసీపీ నాయకుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? అని చర్చ జరుగుతోంది.

సోమవారం జరగాల్సిన 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. రేపు బుధవారం హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం ఈ ఫంక్షన్ ను నిర్వహించబోతున్నారు. మరి తన దేవర సినిమా ఈవెంట్ కు బండ్ల గణేష్ హాజరై ఈ ఊహాగానాలకు చెక్ పెడతారా? త్రివిక్రమ్ కు తనకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని క్లారిటీ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

కాగా, బండ్ల గణేష్ మాట్లాడినట్లు లీకైన ఆడియోలో త్రివిక్రమ్ ను అసభ్య పదజాలంతో దూషించినట్లు ఉంది. అలానే తనకు భీమ్లా ఈవెంట్ కు రావాలని ఉందని.. స్పీచ్ కు రెడీ చేసుకున్నానని అన్నారు. ఆడిటోరియంలో అందరూ బండ్లన్న.., బండ్లన్న రావాలి అని గట్టిగా అరిస్తే అక్కడ ప్రత్యక్షమవుతానన్నారు. ఇందులో నిజమెంత అని పవన్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్న తరుణంలో బండ్ల చేసిన ట్వీట్స్ చర్చనీయాంశంగా మారాయి.

అంజనీ పుత్ర పవన సుత నామ.. ఊరకే ఎవరికీ రాదు.. అందరూ పుడుతుంటారు చచ్చిపోతుంటారు కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు మా దేవర పవన్ కళ్యాణ్. పవన్ అంటే వాయువు.. అది లేని చోటు భూమిపై లేదు.. పవన్‌ పై అభిమానం కూడా వాయువులా అనంతం. జై పవన్ కళ్యాణ్. సూర్యుడి తేఙస్సుకు చంద్రుడి చల్లదనానికి పవన్‌ పై అభిమానానికి ఎక్సపయిరీ డేట్ లేదు అంటూ బండ్ల గణేష్ తనదైన శైలిలో ట్వీట్స్ చేసారు. అంతకముందు ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించినా బాధపడకండి అంటూ కొన్ని ఆసక్తికరమైన కొటేషన్స్ షేర్ చేయడం గమనార్హం.
Tags:    

Similar News