అసలు బాలీవుడ్ కు ఏమైంది..?

Update: 2022-07-26 02:30 GMT
ఇటీవల కాలంలో లార్జర్ థెన్ లైఫ్ సినిమాలు మరియు భారీ యాక్షన్ చిత్రాలను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని అర్థం అవుతోంది. 'ఆర్.ఆర్.ఆర్' 'కేజీఎఫ్ 2' 'పుష్ప: ది రైజ్' 'విక్రమ్' వంటి సినిమాలను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. కాకపోతే ఇది కేవలం సౌత్ చిత్రాల విషయంలోనే నిజమవుతోందని బాలీవుడ్ సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ని బట్టి తెలుస్తోంది

గత కొంతకాలంలో హిందీ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోతున్నాయి. వందల కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కించిన చిత్రాలు సైతం మినిమమ్ ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోతున్నాయి. లేటెస్టుగా బాక్సాఫీస్ వద్దకు వచ్చిన ''షంషేరా'' మూవీ కూడా దారుణమైన వసూళ్లతో ఘోర పరాజయం దిశగా పయనిస్తోంది.

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ డ్యూయెల్ రోల్ లో యష్‌ రాజ్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో 'షంషేరా' మూవీ తెరకెక్కింది. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదొక ప్లాప్ రివేంజ్ డ్రామా అని విమర్శకులు తేల్చేశారు. దీనికి తగ్గట్టుగానే సినిమా ఓపెనింగ్స్ చాలా బలహీనంగా ఉన్నాయి.

'షంషేరా' చిత్రానికి ఫస్ట్ డే రూ. 10.25 కోట్లు వస్తే.. రెండో రోజు 10.50 కోట్లు - సండే రూ. 11 కోట్లు వచ్చాయి. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ తో పోల్చి చూస్తే వచ్చిన కలెక్షన్స్ దారుణంగా భారీ నష్టాలు తెప్పేలా లేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి బాలీవుడ్ ఖాతాలో మరో డిజాస్టర్ పడినట్లే అని చెప్పాలి.

నిజానికి 'బాహుబలి' తర్వాత ఆ రేంజ్ లో సినిమాలు చేయాలని.. అంతకుమించి రికార్డులు బద్దలు కొట్టాలని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ ప్రతీసారి చేతులు కాల్చుకుంటూనే ఉన్నారు. పాండమిక్ తర్వాత అయితే హిందీ చిత్రాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. క్రేజీ కాంబినేషన్లు.. బిగ్ స్టార్స్ తో చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి.

'83' 'గంగుబాయి' ‘ఎటాక్’ 'బచ్చన్ పాండే' ‘జెర్సీ’ 'రన్ వే 34' 'హీరోపంతి 2' ‘జయేష్ భాయ్ జోర్దార్’ ‘ధాకడ్’ 'సామ్రాట్ పృథ్వీరాజ్' వంటి పలు హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలు చవిచూశాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవగా.. 'జుగ్ జుగ్ జీయో' చిత్రం పర్వాలేదనిపించింది.

'భూల్ బులయ్యా 2' సినిమా సక్సెస్ అవ్వడంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లే అని అనుకుంటుండగా.. ఇప్పుడు 'షంషేరా' చిత్రంతో గట్టి దెబ్బ పడింది. కేవలం భారీతనం అదనపు హంగుల మీద దృష్టి పెట్టి కంటెంట్ ను లైట్ తీసుకోవడం.. ప్రమోషన్లను గాలికి వదిలేయడంతోనే ఆశించిన ఫలితం దక్కలేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ ఆశలన్నీ రాబోయే 'లాల్ సింగ్ చద్దా' మరియు 'బ్రహ్మాస్త్ర' పార్ట్-1 సినిమాలపైనే ఉన్నాయి.

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' సినిమాలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలు పోషించారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ కామెడీ డ్రామా ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగులో ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు.

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'బ్రహ్మాస్త్ర' సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సోషల్ ఫాంటసీ చిత్రంలో రణబీర్ కపూర్ - అలియా భట్ - అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. సౌత్ లో ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు. మరి 'లాల్ సింగ్ చడ్డా' 'బ్రహ్మాస్త్ర' సినిమాలైనా బాలీవుడ్ కు పూర్వవైభవం తీసుకొస్తాయో లేదో చూడాలి.
Tags:    

Similar News