యాభై రోజుల క‌శ్మీర్‌ ఫైల్స్ ఏం సాధించిందంటే ?

Update: 2022-05-01 00:30 GMT
వివాదాలు ఎన్ని ఉన్నా కూడా యాభై రోజుల మైలు రాయిని దాటింది క‌శ్మీరు ఫైల్స్. ఈ సంద‌ర్భంగా చిత్ర వ‌ర్గాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి. భావోద్వేగాల‌ను క‌ట్ట‌డి చేసుకోలేని రీతిలో ఈ సినిమా ఉంద‌ని ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఇప్ప‌టికే ట్వీట్లు చేశారు కూడా ! ఇదే స‌మ‌యంలో ఈ సినిమాలో కొన్నే వాస్త‌వాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఏదేయితేనేం త్వ‌ర‌లో తెలుగులో కూడా ఈ సినిమా ఓటీటీ ద్వారా రానుంది. తెలుగుతో పాటు ప‌లు ప్రాంతీయ భాష‌ల‌లో ఈ సినిమా విడుద‌ల చేసేందుకు ఓటీటీ వ‌ర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. దీంతో ఈ సినిమా మ‌రిన్ని వ‌ర్గాల‌కు చేరువ అయ్యే అవ‌కాశాలుంటాయని భావిస్తున్నాయి.

బీజేపీ శ్రేణుల‌కు న‌చ్చిన సినిమా, కాంగ్రెస్ శ్రేణుల‌కు న‌చ్చ‌ని సినిమాగా మారింది. ఆ విధంగా క‌శ్మీర్ ఫైల్స్ కాస్త చాలా మంది కోపానికి కార‌ణం అయింది. చెప్పుకునేందుకు చిన్న సినిమా అయిన‌ప్ప‌టికీ అప్ప‌టి కాల‌మాన ప‌రిస్థితుల‌ను మ‌ళ్లీ తవ్వి తీసిన వైనంపై రాజ‌కీయ పార్టీలు కొన్ని మండిప‌డ్డాయి. ఎలా చూసుకున్నా మ‌త‌తత్వ శ‌క్తుల‌కు ఈ సినిమా ఓ ఊతం ఇచ్చింది అన్న‌ది కాంగ్రెస్ ఆరోప‌ణ. నాటి అల్ల‌ర్ల‌లో హిందువులు ప్రాణాలు కాపాడిన ముస్లింలు కూడా ఉన్నార‌ని లౌకిక వాదం, త‌త్వం గెలిపించే సినిమాలు వ‌స్తే బాగుంటాయి కానీ ఓ వ‌ర్గంవి మాత్ర‌మే క‌న్నీళ్లు, బాధ‌లు అని చెప్పి సాధించే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌ని అంటున్నాయి విప‌క్ష పార్టీలు.

సినిమా జీవితాన్ని ప్ర‌భావితం చేస్తుంది. సినిమా రాజ‌కీయాల‌నూ ప్ర‌భావితం చేస్తుంది. సినిమా కార‌ణంగా ప్ర‌పంచం మారుతుందా అంటే చెప్ప‌లేం కానీ కాస్తో కూస్తో ప‌రిణామాల్లో మార్పు అయితే రావొచ్చు. ఆ విధంగా సినిమాలు ఇటీవ‌ల కాలంలో లో బ‌డ్జెట్ లో వ‌చ్చి మంచి మార్కులే కొడుతున్నాయి. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా క‌శ్మీర్ ఫైల్స్ నిలిచింది. 90ల‌లో కశ్మీర్ పండిట్ల‌పై జ‌రిగిన దాడులు, క‌శ్మీరు లోయ‌ల్లో జ‌రిగిన దారుణాలు వీట‌న్నింటినీ చూపిస్తూ ఈ సినిమా రూపొందింది.

అయితే సున్నితం అయిన అంశాల‌ను కాస్త వ‌క్రీక‌రించి చూపించార‌ని కొన్ని వ‌ర్గాలు ఆరోపించాయి కూడా ! అయితే ఈ సినిమా బీజేపీ వ‌ర్గాల‌కు మాత్రం భ‌లే న‌చ్చింది. దాంతో దీన్నొక రాజ‌కీయ అస్త్రంగా మ‌లుచుకుని  కాస్త వార్త‌ల్లో నిలిచింది. డైరెక్ట‌ర్ వివేక్ అగ్నిహోత్రిని ప్ర‌ధాని త‌న కార్యాల‌యానికి పిలిపించి అభినందించ‌డం వివాదాల‌కు తావిచ్చింది.

క‌శ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయి నిన్న‌టి తో యాభై రోజులు పూర్త‌యింది. ఈ సినిమా సంచ‌ల‌నాల‌ను న‌మోదు చేసింది.ముఖ్యంగా రాజ‌కీయ పార్టీల‌కు ఈ సినిమా బాగానే ఉప‌యోగ‌ప‌డింది. బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ అన్న‌విధంగా ఉండే రాజకీయాల‌కు ఈ సినిమా మాత్రం బాగానే ఉపయోగ‌ప‌డింది.

ఏ విధంగా చూసినా ఈ సినిమా కొన్ని నిజాల‌ను వెల్ల‌డించింద‌ని బీజేపీ వ‌ర్గాలు త‌మంత‌ట‌ తాము ఈ సినిమాను సొంతం చేసుకుని కొంత రాజ‌కీయం న‌డిపాయి. సినిమాకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కొన్ని చోట్ల రాయితీలు ఇవ్వ‌డంపై కూడా ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ మండిప‌డ్డారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ క‌శ్మీర్‌ ఫైల్స్ తీశారు బాగానే ఉంది గుజరాత్ ఫైల్స్ ఎప్పుడు తీస్తారు అన్న వాద‌న కూడా రేగింది.
Tags:    

Similar News