పాన్ ఇండియా మార్కెట్ లో 'పుష్ప' ప్రభావం ఎలా ఉందంటే..?

Update: 2021-12-16 06:36 GMT
కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుంచి వస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ''పుష్ప: ది రైజ్'' కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ - రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా రేపు (డిసెంబర్ 17) భారీ స్థాయిలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'పుష్ప' సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. వరల్డ్ వైడ్ గా మూడు వేలకు పైగా స్క్రీన్స్ లో బన్నీ సినిమా రిలీజ్ అవుతోంది. యూఎస్ఏ లో ఈరోజే ప్రీమియర్స్ పడనున్నాయి. ఇది అల్లు అర్జున్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

గతంలో అల్లు అర్జున్ సినిమాలు ఇతర భాషల్లోకి డబ్బింగ్ కాబడి మంచి వసూళ్ళు రాబట్టేవి. ముఖ్యంగా మలయాళంలో అక్కడి స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా రిలీజ్ అవుతుంటాయి. అలానే హిందీలోకి అనువాదం చేసి యూట్యూబ్ లో వదిలిన బన్నీ సినిమాలు మిలియన్ల వ్యూస్ సాధిస్తుంటాయి. ఈ క్రమంలో నేషనల్ వైడ్ మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. అందుకే ఈసారి 'పుష్ప' సినిమాని ఒకేసారి ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

తెలుగుతో పాటుగా మిగతా భాషల్లోనూ 'పుష్ప' పార్ట్-1 ని భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. తమిళ్ లో లైకా ప్రొడక్షన్స్ - కన్నడలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్ - హిందీలో ఏఏ ఫిలిమ్స్ వంటి పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే అగ్రిసివ్ ప్రమోషన్స్ తో హైప్ క్రియేట్ చేశారు.

సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా 'పుష్ప' కు సంబంధించిన విషయాలు ట్రెండింగ్ లో ఉంటున్నాయంటే ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హిందీ మినహా అన్ని భాషల్లోనూ బన్నీ స్వయంగా ప్రెస్ మీట్స్ పెట్టడం.. స్పెషల్ ఇంటర్వ్యూలతో సినిమాకు కావాల్సినంత క్రేజ్ తీసుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

'పుష్ప: ది రైజ్' ప్రీమియర్స్ ప్రీ సేల్స్ లో అదరగొట్టింది. అలానే తెలుగు - మలయాళంలో అడ్వాన్స్ బుకింగ్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఇందులో ఫహాద్ ఫాజిల్ కీ రోల్ పోషిస్తుండటం వల్ల మాలీవుడ్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇతర భాషల్లోనూ బుకింగ్స్ పుంజుకున్నాయి. హిందీలో చిత్ర బృందం ప్రచారం చేయకపోవడం వల్ల నార్త్ లో బుకింగ్స్ మోస్తరుగా ఉన్నాయని తెలుస్తోంది.

కర్ణాటకలో ‘పుష్ప: ది రైజ్’ కన్నడ వెర్సన్ కంటే తెలుగు వెర్సన్ ఎక్కువ క్రేజ్ ఉన్నట్లు బుకింగ్స్ చూస్తే అర్థం అవుతుంది. కన్నడ భామ రష్మిక - నటుడు ధనుంజయ ఉంటడం మేజర్ ప్లస్ అయింది. అలానే తొలిసారిగా తమిళనాట రిలీజ్ అవుతున్న అల్లు అర్జున్ సినిమాకి చెన్నైలో బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి.

ఒక్క ఉత్తరాది మార్కెట్ లోనే 'పుష్ప' ప్రభావం పెద్దగా లేదనే కామెంట్స్ వస్తున్నాయి. 'స్పైడర్ మ్యాన్' రిలీజ్ కూడా ఉండటం అక్కడ ప్రతికూలంగా మారిందని అంటున్నారు. కాకపోతే హిట్ టాక్ తెచ్చుకుంటే హిందీలో కూడా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ''పుష్ప: ది రైజ్'' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫిగర్స్ నమోదు చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News