కొర‌టాల అలాంటి క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవడానికి కార‌ణం?

Update: 2021-07-02 05:06 GMT
సోష‌ల్ మీడియా ట్రెండ్ లో ప్ర‌ముఖుల మ‌నోభావాల్ని దెబ్బ తీయ‌డం సులువుగా మారింది. ట్విట్ట‌ర్ -ఎఫ్.బి- ఇన్ స్టా వంటి మాధ్య‌మాల్లో అనుచ‌రులు త‌మ అభిప్రాయాల్ని సూటిగా చెప్పేస్తున్నారు. ఈ వేదిక‌ల‌పై బ‌హిరంగంగానే త‌మ కోపాన్ని ప్ర‌ద‌ర్శించేవారు కొంద‌రైతే త‌మ‌లోని అవ‌ల‌క్ష‌ణాల్ని బ‌య‌ట‌పెట్టుకునేందుకు పోటీప‌డేవాళ్లు చాలామంది. సెల‌బ్రిటీల మ‌నోభావాల్ని కించ‌ప‌రిచేలా తిట్లు బూతులతో చెల‌రేగిపోయే బ‌రితెగింపు క‌నిపిస్తోంది.

కొన్నాళ్ల క్రితం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొరటాల శివ ఒక బలమైన నిర్ణయం తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఇక‌పై తాను సోష‌ల్ మీడియాల్లో ఉండ‌కూడ‌ద‌ని సీరియ‌స్ గా నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.  ఇది ప‌రిశ్ర‌మ‌లో చాలా మందిని ఆశ్చర్యపరిచే విష‌య‌మే అయినా ఆయ‌న‌ సోషల్ మీడియాను విడిచిపెట్టాడ‌న్న‌ది వాస్త‌వం. కొరటాల‌ సోషల్ మీడియాల్లో మ‌రీ అంత యాక్టివ్ గా ఉండ‌రు. కానీ ఆయ‌న‌కు ఉన్న‌ట్టుండి ఏమైంది? ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నారేమిటి! అంటూ అంతా డైల‌మాలో ఉన్నారు.

తాజాగా ఆయ‌న సన్నిహితులు ఇచ్చిన లీకుల ప్ర‌కారం.. అభిమానులు  ట్రోల్ చేస్తున్న తీరుకు ఆయ‌న‌ చాలా కలతకు గుర‌య్యార‌ట‌. అత‌డు ఇంత‌కుముందు ఎన్.టి.ఆర్ తో ఒక చిత్రాన్ని ప్రకటించి అల్లు అర్జున్ చిత్రాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాడు. ఇది ఎన్టీఆర్ అభిమానులకు అస్స‌లు న‌చ్చ‌లేదు. దీంతో కొర‌టాల‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే కొంతమంది మెగా అభిమానులు ఆచార్యను చాలా కాలం ఆలస్యం చేసినందుకు అతనిని ట్రోల్ చేస్తున్నారు.

నిజానికి ఆ రెండు విష‌యాల్లో కొర‌టాల‌ను త‌ప్పు ప‌ట్ట‌డం స‌రికాదు. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ లేదా స్క్రిప్టు ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో ఎన్టీఆర్ తో ప్రాజెక్టు కుద‌ర‌లేదు. అలాగే ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారు డిఫ‌రెంట్ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల కుద‌ర‌క‌పోయి ఉండొచ్చు. ఇక‌పోతే ఆచార్య చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మ‌వ్వ‌డానికి స‌వాల‌క్ష కార‌ణాలున్నాయి. ముఖ్యంగా క‌రోనా రెండు సార్లు తీవ్రంగా విరుచుకుప‌డింది. దానివ‌ల్ల నెల‌ల‌కొద్దీ స‌మ‌యం సెట్స్ కెళ్ల‌కుండా వేచి చూడాల్సి వ‌చ్చింది. అందుకే ఇలాంటి విష‌యాల్లో త‌న త‌ప్పు లేక‌పోయినా నింద‌లు భ‌రించాల్సి వ‌స్తోంది. ఫ్యాన్స్ ఆగ‌డాల‌కు కొర‌టాల క‌ల‌త చెందడం వ‌ల్ల‌నే అలాంటి క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నార‌న్న‌మాట‌.
Tags:    

Similar News