'గాడ్ ఫాదర్' విషయంలో ఎక్కడ తేడా కొట్టింది..?

Update: 2022-10-18 04:33 GMT
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సమ్మర్ లో "ఆచార్య" వంటి భారీ డిజాస్టర్ అందుకున్నారు. తొలిసారిగా తనయుడు రామ్ చరణ్ తో కలిసి నటించిన సినిమా ప్లాప్ అవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా 'గాడ్ ఫాదర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరు.

మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' సినిమా తెరకెక్కింది. ఇందులో చిరంజీవి తో పాటుగా సల్మాన్ ఖాన్ - నయనతార - సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకి పాజిటివ్ టాక్ వచ్చింది. విమర్శకుల సమీక్షలు కూడా సానుకూలంగానే వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్ళు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

'గాడ్ ఫాదర్' సినిమా కలెక్షన్స్ పై మేకర్స్ ఫస్ట్ వీకెండ్ లో అధికారిక పోస్టర్స్ రిలీజ్ చేశారు. అయితే ఒరిజినల్ గా అంత వసూలు చేయలేదనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. సల్మాన్ ఖాన్ ఉన్నప్పటికీ హిందీలో కూడా ఈ చిత్రానికి అనుకున్న విధంగా కలెక్షన్స్ రాలేదు.

ఓవర్ సీస్ లోనూ 'గాడ్ ఫాదర్' పరిస్థితి అలానే ఉంది. పాజిటివ్ మౌత్ టాక్ తో కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. యూఎస్ఏ మార్కెట్‌ లో చిరంజీవి సినిమా ఇప్పటి వరకు $1.26 మిలియన్లు వసూలు చేసింది. ఇది $1.3 మిలియన్లతో ముగియవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

'ఆచార్య' సినిమా అమెరికాలో $1 మిలియన్ మార్కును టచ్ చేయడంలో విఫలమైంది. కాకపోతే ఇప్పుడు 'గాడ్‌ ఫాదర్‌' చిత్రం మిలియన్ డాలర్ల మార్కును తాకింది. ఇదొక్కటే ఇక్కడ ఓదార్పు అంశమని అనుకోవాలి. 'ఆచార్య' కంటే కాస్త మెరుగ్గా పనిచేసింది కానీ.. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇది వీక్ పెరఫార్మర్ గానే పరిగణించబడుతుంది.

'గాడ్‌ ఫాదర్' ను USA లో సొంతంగా విడుదల చేసినందున ఈ చిత్రానికి బ్రేక్‌ ఈవెన్ మార్క్ అంటూ ఏమీ లేదు. మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినా - గత చిత్రాల రికార్డులను పరిగణలోకి తీసుకుంటే మాత్రం.. ఈ సినిమా ఓవర్సీస్‌ లో ఏమంత ప్రభావం చూపలేకపోయిందనే అనుకోవాలి.

చిరంజీవి ప్రస్తుతం కెఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో Mega154 సినిమాలో నటిస్తున్నారు. ఇది 'గాడ్ ఫాదర్' కు పూర్తి భిన్నంగా ఒరిజినల్ స్క్రిప్ట్ తో కంప్లీట్ మాస్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. వింటేజ్ చిరు ని చూడబోతున్నామని చిత్ర బృందం హింట్స్ ఇస్తోంది. దీనికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో చిరు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News