గాడ్ ఫాదర్ లో చిరంజీవి తండ్రి పాత్రధారి ఎవరబ్బా?

Update: 2022-10-08 10:30 GMT
మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలై.. మంచి టాక్ తో నడుస్తోంది. సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి తోడు తారా బలానికి భారీగా చోటిచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మొదలు నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ, సునీల్, షఫీ, బ్రహ్మాజీ, షయాజీ షిండే అనసూయ ఇలా ఎందరెందరో సినిమాలో మెరిశారు.

ఇక ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో తప్పకుండా కనిపిస్తున్న మరో క్యారెక్టర్ సముద్ర ఖని. పోలీస్ అధికారిగా అతడి పాత్ర చివరి వరకు కొనసాగింది. చివర్లో ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరొందిన, ప్రఖ్యాత దర్శకుడు, నటుడు ప్రభుదేవా తళుక్కుమన్నారు. ఇక ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పాత్ర గురించి ప్రత్యేకంగానే చెప్పుకోవాలి.అయితే, వీరందరితో పాటు గాడ్ ఫాదర్ సినిమాలో మరో కీలక పాత్ర కూడా ఉంది. అయితే, దానిని పోషించినది ఎవరనే విషయం మాత్రం ప్రేక్షకులకు వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

విధాత తలపుతో..గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రధారి విలువలు, ఆదర్శాలు అంటూ ప్రజా నాయకుడిగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. అయితే, అతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు కాగా.. రెండో భార్యకు ఒక అబ్బాయి. మొదటి భార్య.. సవతి కుమారుడిని ఇంట్లోకి రానివ్వదు. ఈ క్రమంలో చిరంజీవి తండ్రి పాత్రధారి చేయిచేసుకోవడం.. ఆమె రెండో కుమార్తెకు జన్మనిచ్చి చనిపోవడం జరుగుతుంది. తల్లి చనిపోయిన కోపంతో పాటు ద్వేషం పెద్ద కుమార్తెకు నరనరాన జీర్ణించుకుపోయి ఉంటుంది. అందుకనే ఆమె.. వరుసకు అన్నయ్య అయినప్పటికీ చిరంజీవి అంటే ఏమాత్రం పట్టింపుతో ఉండదు. కాగా, సీఎం హోదాలోని తండ్రి మరణంతో.. చిరంజీవి పాత్ర కీలకంగా మారి సినిమా సాగుతుంది.

సిరివెన్నెల మెరుపుల తర్వాత 1986.. చిక్కటి సాహిత్యం, చక్కటి సంగీతంతో వచ్చింది సిరివెన్నెల సినిమా. హీరోయిన్ సుహాసిని. కె.విశ్వనాథ్ దర్శకత్వం, కేవీ మహదేవన్ సంగీతం మహత్తుతో సిరివెన్నెల ఓ క్లాసిక్ గా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ సినిమాలోని 'విధాత తలపున','మెరిసే తారలెదే రూపం''ఆది భిక్షువు వాడినేది కోరేది? బూడిదిచ్చేవాడినేది అడిగేది?'ఇలా అన్ని పాటలూ అల్టిమేట్. ఈ సినిమా ప్రభావం ఎలాంటిదంటే.. ఈ సినిమాతోనే ''చెంబోలు సీతారామశాస్త్రి'' కాస్తా ''సిరివెన్నెల సీతారామశాస్త్రి''గా పేరుగాంచారు. చనిపోయేవరకు ఈ పేరుతోనే ఆయన ప్రసిద్ధిగాంచారు.

అయితే, సినిమాలో హీరోయిన్ పాత్రధారి సుహాసిని బధిరురాలు కాగా, హీరో పాత్రధారి అంధుడు. వీరిద్దరి మధ్య సాగే అందమైన కథే "సిరివెన్నెల." ఇంతకూ హీరో పాత్ర చేసింది సర్వదమన్ బెనర్జీ. బెంగాలీ నటుడు అయిన సర్వదమన్.. సిరివెన్నెల సినిమాలో చాలా హ్యాండ్సమ్ గా ఫ్లూటిస్ట్ గా ఆకట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత పెద్ద సంఖ్యలో ఏమీ సినిమాలు చేయలేదు. 1983 నుంచి తెలుగులో మూడు సినిమాలు చేశారు. 1987లో స్వ‌యంకృషి చిత్రంలో కీల‌క పాత్ర‌లో కనిపించారు. సినిమా కెరీర్ ను మాత్రం సీరియస్ గా తీసుకున్నట్లు లేదు. ఇన్నేళ్లలో ఆయన చేసింది కేవలం పదుల సంఖ్యలోని సినిమాలే. కాగా, 2016లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై వచ్చిన బయోపిక్ లో సర్వదమన్ కనిపించారు. మళ్లీ ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా ద్వారా.. అందులోనూ చిరంజీవి తండ్రి పాత్ర వేశారు.

పోల్చుకోలేక..గాడ్ ఫాదర్ సినిమాలోని నటులంతా ప్రేక్షకులకు చిరపరిచితులే. చిరంజీవి తండ్రి పాత్రధారి తప్ప. ప్రేక్షుకులకు ఈ పాత్రధారి ఎవరనేది చాలాసేపు అంతుపట్టలేదు. తీరిగ్గా ఆలోచిస్తే కానీ..అతడు సర్వదమన్ బెనర్జీ అని తెలియరాలేదు. కాగా, సర్వదమన్ ప్రస్తుతం రిషికేశ్ లో మెడిటేషన్ బోధకుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఉత్తరాఖండ్ లోని మురికివాడల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే, పేద మహిళలకు ఉపాధి కల్పించే ఓ స్వచ్ఛంద సంస్థకు సహాయం అందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News