యాడ్స్ లో సూప‌ర్ స్టార్ ఎవ‌రు?

Update: 2022-08-31 03:19 GMT
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్ప‌డు ప్ర‌తీదీ క‌మ‌ర్షియ‌ల్ అంటున్నారు. త‌మ‌కున్న క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ వ‌రుస బ్రాండ్ ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ లుగా మారుతున్నారు. ప‌లు క్రేజీ ప్రొడ‌క్ట్ ల‌కు ప్ర‌చార క‌ర్త‌లుగా మారుతున్నారు. గ‌తంలో మెగాస్టార్ చిరంజీవికి మాత్ర‌మే ప‌రిమిత‌మైన క‌మ‌ర్షియ‌ల్ యాడ్ ల ప‌రంప‌ర ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల‌కు బంగారు బాతుగా మారి కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. నెల‌లత‌ర‌బ‌డి సినిమాల్లో న‌టించే స‌మ‌యం కంటే త‌క్కువ టైమ్ లో క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ షూట్ పూర్త‌యిపోవ‌డం.. కోట్ల‌ల్లో పారితోషికాలు అందుతుండ‌టంతో మ‌న వాళ్లు వీటిపై ప్ర‌త్యేక దృష్టి పెడుతున్నారు.  

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో వున్న స్టార్ హీరోల కున్న క్రేజ్ కార‌ణంగా ప‌లు బ్రాండ్ లు వెంట‌ప‌డుతున్నాయి. అయితే ఈ రేసులో గ‌త 15 ఏళ్లుగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు. `పోకిరి` వ‌ర‌కు బ్రాండ్ ల జోలికి వెళ్ల‌ని మ‌హేష్ ఆ త‌రువాత నుంచే వైఫ్ న‌మ్ర‌త కార‌ణంగా ప‌లు క్రేజీ బ్రాండ్ ల‌క బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లు పెట్టారు. డెన్వ‌ర్‌, సాయి సూర్యా డెవ‌లాప‌ర్స్‌, మౌంటేయిన్ డ్యూ, బైజూస్‌, ఇంటెక్స్‌, గోల్డ్ విన్న‌ర్‌, పాన్ బ‌హార్‌, అభీ బ‌స్‌, గతంలో థ‌మ్స్ అప్ వంటి బ్రాండ్ ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు. అంతే కాకుండా మ్యాట్రిమోనీ వంటి సైట్ ల‌కు కూడా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తూ కోట్ల‌ల్లో పారితోషికాన్ని సొంతం చేసుకుంటున్నాడు.

తాజాగా ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్ `జీ తెలుగు`కు  ప్ర‌చార క‌ర్త‌గా సైన్ చేయ‌డం విశేషం. ఏడాదిన్న‌ర పాటు సాగే ఈ కాంట్రాక్ట్ కోసం మ‌హేష్ రూ. 9 కోట్లు ఛార్జ్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌హేష్ త‌రువాత క‌మ‌ర్షియ‌ల్ బ్రాండ్ ల రేసులో వున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. ఏ ఎల్ ఎక్స్ యాడ్ తో మొద‌లైన బ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ బ్రాండ్ ల జ‌ర్నీ `పుష్ప‌` త‌రువాత పీక్స్ కు చేరింది. రెడ్ బ‌స్‌, ర్యాపిడో, జొమాటో, శ్రీ‌చైత‌న్య‌, ఫ్రూటీ, కెఎఫ్ సీ, ఆస్ట్రాల్ పీవీసీ పైపులు, తాజాగా కోకా కోలా వంటి యాడ్ ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తూ మ‌హేష్ కు గ‌ట్టిపోటీనిస్తున్నాడు.

మ‌హేష్ లాగే బ‌న్నీ కూడా ఒక్కో బ్రాండ్ కు భారీ స్థాయిలో పారితోషికాన్ని తీసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా భారీ స్థాయిలో క‌మ‌ర్షియ‌ల్స్ కి బ్రాండ్ అంబాసిబ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఎం4 మ్యారీ.కామ్‌, స్వైప్ అప్‌, థ‌మ్స్ ఎప్‌, మెబాజ్‌.. మ‌న్య‌వార్‌, సంతూర్ రాయ‌ల్ సాండ‌ల్‌, జొమాటో, సంగీతా మోబైల్స్‌, స‌న్ ఫీస్ట్‌, న్యూ థ‌మ్స్ అప్ రిఛార్జ్డ్‌, ఆహా, కె.ఎల్‌.ఎమ్ ఫ్యాష‌న్ మాల్‌.. మింత్రా.. వంటి క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ ల‌లో న‌టించాడు. ప్ర‌స్తుతం థ‌మ్స్ అప్‌, న్యూ థ‌మ్స్ అప్ రిఛార్జ్డ్ యాడ్ ల‌లో న‌టిస్తున్నాడు.

వీటి ద్వారా విజ‌య్ భారీగానే పారితోషికం పొందుతున్న‌ట్టుగా చెబుతున్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ ఈ మ‌ధ్య‌నే బ్రాండ్ ల‌పై కన్నేశాడు. గ‌తంలో పెస్సీ యాడ్ లో మెరిసిన రామ్ చ‌ర‌ణ్ ఆ త‌రువాత కొంత వెన‌క‌డుగు వేశాడు. ఇటీవ‌లే మ‌ళ్లీ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ ల‌లో న‌టించ‌డం మొద‌లు పెట్టాడు. అలియాభ‌ట్ తో క‌లిసి `ఫ్రూటీ`, క‌ళాత‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్ తో క‌లిసి `సువ‌ర్ణ‌భూమి`, డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ప్ర‌చార క‌ర్త‌గా ప‌లు క‌మ‌ర్షియ‌ల్ కంప‌నీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు.

తాజాగా హీరో కంప‌నీకి సంబంధించిన బైక్ హీరో గ్లామ‌ర్ కు ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. దీనికి గానూ చ‌ర‌ణ్ కు భారీగానే అందుతున్న‌ట్టుగా తెలుస్తోంది. సీనియ‌ర్ హీరోల్లో విక్ట‌రీ వెంక‌టేష్ డోమెక్స్‌, రామ్ రాజ్‌, మ‌ణ‌ప్పురం గోల్డ్ వంటి బ్రాండ్ లకు ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇక నాగార్జున లిస్ట్ కూడా బాగానే వుంది. క‌ల్యాణ్ జువెల్ల‌ర్స్‌, స్పాటిఫై, ఘ‌డీ డిట‌ర్జంట్ వంటి ప‌లు బ్రాండ్ ల‌కు ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌రిస్తూ బిగ్ బాస్ రియాలిటీ షోతో భారీగానే సొంతం చేసుకుంటున్నారు. నాగ‌చైత‌న్య `స్కంధాన్షీ ఇన్ ఫ్రా, మింత్రా, కోల్గెట్ ఫ్రెష్‌, బిగ్ బ‌జార్ వంటి బ్రాండ్ ల‌కు ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించాడు. నాని కూడా స్ప్రైట్ ల‌కు ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

మ‌హేష్ నుంచి నాని వ‌ర‌కు ప్ర‌తీ స్టార్ హీరో ప్ర‌తీ బ్రాండ్ నుంచి 4 నుంచి 5 కోట్ల వ‌ర‌కు ద‌క్కించుకుంటున్నార‌ట‌. ఒక్కో యాడ్ కు 3 నుంచి 4 రోజులు మాత్ర‌మే షూటింగ్ టైమ్ కేటాయించ‌డంతో మ‌న వాళ్ల‌కు సినిమాల‌తో పోలిస్తే భారీగానే ద‌క్కుతున్న‌ట్టు తెలుస్తోంది. హీరోల తో పాటు స్టార్ డైరెక్ట‌ర్లు కూడా క‌మ‌ర్షియ‌ల్స్ బాట‌ప‌ట్టారు. త్రివిక్ర‌మ్‌, కృష్ణ‌వంశీ (అప్ప‌ట్లో), హ‌రీష్ శంక‌ర్ వంటి ద‌ర్శ‌కులు బ్రాండ్ ల ద్వారా భారీగానే పారితోషికాలు ద‌క్కించుకుంటున్నార‌ట‌. అయితే ఈ రేసులో సూప‌ర్ స్టార్ ఎవ‌ర‌న్న‌ది చ‌ర్చ‌గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News