'ఇంద్ర' సినిమాను బి.గోపాల్ ఎందుకు చేయనన్నాడంటే .. ?!

Update: 2022-07-29 03:30 GMT
చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో 'ఇంద్ర' ఒకటిగా నిలిచింది. అశ్వనీదత్ నిర్మించిన ఆ సినిమాకి బి. గోపాల్ దర్శకత్వం వహించగా సంభాషణలను పరుచూరి బ్రదర్స్ అందించారు. ఇటీవలే ఆ సినిమా 20 ఏళ్లను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో ఆ సినిమాను గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ  .. 'ఇంద్ర' సినిమాను కనుక చేసి ఉండకపోతే మేమంతా కూడా ఒక వైభవాన్ని అనుభవించి ఉండకపోయేవాళ్లం. రెండు దశాబ్దాల తరువాత కూడా ఆ సినిమాను గురించి మాట్లాకుంటూ ఉండటమే ఆ సినిమా గొప్పతనం.

చిన్నికృష్ణ కథాకథనాలు .. మా సంభాషణలు .. బి. గోపాల్ దర్శకత్వ ప్రతిభ ఆ సినిమా విజయంలో ముఖ్యమైన పాత్రను పోషించాయి. పాండవులలో అగ్రభాగం భీముడికి దక్కుతుందన్నట్టుగా ప్రధానమైన పాత్రను చిరంజీవి పోషించారు. ఆల్రెడీ బాలకృష్ణతో రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేసిన గోపాల్ ఈ సినిమా చేయడానికి ముందుగా ఆసక్తిని చూపించలేదు. నేను చెబితే ఆయన ఒప్పుకోకపోవడంతో, చిరంజీవిగారితో చెప్పించి ఒప్పించవలసి వచ్చింది. అలాంటి సినిమా ఎంతటి చరిత్రను సృష్టించిందో మీకు తెలుసు.

'సమరసింహారెడ్డి' సినిమాలో సత్యనారాయణగారు బాలయ్యబాబుకి నమస్కారం పెడతారు. అలా 'ఇంద్ర' సినిమాలో చిరంజీవికి ప్రకాశ్ రాజ్ నమస్కారం పెడతారు. మళ్లీ  అలాంటి  సీన్ వద్దని గోపాల్ గారు గొడవ. అక్కడ ఉన్నది  బాలయ్య .. ఇక్కడ ఉన్నది చిరంజీవి చూస్తారయ్యా అని నేను. మొత్తానికి ఈ విషయంలో కూడా నేను ఆయనను ఒప్పించాను.

'ఇంద్ర' సినిమాలో తనికెళ్ల  భరణి చేసిన  పాత్రను నేను వేయవలసింది .. కానీ మోకాలు నొప్పివలన వేయలేకపోయాను.
చిరంజీవి చాలా సినిమాల్లో చాలా పవర్ఫుల్ డైలాగులు చెప్పి ఉండొచ్చు. కానీ 'మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా' అనే డైలాగే ముందుగా అందరికీ గుర్తొస్తుంది.

 అవార్డుల కోసం చూసుకుంటే కొన్ని డైలాగులు మిస్సవుతాము. ఎక్కువసార్లు డైలాగ్ రైటర్లుగా మాకు నంది అవార్డులు వచ్చింది లేదు. అవార్డుల కోసం మేము ఎప్పుడూ డైలాగులు రాయలేదు .. వాటికోసం పాకులాడింది లేదు. అయినా ప్రేక్షకుల అభిమానానికి మించిన అభిమానం ఏవుంటుంది? 'నరసింహనాయుడు' .. 'ఇంద్ర' ఫంక్షన్లు రెండూ ఒకే ఊళ్లో జరిగాయి. ఒక  జీవితకాలంపాటు గుర్తుండిపోయే ఫంక్షన్లు అవి. అభిమానులకి ఒక పాత్ర  నచ్చితే ఎంతగా ప్రేమిస్తారనడానికి 'ఇంద్ర' ఒక నిదర్శనం. మేము రాసిన హీరోలందరి అభిమానులు మమ్మల్ని అభిమానిస్తారు .. అది మేము చేసుకున్న అదృష్టం. వీలైతే ఆ సినిమా మళ్లీ ఒకసారి చూడండి" అంటూ చెప్పుకొచ్చారు.   
Tags:    

Similar News