`మా` ఆఫీస్ చ‌డీ చ‌ప్పుడు లేదే!

Update: 2019-04-13 10:45 GMT
దాదాపు 800 మంది ఆర్టిస్టుల‌తో అతి పెద్ద అసోసియేష‌న్ గా గుర్తింపు తెచ్చుకున్న మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) మునుముందు ఎలాంటి కార్య‌క‌లాపాలు చేప‌ట్ట‌బోతోంది?  దేశంలోని ఏ ఇత‌ర ప‌రిశ్ర‌మ‌తో పోల్చినా టాలీవుడ్ ఆర్టిస్టుల సంఘం ఘ‌న‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌డుతోందని `మా` ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌స్థావించింది. ఆర్టిస్టుల‌కు ఇన్సూరెన్స్.. ఫించ‌న్లు.. సైకిళ్లు.. క‌ళ్యాణ ల‌క్ష్మి.. విద్యా ల‌క్ష్మి .. మోటార్ సైకిళ్ల సాయం వ‌గైర వగైరా ప‌థ‌కాలెన్నో అమ‌ల్లోకి తెచ్చి ఆద‌ర్శంగానే నిలిచింది.  సొంత భ‌వంతి నిర్మాణానికి నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాల్ని చేపట్టింది. త్వ‌ర‌లోనే మ‌హేష్‌.. ప్ర‌భాస్.. నాగార్జున‌.. ఎన్టీఆర్ వంటి స్టార్ల‌తో మ‌రిన్ని ఈ త‌ర‌హా ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని మా కొత్త క‌మిటీ ప్ర‌తిపాదించింది.

అయితే ఎన్నిక‌లు ముగిశాయి. కొత్త ప్యానెల్ ని ఎన్నుకున్నారు. ఆ త‌ర్వాత వెంట‌నే విదేశాల్లో ఫండ్ రైజింగ్ కార్యక్ర‌మాలు స్పీడందుకుంటాయ‌నే భావించారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ అందుకు సంబంధించిన ఎలాంటి స‌మాచారం లేదు. ఎల‌క్ష‌న్ అనంత‌రం మా అధ్య‌క్షుడితో ఉపాధ్య‌క్షులు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు అయిన హేమ‌, జీవిత‌- రాజ‌శేఖ‌ర్ బృందం విభేధించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఏక‌ప‌క్ష వైఖ‌రి, ప‌ని తీరు మాకు న‌చ్చ‌లేద‌ని ప్ర‌మాణ స్వీకారం రోజునే తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వాటికి అధ్య‌క్షుడి నుంచి స‌రైన ఆన్స‌ర్ లేదని విమ‌ర్శ‌లొచ్చాయి.

`కుర్చీ` ఎక్కేవ‌ర‌కూ బోలెడంత ఫైట్ చేసిన న‌రేష్ ఎన్నిక‌ల అనంత‌రం ఎందుక‌నో సైలెంట్ గానే ఉన్నారు! అంటూ ప‌లువురు ఆర్టిస్టులు సెటైర్లు వేస్తున్నారు. త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌కు సంబంధించిన ప‌నులు ఏం చేప‌డుతున్నారో తెలియ‌డం లేద‌ని మ‌హేష్ తో ఫండ్ రైజింగ్ చేస్తారో లేదో తెలీద‌ని ముచ్చ‌ట్ల‌లో వినిపిస్తోంది. ఎన్నిక‌లకు ముందే సీనియ‌ర్ న‌రేష్ కెరీర్ పరంగా పూర్తి బిజీ. ఎన్నిక‌ల‌ అనంత‌రం మ‌రింత బిజీ అయిపోయారు. ఆ క్ర‌మంలోనే ఔట్ డోర్ షూటింగుల‌తో పాటు హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోనూ ప‌లు షూటింగుల‌కు వెళుతున్నార‌ట. ఆ క్ర‌మంలోనే మా ఆఫీస్ ఎలాంటి సంద‌డి లేకుండా మూగ‌వోయింది. `మా` కార్యాల‌యంలో ఒక్కో బాస్ ఒక్కోలా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. క‌మిటీ మీటింగులు, ఇంపార్టెంట్ ముచ్చ‌ట్లు ఉంటేనే క‌నిపించే వారు కొంద‌రైతే, అలాంటివాటితో సంబంధం లేకుండా `మా` కుర్చీలో ప్ర‌తిరోజూ ఓసారి ట‌చ్ చేసి వెళ్లిన అధ్య‌క్షులు ఇంకొంద‌రు అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. ఎన్నిక‌లు ర‌సాభాస ముగిసింది. గ‌త వివాదాల్ని ప‌క్క‌న‌బెట్టి.. నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌ల‌తో అంద‌రినీ క‌లుపుకుని పోయి మంచి ప‌నుల‌తో న‌రేష్ తాను ద‌క్కించుకున్న‌ కుర్చీకి మంచి గౌర‌వం తెస్తార‌నే ఆర్టిస్టులంతా ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్ష‌ను నెర‌వేర్చేందుకు మునుముందు ఏఏ కార్య‌క్ర‌మాలు చేయ‌బోతున్నారో వేచి చూస్తున్నామ‌ని ఆర్టిస్టులు చెబుతున్నారు. జ‌స్ట్ వెయిట్..


Tags:    

Similar News