RRR ని ఆస్కార్ కు ఎందుకు నామినేట్ చేయలేదంటే..?

Update: 2022-09-22 09:41 GMT
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాని కాదని.. ఇండియా తరపున 'చెల్లో షో' అనే గుజరాతీ చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ పరిశీలనకి పంపడంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్నారు.

అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న చిత్రాన్ని పక్కనపెట్టి.. అసలు పేరు కూడా తెలియని సినిమాని ప్రతిష్టాత్మక ఆస్కార్ కు ఎలా ఎంపిక చేశారని కామెంట్స్ చేస్తున్నారు. 'చెల్లో షో' సినిమాకి ఉన్న అర్హతలేంటి.. RRR చిత్రానికి లేనివి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ఆరోపణలు చేసేవారు కూడా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలెక్షన్ కమిటీ అధ్యక్షుడు టీఎస్ నాగభరణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. ఆస్కార్‌ అవార్డ్స్ కి సినిమాని ఎంపిక చేయడానికి పాపులారిటీ - కలెక్షన్‌లు - ఎంటర్టైన్మెంట్ మరియు మార్కెటింగ్ ప్రమాణాలు కాదని తెలిపారు.

''RRR మంచి సినిమానే. ఆ మాటకొస్తే మొత్తం 13 చిత్రాలు కూడా దేనికవే మెరిట్ ఉన్న చిత్రాలు. ఐతే ఒక్క సినిమాని మాత్రమే సెలెక్ట్ చెయ్యాలి కదా.. అందుకే 'చెల్లో షో' ని ఆస్కార్ పరిశీలనకి పంపించాం'' అని ఎఫ్‌ఎఫ్‌ఐ హెడ్ చెప్పారు. RRR సినిమాపై వ్యతిరేకత ఏమి లేదు. ఎక్కువ కలెక్షన్లు సాధించదనో.. ఎక్కువమంది జనం చూశారనో ఎంపిక చెయ్యలేమని అన్నారు.

'చేలో షో' కథలో, కథనంలో అందరికీ నచ్చే మానవీయ కోణం ఉంది. ఆ సినిమా పిల్లల అమాయకత్వం.. వారి కలల ప్రపంచం గురించి.. కల కోసం పోరాటం చేస్తే అది నిజమవుతుంది అనే ఒక ఆశని చిగురింప చేస్తుందీ సినిమా. ప్రపంచంలో ఎవరికైనా కనెక్ట్ అయ్యే థీమ్. అందుకే ఇతర సినిమాలను పక్కన పెట్టి ఈ చిత్రానికి 17 మంది జ్యూరీ సభ్యులం అందరం ఓటేశాం అని టిఎస్ నాగాభరణ తెలిపారు.

గుజరాతీ సినిమాని ఎంపిక చెయ్యడం వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదని ఎఫ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు స్పష్టం చేశారు. RRR చిత్రాన్ని నిర్మాతలు వేరే రూపంలో ఆస్కార్ అవార్డులకు పంపితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ''దేశం తరఫున పంపే సినిమా వేరు. అది మన దేశాన్ని గొప్పగా రిప్రజెంట్ చెయ్యాలి. ఆ విషయంలో 'చెల్లో షో' కరెక్ట్ అని భావించాం” అని నాగభరణ వివరణ ఇచ్చారు. మరి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆలోచించినట్లు ఆస్కార్ కమిటీ పరిశీలిస్తుందో లేదో చూడాలి.

కాగా, , 1920ల నేపథ్యంలో స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా RRR చిత్రాన్ని రూపొందించారు ఎస్ఎస్ రాజమౌళి. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్  అద్భుతమైన నటన కనబరిచారు. డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News