మెగాస్టార్ ఎంత సేవ చేసినా మీడియా తీరు ఇంతేనా?

Update: 2021-05-31 09:35 GMT
కరోనా విపత్కర పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని 'క‌రోనా క్రైసిస్ చారిటీ' (సీసీసీ) ఎంత సేవ చేస్తుందో ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నాం. కోవిడ్19 మొదటి వేవ్ లో వేలాది సినీ కార్మికుల‌కు నిత్యావ‌స‌రాల్ని అందించారు. సెకండ్ వేవ్ స‌మ‌యానికి వ్యాక్సినేష‌న్ కూడా ఏర్పాటు చేశారు. ఈసారి మ‌రింత‌గా సేవ‌ల్ని విస్త‌రించారు. ఆక్సిజన్ అంద‌క మ‌ర‌ణించేవారిని చూసి చ‌లించిన చిరు త‌న కుమారుడు హీరో రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల‌కు ఆక్సిజ‌న్ అందేలా ఆక్సిజ‌న్ బ్యాంకుల్నే ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆయ‌న విరివిగా విరాళాలిచ్చి క‌ష్టంలో ఉన్న ఆర్టిస్టుల్ని ఆదుకున్నారు. అభిమానుల్లో క‌రోనా సోకిన వారు.. క‌ష్టంలోని ప్ర‌జ‌లు త‌మ‌కు ఆస్ప‌త్రి సేవ‌లు కావాలంటే సంబంధిత ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ ఈ క‌రోనా కష్ట‌కాలంలో దేవుడే అయ్యారు.

కానీ ఆయ‌న‌ను తెలుగు మీడియా ఎంత లైట్ తీస్కుందో చూస్తే విస్మ‌యం క‌ల‌గ‌కుండా ఉండ‌దు. మెగాస్టార్ బ్ల‌డ్ బ్యాంక్ సేవ‌ల్ని ఐ బ్యాంక్ సేవ‌ల్ని కూడా ఇంత‌కుముందు తక్కువ చేసిన ఒక సెక్ష‌న్ మీడియా ఇప్పుడు క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలోనూ త‌మ వాస్త‌విక బుద్ధిని చూపించింద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఒక సెక్ష‌న్ దుర్మార్గంగా కూడా అభిమానులు అభివ‌ర్ణించారు. చిరంజీవి సేవ‌ల్ని ఎక్క‌డో మారుమూల సింగిల్ కాల‌మ్ ఆర్టిక‌ల్ గా ప్ర‌చురించ‌డం తీర‌ని అన్యాయం అని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రోవైపు ఎల‌క్ట్రానిక్ మీడియా సైతం అదే తీరుగా వ్య‌వ‌హ‌రించడం దారుణం అన్న విమ‌ర్శ‌లున్నాయి.

మెగాస్టార్ పై తొలి నుంచి ఒక సెక్ష‌న్ మీడియా ఇలానే చేస్తోంద‌నేది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం. అది రాజ‌కీయాల‌తోనూ ముడిప‌డిన అంశంగా ప్ర‌తి ఒక్క‌రూ చూస్తారు. అయితే ఇంత జ‌రిగినా మెగాస్టార్ ఏనాడూ ఆయ‌న దాన‌గుణాన్ని ద‌యా గుణాన్ని సేవాగుణాన్ని విడిచిపెట్ట‌లేదు. ప్ర‌జ‌ల‌కు క‌ష్టం వ‌చ్చిందంటే ఆదుకుంటూ నిజ‌మైన ఆప‌ద‌లో నేనున్నాను! అని అభ‌య‌మిచ్చిన తీరుకు ఇప్పుడు ప్ర‌జ‌ల్లో గొప్ప గుర్తింపు ద‌క్కుతోంది. మీడియా కావాల‌ని తొక్కేయాల‌ని ప్ర‌య‌త్నించినా ఏదీ ఆప‌లేదు. త‌న‌వ‌ల్ల ల‌బ్ధి పొందుతున్న వంద‌లాది మంది క‌రోనా బాధితులు ఇప్పుడు చిరు గురించి చెప్పుకుంటున్నారు.

ఇక ఇంత చేస్తున్నా మీడియా త‌న విష‌యంలో ఎందుకిలా చేస్తోంది? అంటూ మెగాస్టార్ చిరంజీవి ఓ ప్ర‌ముఖ మీడియా అధినేత‌తో ఫోన్ కాల్ లో మాట్లాడుతూ వాపోయిన తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆంధ్ర‌ప్ర‌భ ప‌త్రికాధినేత ముత్తా గోపాల‌కృష్ణ ను చిరు చాలా కాలం త‌ర్వాత ఫోన్ కాల్ లో ప‌రామ‌ర్శించారు. ఆయన క్షేమ‌స‌మాచారాన్ని ఎంతో విన‌మ్రంగా అడిగి తెలుసుకున్నారు. మీరు తెలుగు ప్ర‌జ‌లకు ఉన్న అరుదైన ఆస్తి అంటూ ఎంతో ఒదిగి మాట్లాడిన తీరు అత‌డి స్వ‌భావాన్ని తెలుగు ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చూపించింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది అభిమానుల ఆవేద‌న‌ను గ‌మ‌నించి దానికి అక్ష‌ర రూప‌మిచ్చాను .. ఇది పూర్వ‌జ‌న్మ సుకృతం.. అంటూ ప‌త్రికాధినేత గోపాల‌కృష్ణ అన‌డం ఈ వాయిస్ లో వినిపించింది.
ఈ సంద‌ర్భంగా చిరు త‌న ఆవేద‌న‌ను దాచుకోలేదు. ``కానీ మ‌న‌కున్న క‌ర్మ ఏంటంటే మీడియా బ‌యాస్ తో ప‌ని చేస్తోంది. హృద‌యం గాయ‌ప‌డేలా రాయ‌డం స‌రికాదండీ.. ఉన్న‌ది రాస్తే త‌ప్పేం ఉంటుంది? ప్ర‌భుత్వానికి భారం త‌గ్గుతుంది ఇలా ప్ర‌జ‌లు కూడా సాయం చేస్తే అని రాస్తే త‌ప్పేం ఉంది?  భ‌యం వీళ్ల‌కు...! అంటూ చిరు కాస్త ఆవేద‌న‌గానే మాట్లాడారు.

మీరు ఇచ్చే ప్రోత్సాహం కావాలి. ఇలాంటి స‌మ‌యంలో మీలాంటి వారి ప్రోత్సాహం ముఖ్యం.. ఖ‌ర్చు చేసే ప్ర‌తి న‌యా పైసా నా క‌ష్టార్జిత‌మే. ఎవ‌రినీ అడ‌గ‌లేదు. న‌న్ను ఆనందింప‌జేయాలని కాదు.. ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని .. ఇదీరా ఇత‌ను అని చెబితే త‌ప్పేమీ కాదు క‌దా! అని చిరు అన్నారు.

ఫ్యాన్స్ పడుతోన్న ఆవేదనను అర్థం చేసుకుని ఈ ఆర్టికల్ రాసినట్లు ఆయ‌న చిరంజీవికి తెలిపారు. మీడియా రాజ‌కీయాల గురించి నాయ‌కుల ఆలోచ‌నా విధానంపైనా ముత్తా త‌ప్పుబ‌ట్టారు.

``మీరు చాలా చక్కగా రాశారు. నాకు గతంలో ఎన్నో ప్రశంసలు వచ్చినా.. కరెక్ట్ సమయంలో ఇది రావడం సంతోషంగా ఉంది. మీరు గొప్పలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్లు రాశారు`` అంటూ ముత్తాతో చిరు అన్నారు. దీనికి ఆయన స్పందిస్తూ..``మీరు చేస్తున్న ఆక్సిజన్ బ్యాంకుల గురించి మంత్రులు స్పందించి ఉంటే బాగుండేది`` అని అన్నారు. ఇదే సంభాష‌ణ‌లో త‌మ‌రి ఆరోగ్యం ఎలా ఉందండీ ఈ పాండ‌మిక్ లో..!  కాకినాడ‌లో ఉంటున్నారా హైద‌రాబాద్ లోనా? అని కూడా ముత్తా గోపాల‌కృష్ణ‌ను చిరు ప్ర‌శ్నించారు.  

నిజానికి రాజోలు లాంటి చిన్న సిటీలో స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఒక ఆక్సిజ‌న్ ప్లాంట్ ప్రారంభిస్తేనే ఒక మాజీ ఎంపీ నేరుగా మీడియాలో మాట్లాడుతూ ప్ర‌శంస‌లు కురిపించారు. సుకుమార్ ని దేవుడు అన్నారు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లోనూ ఆక్సిజ‌న్ ప్లాంట్ లు నెల‌కొల్పి విదేశాల నుంచి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు కాన్ స‌న్ ట్రేట‌ర్లు తెప్పించి సొంత ఖ‌ర్చుతో ఇంత సేవ చేస్తుంటే క‌నీసం మాట మాత్రంగా అయినా కానీ ఎవ‌రూ స్పందంచ‌లేదు. ఒక మాట మాట్లాడితే అది చిరు బ్రాండ్ ఇమేజ్ ని పెంచిన‌ది అవుతుంద‌ని అంతా ఖంగు తిన్నారు. కంగారు ప‌డ్డార‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇదే ఆవేద‌న‌ను చిరు ప‌త్రికాధినేత‌తో వెలిబుచ్చారు. చిరుపై మీడియా వైఖ‌రిపై ఇంత‌కుముందే `తుపాకి` త‌న క‌థ‌నంలో అభివ‌ర్ణించింది. ఆయ‌న ఇంత సేవ చేస్తున్నా మీడియా కావాల‌నే ఇలా చేస్తోంద‌ని ఫ్యాన్స్  ఆవేద‌న చెందిన విష‌యాన్ని ప్ర‌స్థావించింది. ఇప్పుడు అదే తీరుగా ప్ర‌ముఖ ప‌త్రిక‌లో క‌థ‌నం వెలువ‌డింది. మెగాస్టార్ చిరంజీవి ఆ ప‌త్రికాధినేత‌కే ఫోన్ చేసి ఆయ‌న అదే తీరుగా త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేయడం బ‌య‌ట‌ప‌డింది.

ఇక మెగాస్టార్ ఎప్పుడూ మ‌డ‌మ తిప్ప‌రు. ఎంద‌రు ఎన్ని రాజ‌కీయాలు చేసినా కుట్ర‌లు చేసినా వాటికి భ‌య‌ప‌డ‌రు. త‌న‌లోని సేవాగుణాన్ని దాచేయ‌రు. ఎప్పుడూ బ‌య‌ట‌పెడుతూనే ఉంటారు. సాయానికి ముందుకొస్తూనే ఉంటారు. ఒక‌రి పొగ‌డ్త‌ల‌తోనూ ఆయ‌న‌కు ప‌నిలేద‌ని ప‌దే ప‌దే నిరూపిస్తూనే ఉన్నారు. ఇక పెద్ద‌ల‌తో మాట్లాడినా చిన్న‌లు సాటి మ‌నిషితో మాట్లాడినా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ద‌గ్గ‌రగా క‌లిసిన‌ప్పుడు నేటిత‌రం యువ‌ జ‌ర్న‌లిస్టులే కాదు సామాన్యుల‌తో కూడా అంద‌రితో అదే వైఖ‌రితో ఆక‌ట్టుకుంటారు. కుశ‌ల ప్ర‌శ్న‌లు అడుగుతారు.

చాలా సంవ‌త్స‌రాలైందండీ మీతో మాట్లాడి ఇలా.. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.. అంటూ ముత్తా గోపాల‌కృష్ణ గారితో చిరంజీవి ఎంతో విన‌మ్రంగా మాట్లాడిన తీరు ఈ వాయిస్ లో బ‌య‌ట‌ప‌డింది. ఆయ‌న అంత పెద్ద స్టార్ ఎందుక‌య్యారో ఇప్ప‌టికి అయినా అర్థం చేసుకోవాలి.


Tags:    

Similar News