బాలయ్య ఆ మీటింగ్ కి హాజరవుతాడా...?

Update: 2020-06-05 05:15 GMT
టాలీవుడ్ సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌ లు ప్రారంభించాలి.. థియేటర్లు మళ్లీ ఎప్పుడు రీ ఓపెన్‌ చేయాలి.. తదితర విషయాల గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పలువురు సినీ ప్రముఖులు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ పెద్దల సమావేశానికి తనని పిలవలేదని అసహనం వ్యక్తం చేసారు. అంతేకాకుండా వాళ్ళందరూ తలసాని శ్రీనివాస్ తో కలిసి భూములు పంచుకుంటున్నారేమో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇండస్ట్రీలోని పలువురు బాలయ్యకు మద్ధతు తెలపగా.. మరికొందరు ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ సమావేశాలకు అందర్నీ పిలవాల్సిన అవసరం లేదని.. బాలయ్య అవసరం అనుకుంటే ఖచ్చితంగా పిలుస్తామని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వం షూటింగులకు అనుమతిస్తూ జీవో జారీ చేసినందుకు గాను సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ.. దేశవ్యాప్తంగా పరిస్థితులు చక్కబడిన వెంటనే సీఎం జగన్ ని మీట్ అవుతామని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ నిర్మాతల మండలి చైర్మన్ సి. కళ్యాణ్ కూడా ఇప్పటికే త్వరలోనే ఏపీ గవర్నమెంట్ తో కూడా సమావేశం అవుతామని వెల్లడించారు. కాగా జూన్ 9వ తారీఖు 3 గంటలకు ఏపీ సీఎం జగన్ తో ఇండస్ట్రీ ప్రముఖులు మీటింగ్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారట. దీనికోసం ఈసారి ఇండస్ట్రీలోని మిగతా వారిని కూడా కలుపుకొని పోవాలని అనుకుంటున్నారట. నందమూరి బాలయ్యని అప్సెట్ చేయకుండా ఈ మీటింగ్ కి ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నారట. మరి హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సమావేశానికి వస్తాడా రాడా అని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Tags:    

Similar News