మంచు మనోజ్ న్యూ ట్విస్ట్.. పెళ్లి గురించేనా..?

Update: 2023-01-18 07:30 GMT
దొంగా దొంగది సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టిన మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మంచు మనోజ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు తన గురించి వినడం తప్పించి ఎక్కడా కనిపించడం లేదు. అవకాశాలు రాకనో, మనోజ్ కు ఇంట్రెస్ట్ లేకనో సినిమాలకు గ్యాప్ వచ్చేసింది.

మంచు మనోజ్ అన్న ఒక్క సినిమా తీయన్నా అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నా పట్టించుకోవడం లేదు ఈ బిందాస్ బాయ్.  తాజాగా మంచు మనోజ్ ఓ ట్వీట్ చేశాడు. జీవితంలో తాను తర్వాతి దశలోకి అడుగుపెట్టబోతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన.. తన రెండో పెళ్లిని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశాడని అంతా అనుకుంటున్నారు.

గత కొంత కాలంగా మంచు మనోజ్, భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి వినాయక ఉత్సవాల్లో పాల్గొనడంతో వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు, అంతే కాకుండా సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

వీటికి తోడు ఇటీవలే కడప దర్గాకు వెళ్లిన మనోజ్.. త్వరలోనే కొత్త జీవితం మొదలు పెడతానని, ఈసారి ఫ్యామిలీతో కలిసి అక్కడకు వెళ్తానని చెప్పడంతో.. ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు కన్ఫార్మ్ అయింది.

ఎన్నో రోజులుగా తన మనసులో దాచుకుంటూ వస్తున్న ఓ స్పెషల్ న్యూస్ ను 20వ తేదీన అందరితో పంచుకుంటానంటూ మంచు మనోజ్ ట్వీట్ ద్వారా వెల్లడించాడు. ఈ ట్వీట్ తో జనవరి 20వ తేదీన దివంగత నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తారని అనుకుంటున్నారు. అయితే మంచు మనోజ్ కు 2015లో ప్రణతీ రెడ్డితో వివాహం జరిగింది. కానీ పలు కారణాల వల్ల వీరిద్దరూ 2019లో విడాకులు తీసుకున్నారు.  

ఆ తర్వాత నుంచి మంచు మనోజ్ ఒంటిరిగానే జీవితం గడుపుతున్నాడు. సినిమాలకు కూడా దూరంగానే ఉన్నాడు. చాలా రోజులపాటు మీడియాకు కూడా కనిపించలేదు. భూమా మౌనికతో కనిపించినప్పటి నుంచి వీరిపై వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే మరో రెండ్రోజుల్లో ఆయన పంచుకునే విషయం అతడి పెళ్లి గురించి అయితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మరి దేని గురించో తెలియాలంటే ఇంకో రెండ్రోజులు ఆగాల్సిందే.      



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News