పవన్ కు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్తుందా..?

Update: 2022-02-16 12:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. చిరంజీవి నేతృత్వంలో సినీ బృందం ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా అందరికీ ఆమోదయోగ్యమైన జీవో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో సినిమా టిక్కెట్ ధరల క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రభుత్వం నియమించిన కమిటీ.. రేపు (ఫిబ్రవరి 17) సమావేశం కాబోతోంది.

సినీ ప్రముఖులు చెప్పిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకున్న వైయస్ జగన్.. వీటికి అనుగుణంగా నివేదిక రెడీ చేయమని కమిటీని ఆదేశించారని తెలుస్తోంది. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఉదయం 11:30 గంటలకు కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. దీనిపై చర్చించిన తర్వాత  ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది. ఇప్పటికే టికెట్ ధరల ప్రతిపాదనలు సిద్దమవగా.. రేపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏపీ సర్కారు కొత్త జీవో రిలీజ్ చేయనుంది.

టికెట్ రేట్ల మీద ప్రభుత్వ జీవో ఫిబ్రవరి 25వ తేదీలోపు వస్తే.. త్వరలో విడుదల కానున్న పెద్ద చిత్రాలకు ప్లస్ అవుతుంది. ముందుగా థియేటర్లలోకి రాబోతున్న 'భీమ్లా నాయక్' సినిమాకు ఇది బోనస్ అవుతుందనే చెప్పాలి. గతేడాది ఏప్రిల్ లో ఏపీ సర్కారు టికెట్ ధరలు నియంత్రిస్తూ జీవో నెం.35 జారీ చేసింది. దీని వల్ల 'వకీల్ సాబ్' సినిమా వసూళ్లపై దెబ్బ పడిందని పవన్ అభిమానులు భావిస్తుంటారు.

ఒకవేళ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో వారంలో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ అధికారిక ప్రకటన రిలీజ్ చేస్తే.. అది అందరి కంటే ముందు పవన్ కళ్యాణ్ నటించిన 'బీమ్లా నాయక్' చిత్రానికే హెల్ప్ అవుతుంది. ఈ నెల 25న భారీ స్థాయిలో సినిమా విడుదల కాబోతోంది. మరి ఆలోపు పవన్ సినిమాకు జగన్ సర్కారు తీపి కబురు చెప్తుందో లేదో చూడాలి.

ఇటీవల సీఎం జగన్ తో జరిగిన భేటీలో చిరంజీవి - మహేష్ బాబు - ప్రభాస్ - రాజమౌళి - ఆర్. నారాయణమూర్తి - కొరటాల శివ బృందం టిక్కెట్ల ధరలపై విస్తృతంగా చర్చలు జరిపారు. నిర్మాతలకు నష్టం కలగకుండా జనాల మీద భారం పడకుండా సినిమా టికెట్ రేట్లు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.

అయితే టికెట్ ధరలలో పెరుగుదల ఎక్కువ శాతం ఉండకపోవచ్చనే టాక్ నడుస్తోంది. కాకపోతే ఎంత పెరిగినా రాబోయే పెద్ద సినిమాల వసూళ్లకు ఇది కచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
Tags:    

Similar News