ఐపీఎల్ ప్ర‌భావం ట్రిపుల్ ఆర్ పై వుంటుందా?

Update: 2022-03-25 17:30 GMT
స‌మ్మ‌ర్ లో విడుద‌ల‌య్యే ప్ర‌తీ చిత్రానికి ఐపీఎల్ పెద్ద గండంగా మారింది. ప్రారంభంలో పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌ని ఐపీఎల్ క్రికెట్ ఆ త‌రువాత ఫేజ్ నుంచే అస‌లు క‌థ షురూ చేయ‌డం మొద‌లుపెట్టింది. క్రేజీ టీమ్ ల మ‌ధ్య జ‌రిగే ఆట‌ని చూడాల‌ని యూత్ చాలా వ‌ర‌కు టీవీల‌కు అతుక్కుపోతుంటారు. అది సినిమాల వ‌సూళ్ల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తోంది. గ‌త కొంత కాలంగా దీని వ‌ల్ల వ‌సూళ్ల ప‌రంగా భారీ డ్రాప్ ని ఎదుర్కొన్ని సినిమాలు చాలానే వున్నాయి. అయితే ఇప్పుడు మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఈ ద‌ఫా ట్రిపుల్ ఆర్ తో పాటు మ‌రికొన్ని భారీ చిత్రాల‌ని భ‌య‌పెడుతోంది.

క్రికెట్ ఫీవ‌ర్ యూత్ లో సినిమాని మించి వుంటుంద‌న్న‌ది ప్ర‌తీ ఒక్క‌రికీ తెలిసిందే. ఇక ఐపీఎల్ మొద‌లైందంటే యూత్ చేసే హంగామా, హ‌డావిడీ అంతా ఇంతా కాదు. థియేట‌ర్ల‌కు దాదాపుగా యూత్ రావ‌డం మానేస్తారు. ఇంటి ప‌ట్టునే వుంటూ టీవీల‌కు అతుక్కుపోతుంటారు. ఇప్పుడు ఇదే భ‌యం ఈ నెల 26న ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో దీని ప్ర‌భావం ట్రిపుల్ ఆర్ పై వుంటుందా? వుంటే ఏ స్థాయి వ‌ర‌కు వుండే అవ‌కాశం వుంద‌న్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ ఇప్ప‌డు మొద‌లైంది.

ట్రిపుల్ ఆర్ ని 2018 మార్చి లో రాజ‌మౌళి ప్ర‌క‌టించారు. న‌వంబ‌ర్ లో షూటింగ్ ని మొద‌లు పెట్టారు. అంటే ఈ మూవీ థియేట‌ర్లలోకి రావ‌డానికి దాదాపు గా నాలుగేళ్లు ప‌ట్టింది. అంటే ప్రేక్ష‌కులు గ‌త నాలుగేళ్లుగా ఈ మూవీ కోసం ఎదురుచూశారు. అలాంటి సినిమా ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లో ఈ శుక్ర‌వారం నుంచి సంద‌డి చేయ‌డం మొద‌లు పెట్టింది. అయితే ఒక్క రోజు తేడాతో అంటే మార్చి 26 నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి. దీని ప్ర‌భాం సినిమాపై ఖ‌చ్చితంగా వుంటుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఉద‌యం, మ‌ధ్యాహ్నం షోల పై పెద్ద‌గా ప్ర‌భావం ప‌డ‌క‌పోయినా సాయంకాలం షో తో పాటు నైట్ షోల‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం వుంద‌ని అంటున్నారు. ఎందుకంటే ఐపీఎల్ అంటే యూత్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ని చూపిస్తారు. మ్యాచ్ మొద‌లైందంటే వారి మైండ్ మొత్తం అక్క‌డే వుంటుంది. సినిమా క‌న్నా క్రికెట్ కే అధిక ప్రాధాన్య‌త నిస్తుంటారు. ఈ నెల 26, 27న జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ మ్యాచ్ ల కార‌ణంగా ఈ రెండు రోజులు ట్రిపుల్ ఆర్ క‌లెక్ష‌న్ ల‌పై ప్ర‌భావం వుంటుందని, అంతే కాకుండా రానున్న రెండు వారాల పాటు సినిమా క‌లెక్ష‌న్ ల‌కి ఐపీఎల్ గండి కొట్టే ప్రమాదం వుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు.

తాజా విశ్లేష‌ణ‌ల ప్ర‌కారం ఐపీఎల్ వ‌ర్సెస్ ట్రీపుల్ ఆర్ గా మార‌నుందా? అని కొంత మంది ట్రేడ్ వ‌ర్గాలు క్రీడా విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే ఇక్క‌డో విష‌యం చెప్పాలి. ట్రిపుల్ ఆర్ కు సంబంధించిన టికెట్స్ ఇప్ప‌టికే దాదాపుగా ప్ర‌ధాన సిటీస్ లో వారం పాటు బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి. ఆ కార‌ణంగా ఈ మూవీకి ఐపీఎల్ వ‌ల్ల పెద్ద‌గా న‌ష్టం వాటిల్లే అవ‌కాశం లేద‌న్నది మ‌రో వాద‌న‌.
Tags:    

Similar News