టాలీవుడ్ కు జగన్ సర్కారు తీపి కబురు చెప్పబోతోందా?

Update: 2022-03-07 06:00 GMT
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్‌ ధరల పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. టికెట్ రేట్లు నియంత్రిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.35లో సవరణలు చేస్తూ సరికొత్త జీవో రాబోతోంది. దాదాపు ఏడాదిగా కొనసాగుతున్న ఈ సమస్యకు రేపో ఎల్లుండో శుభం కార్డు పడబోతోందని సమాచారం.

సినిమా టికెట్ ధరలను నియంత్రిస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ 8న జీవో జారీ చేసింది. చిన్న సినిమా అయినా పెద్ద చిత్రమైనా టికెట్ రేట్ ఒకటే ఉండాలని సూచించింది. అంతేకాదు బెనిఫిట్ షోలు - స్పెషల్ షోలు వేయడానికి అనుమతి లేదని పేర్కొంది.

అయితే జగన్ సర్కారు తీసుకొచ్చిన జీవోపై సినీ ఇండస్ట్రీ మండిపడింది. చిత్ర పరిశ్రమ మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు పెద్దలు బాహాటంగానే కామెంట్స్ చేశారు. ఈ ఇష్యూ మీద టాలీవుడ్ లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ క్రమంలో ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి దూరం పెరిగిందనే విధంగా నాయకులు - ప్రభుత్వ పెద్దల మధ్య పరస్పర వ్యాఖ్యానాలు, మాటల యుద్ధాలు, ట్వీట్ వార్స్ జరిగాయి. కొందరు ప్రభుత్వ తీరుని దుయ్యబడితే.. మరికొందరు జీవో వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తులు చేశారు.

ఈ నేపథ్యంలో సినిమా టికెట్ రేట్లపై అధ్యయనానికి ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. మరోవైపు సీనియర్ హీరో చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సమావేశమై ఈ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేశారు.

జగన్ సైతం ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. సామాన్య ప్రజానీకానికి భారం లేకుండా చిత్ర నిర్మాతలకు నష్టం రాకుండా ఉండేలా సినిమా టిక్కెట్ ధరలు ఉంటాయని పేర్కొన్నారు. అలానే సినిమా చిన్నదైనా పెద్దదైనా ఐదో షోకు అనుమతి ఇస్తామని మాటిచ్చారు. భారీ బడ్జెట్ చిత్రాలను ప్రత్యేకంగా పరిగణిస్తామని కూడా తెలిపారు.

కానీ ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫిబ్రవరి నెలాఖరున వస్తుందనుకున్న కొత్త జీవో.. అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. 'భీమ్లా నాయక్' సినిమా విడుదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి కావాలనే జాప్యం చేసారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఏదైతేనేం ఇప్పుడు ఏపీలో సినిమా టికెట్ రేట్ల వ్యవహరినికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రతిపాదనలకు అనుగుణంగా కమిటీ ఓ నివేదిక రెడీ చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఒకటి లేదా రెండు రోజుల్లో పెరిగిన టిక్కెట్ ధర వివరాలతో జగన్ సర్కారు సరికొత్త జీవో జారీ చేయనుందని టాక్ వినిపిస్తోంది.

టిక్కెట్ ధరలను నియంత్రిస్తూ 2021 ఏప్రిల్ 8న జీవో విడుదలవ్వగా.. 11 నెలల తర్వాత సరిగ్గా 2022 మార్చి 8న ఈ సమస్య పరిష్కరించబడుతుందని అంటున్నారు. ఇది అందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మార్చి 11న రిలీజ్ అయ్యే 'రాధేశ్యామ్' మొదలుకొని.. త్వరలో విడుదల ప్లాన్ చేసుకున్న భారీ సినిమాలన్నిటికీ మేలు చేసే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
    

Tags:    

Similar News