టికెట్ ధ‌ర త‌గ్గింపు ప్ర‌యోగం క‌లిసొస్తుందా?

Update: 2022-10-08 03:56 GMT
ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు క‌దిలి రావాలంటే టికెట్ ధ‌ర‌ల్ని త‌గ్గించాల‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మేక‌ర్స్ అత్యుత్త‌మ కంటెంట్ ఇచ్చినా కానీ టికెట్ ధ‌ర ఫ్యామిలీ ఆడియెన్ కి అందుబాటులో లేక‌పోతే థియేట‌ర్ల‌కు వ‌చ్చే వారి సంఖ్య అమాంతం త‌గ్గిపోతోంద‌న్న విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. క‌రోనా క్రైసిస్ అనంతరం నిత్యావ‌స‌రాలు స‌హా ప్ర‌తిదీ ధ‌ర‌లు పెరిగాయి. కుటుంబ పోష‌ణ భారం మ‌ధ్య త‌ర‌గ‌తి దిగువ‌త‌ర‌గ‌తుల‌పై తీవ్రంగా ప‌డింది. దీంతో వినోదానికి కోత ప‌డిపోతోంది. దీనికి తోడు ఓటీటీలు టీవీల్లో కార్య‌క్ర‌మాల‌కు ఆద‌ర‌ణ అమాంతం పెరిగింది. ఇలాంటి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో జ‌నం థియేట‌ర్ల వైపున‌కు రావ‌డం లేద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

అయినా టికెట్ ధ‌ర‌లు త‌గ్గించేందుకు ప‌రిశ్ర‌మ‌లు సుముఖంగా లేవు. కార‌ణం ఏదైనా బాలీవుడ్ టు టాలీవుడ్ టికెట్ ధ‌ర అనేది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఇక ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ లో థియేటర్ల రద్దీ తగ్గుముఖం పట్టింది. ప్రధానంగా అధిక టికెట్ ధరల కారణంగా ప్రజలు థియేటర్లకు రావ‌డానికి ఇష్టపడటం లేద‌ని విశ్లేషిస్తున్నారు. సెల‌క్టివ్ గా ఏవో కొన్ని సినిమాల‌ను మాత్ర‌మే వారు ఎంపిక చేసుకుంటున్నారు. ఇత‌ర సినిమాల కోసం ఓటీటీలో వ‌చ్చే వ‌రకూ వేచి చూసే ప‌రిస్థితి ఉంది.

కానీ ఇంత‌లోనే బాలీవుడ్ లో ఒక ప్ర‌యోగం మంచి ఫ‌లితాన్నిస్తోంది. ఇటీవల జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేవలం రూ.75కే టిక్కెట్లు అందజేసారు. అది జ‌నాల్లో ఉత్సాహం నింపింది. చాలా మంది థియేటర్లకు వ‌చ్చి సినిమా వీక్షించారు. ఆ తర్వాత 'బ్రహ్మాస్త్ర' మేక‌ర్స్ నవరాత్రి సీజన్ లో టిక్కెట్ ధరలపై డిస్కౌంట్లను అందించారు.

అది కూడా వారికి మంచి ఫలితాలనే ఇచ్చింది. తాజా స‌మాచారం మేర‌కు ఇప్పుడు విక్రమ్ వేద నిర్మాతలు కూడా దీనినే అనుస‌రిస్తున్నారు. హృతిక్ రోషన్-సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన విక్రమ్ వేద ఇటీవ‌లే విడుద‌ల కాగా.. మంచి రివ్యూలు వచ్చాయి. కానీ జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించడంలో విఫ‌ల‌మైంది. పెరిగిన టికెట్టు భారం దీనికి కార‌ణ‌మ‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మూవీ విడుద‌లై వారం కావస్తున్నా కలెక్షన్లు మాత్రం బాగా నిరాశపరిచాయి. వసూళ్లను పెంచడానికి అక్టోబర్ 7 నుండి దేశవ్యాప్తంగా సినిమా టిక్కెట్ ధరలను 20-30 శాతం తగ్గించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ ఫార్ములా ఎంత‌వ‌ర‌కూ వ‌ర్క‌వుట‌వుతుందో చూడాలి. విక్రమ్ వేదకు మాతృక ద‌ర్శ‌కులు పుష్కర్- గాయత్రి దర్శకత్వం వహించారు.

త‌మిళంలో విక్రమ వేద బంప‌ర్ హిట్ కొట్టింది. అక్క‌డ ద‌ర్శ‌క‌ద్వ‌యానికి మంచి పేరొచ్చింది. ఇప్పుడు హిందీ వెర్ష‌న్ తోనూ ఆ ఇద్ద‌రికీ మంచి గుర్తింపు ద‌క్కింది. క్రిటిక్స్ నుంచి ఆ ఇద్ద‌రికీ ప్ర‌శంస‌లు కురిసాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News