మురుగ‌దాస్- అట్లీ క‌థ‌లు కొట్టేస్తారా?

Update: 2020-01-06 07:17 GMT
కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లు ముర‌గ‌దాస్.. అట్లీ స్టోరీలు చోరీ చేసి సినిమాలు చేస్తున్నార‌ని ర‌చ‌యితల సంఘం అధ్య‌క్షుడు భాగ్య‌రాజ్ గ‌తంలో ఆరోపించిన‌ సంగ‌తి తెలిసిందే. క‌థ‌లు దొంగిలించి సినిమాలు చేస్తున్నా! ఆ ద‌ర్శ‌కులు ఒప్పుకోవ‌డం లేద‌ని అవ‌కాశం ఉన్న ప్ర‌తి వేదిక‌ పైనా ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నారు. తాజాగా మ‌రోసారి ముర‌గ‌దాస్ అట్లీ.. మిత్ర‌న్ ల‌పై ఈ త‌ర‌హా దాడికి దిగారు. చెన్నైలో జ‌రిగిన ఓ పుస్తకావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో మ‌రోసారి క‌థ‌ల దొంగ‌త‌నంపై నిప్పులు చెరిగారు. కొంద‌రు గొప్ప క‌థ‌ల‌తో సినిమాలు చేస్తున్నారు. కానీ ఇది వాళ్ల క‌థే అన‌డానికి స‌రైనా అధారం లేదు. ఎందుకంటే అలాంటి క‌థ‌లే నేను గతంలో వేరోక‌రి నుంచి విన్నా. ఆ క‌థ‌ల‌పై ఫిర్యాదులు నాకు అందాయి.

వాటి గురించి హెచ్చ‌రించినా ఆ స్టార్ డైరెక్ట‌ర్లు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇది ఎంతో కాలం చెల్ల‌దు. సొంత జ్ఞానం లేని వారు ఎక్కువ కాలం సినిమా రంగంలో రాణించ‌లేరు. ఇత‌రుల చొక్కాల‌ను ఆల్ట‌రేష‌న్ చేసి వేసుకుంటే అది పాత‌దే అవుతుంది. కొత్త‌ది ఎలా అవుతుంది? అలా వేసుకున్న వాళ్లు ఆ సంగ‌తిని వారే స్వ‌యంగా చెబితేనే బాగుంటుంది. కొత్త‌గా ఆలోచించే వాళ్లు ప‌రిశ్ర‌మ‌లోకి రావాలి. ఇలాంటి వారు వ‌చ్చిన‌ప్పుడు క‌థ‌ల చోరీ జ‌రుగుతుంది. మీ క‌థ‌... ఫ‌లానా వ్య‌క్తి క‌థ ..ఒక‌లాగే ఉన్నాయ‌ని ఇద్ద‌ర్నీ కూర్చోబెట్టి మాట్లాడినా ఒప్పుకోవడం లేదు. ఇద్ద‌రూ ఒకే విధంగా ఆలోచించారు. మీకంటే ముందుగానే ఈ క‌థ రిజిస్ట‌ర్ అయిందని అన్నా.. నాకేంటి సంబంధం అన్న‌ట్లు వ్య‌వ‌రిస్తున్నారు. అలాంటి వాళ్ల‌ను ఏమ‌నాలి? అంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

ఈ వ్యాఖ్య‌లు కోలీవుడ్ లో ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇటీవ‌లే ద‌ర్బార్ రిలీజ్ సంద‌ర్భంగా ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వూల్లో అప్పుడ‌ప్పుడు ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఒకే విధంగా ఆలోచించ‌చ‌డం జ‌రుగుతుంద‌ని ఆ పాయింట్ ప‌ట్టుకుని కొంద‌రు కోడి గుడ్డు మీద ఈక‌లు పీకుతున్న‌ట్లు మాట్లాడుతున్నార‌ని ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే. అది జ‌రిగిన రెండు రోజుల‌కే భాగ్య‌రాజ్ ఇలా కౌంట‌ర్ వేయ‌డం అంత‌టా చ‌ర్చాంశ‌నీయంగా మారింది.


Tags:    

Similar News