సీత పాత్రను ఇంకాస్త పెంచితే బాగుండేదేమో: విజయేంద్ర ప్రసాద్

Update: 2022-03-27 23:30 GMT
'ఆర్ ఆర్ ఆర్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ .. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కి రికార్డుస్థాయిలో నమోదైన ఓపెనింగ్స్ అద్దం పడతాయి. ఎన్టీఆర్ - చరణ్ తరువాత కాస్త ప్రాధాన్యత కలిగిన పాత్రలో అజయ్ దేవగణ్ కనిపిస్తాడు. ఇక ఆ తరువాత స్కాట్ దొర పాత్ర కాస్త ప్రాముఖ్యత కలిగినదిగా కనిపిస్తుంది. మిగతా పాత్రలను అంతగా పట్టించుకున్నట్టుగా కనిపించదు. ఎన్టీఆర్ - ఒలీవియా మధ్య ఎలాంటి లవ్ ఫీల్ వర్కౌట్ కాకపోవడం .. సీత - రామరాజు పాత్రల కాంబినేషన్లో ఒక పాట కూడా లేకపోవడం అభిమానులకు కొంత నిరాశను కలిగించింది.

తాజా ఇంటర్వ్యూలో రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. " ఈ సినిమాలో మాటలు ఆశించిన స్థాయిలో పవర్ఫుల్ గా లేవని అంటున్నారు. ఇటు చరణ్ ..  అటు ఎన్టీఆర్ ఇద్దరూ కూడా బ్రిటీష్ వాళ్ల దగ్గర తమ ఉనికి తెలియకుండా రోజులు గడుపుతున్నారు. అందువలన వాళ్లు పవర్ఫుల్ డైలాగ్స్  చెప్పే పరిస్థితి లేదు. అవకాశం వచ్చిన సందర్భాల్లో మాత్రం మంచి డైలాగ్స్  పడ్డాయి. సమయం .. సందర్భం  లేకుండా పవర్ఫుల్ డైలాగ్స్ పేల్చే ప్రయత్నం చేస్తే పాత్రల స్వభావాలు దెబ్బతింటాయి. అందువలన సంభాషణలు చాలా సహజంగా ఉండేలా చూసుకోవం జరిగింది.

ఇక ఈ సినిమాలో పాటలు అందరూ పాడుకునేలా లేవని అంటున్నారు. అలాంటి పాటలు డ్యూయెట్లు ఉంటే వస్తాయి. అవి లేకపోవడం వలన అలా అనిపించి ఉండవచ్చు. ఈ సినిమా రచయితగా కాకుండా ఒక ప్రేక్షకుడిగా నా వైపు నుంచి చూస్తే, సీత పాత్రను ఇంకాస్త పెంచితే బాగుండేదేమో అనిపించింది. సీతారామరాజు .. కొమరం భీమ్ పాత్రలు నాకు ఎంతగా నచ్చాయో, సీత  పాత్ర కూడా నాకు అంతగా నచ్చేసింది. పల్లెటూరి యువతి ప్రేమలోని పవిత్రత .. ఆమె పడే ఆవేదన .. ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఈ పాత్ర ఇంకొంచెం ఉంటే బాగుండేదేమో అనిపించింది.

ఇక కథను ఎన్టీఆర్  - చరణ్ చుట్టూ తిప్పారనీ, మీగతా పాత్రలపై పెద్దగా దృష్టి పెట్టలేదని అంటున్నారు. సాధారణంగా మల్టీ స్టారర్లు తీటప్పుడు, ఆ పాత్రలను బ్యాలెన్స్ చేయడానికి వాళ్లపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. అందువలన అలా అనిపించి ఉండొచ్చు. సినిమాలో స్కాట్ అనేవాడు విపరీత పరిస్థితులను సృష్టిస్తుంటాడు  .. అక్కడ అతను విలన్ కాదు. పరిస్థితులే ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఎన్టీఆర్ - చరణ్  ఇద్దరూ కూడా తమ పాత్రలను అద్భుతంగా  చేశారు. సున్నితమైన ప్రేమ .. స్వచ్ఛమైన స్నేహం .. దేశభక్తితో కూడిన ఈ సినిమాకి ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నందుకు ఆనందంగా ఉంది" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News