అక్కడ మ‌ల్టీఫ్లెక్సుల్లోకి బ‌య‌ట ఫుడ్ కి ఓకే..!

Update: 2018-07-14 07:18 GMT
మ‌ల్టీఫ్లెక్సుల్లో ఫుడ్ పేరుతో జ‌రిగే దోపిడీ అంతా ఇంతా కాదు. రెండు స‌మోసాలు రూ.150.. పాప్ కార్న్ రూ.130.. గ్లాస్ నిండా శీత‌ల పానీయం రూ.160.. ఇలా చెప్పుకుంటూ పోతే.. బెదిరిపోయే రేట్ల‌తో మ‌ల్టీఫ్లెక్సులో బాదుడు అంతా ఇంతా ఉండొచ్చు. స‌రే.. వాళ్ల మ‌ల్టీఫ్లెక్స్‌.. వాళ్లిష్టమ‌ని ఊరుకోవ‌చ్చు. కాకుంటే.. బ‌య‌ట ఆహారాన్ని మ‌ల్టీఫ్లెక్సుల్లోకి అనుమ‌తించేందుకు నో చెప్పేయ‌టంతోనే అస‌లు స‌మ‌స్య‌.

ఈ అంశంపై మ‌హారాష్ట్రలో జ‌రిగిన ఉద్య‌మంలా ఒక వ్య‌క్తి పూనుకోవ‌టం.. మ‌ల్టీఫ్లెక్స్ బాదుడుపై బాంబే హైకోర్టును ఒక సామాన్యుడు పిటిష‌న్ వేశాడు. మ‌ల్టీఫ్లెక్సుల్లోకి.. సినిమా హాల్స్ లోకి బ‌య‌ట ఆహారాన్ని ఎందుకు తీసుకెళ్ల‌కూడ‌దో చెప్పాలంటూ ప్రశ్నించాడు. దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం ప్ర‌భుత్వాన్ని వివ‌ర‌ణ కోరింది.

దీనిపై విచారించిన కోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూ.. బ‌య‌ట ఫుడ్ ఎందుకు తీసుకెళ్ల‌కూడ‌దంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. బ‌య‌ట నుంచి లేదంటే ఇంటి నుంచి తెచ్చుకునే ఫుడ్ ను అనుమ‌తిస్తూ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొంది. ధ‌ర‌ల్ని భారీగా త‌గ్గించ‌కుంటే మల్టీఫ్లెక్సులపై చ‌ర్య‌లు క‌ఠినంగా ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇదే విష‌యాన్ని మ‌హారాష్ట్ర మంత్రి సైతం.. ఆగ‌స్టు 1 నుంచి మ‌హారాష్ట్రలోని మ‌ల్టీఫ్లెక్సుల్లోకి బ‌య‌ట ఆహారాన్ని అనుమ‌తిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. దీన్ని అమ‌లు చేయ‌ని వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాల‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న మ‌హారాష్ట్ర స‌ర్కారు తీసుకున్న ఈ నిర్ణ‌యం మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు అమ‌లు చేస్తార‌న్న ప్ర‌శ్న‌ను ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. చ‌ట్టం ఎక్క‌డైనా ఒకేలా ఉండాల‌ని.. అస‌లు మ‌ల్టీఫ్లెక్సులోకి బ‌య‌ట నుంచి ఆహారాన్ని తీసుకెళ్ల‌కూడ‌ద‌న్న రూల్ ఎక్క‌డా లేద‌ని చెబుతున్నారు. మ‌రి.. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.


Tags:    

Similar News