న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ మరియు బ్రిటిష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ రూపొందించిన దక్షిణ ఆసియాలోని '400 మంది అత్యంత ప్రభావవంతులు' జాబితాలో చోటు సంపాదించారు హీరో అడివి శేష్. ఆర్ట్స్ - మీడియా - కల్చర్ లకు చెందిన ఆసియాలోని భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల్లోని పలువురు ప్రముఖులను ఈ జాబితాలో ఎంపిక చేశారని తెలుస్తోంది. ప్రముఖ వ్యక్తుల విజయ కథలను ప్రపంచ వేదికపై జరుపుకోవడం.. వారిని గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ జాబితాలో ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ అగ్ర స్థానంలో నిలిచారు. అలాగే బాలీవుడ్ ప్రముఖులు సోనూ నిగమ్ - రహత్ ఫతే అలీ - అద్నాన్ సమీ - జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి మహావడి కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ జాబితాలో మొత్తం 230 మంది భారతీయ ప్రముఖులు ఉండటం విశేషం. ఈ జాబితాను రెడీ చేయడానికి జర్నలిస్ట్ కిరణ్ రాయ్ యూకే నుంచి జూమ్ ద్వారా 400 మంది వ్యక్తులతో ఇంటర్వ్యూలు నిర్వహించారని తెలుస్తోంది. అడివి శేష్ ని ఇంటర్వ్యూ చేసి ఆర్ట్స్ సెక్షన్ లో ఈ జాబితాకు ఎంపిక చేశారు.
Full View
ఈ సందర్భంగా అడవి శేష్ ఓ వీడియో విడుదల చేశారు. "కోవిడ్ సమయంలో మీరందరూ జాగ్రత్తగా ఉన్నారని భావిస్తున్నాను. ఆసియాలో 400 అత్యంత ప్రభావవంతుల జాబితాలో నన్ను ఎంపిక చేసినందుకు కిరణ్ రాయ్ గారికి ధన్యవాదాలు. ఎ.ఆర్.రెహమాన్ గారు, సోనూ నిగమ్ గారు.. వంటి చాలా మంది గొప్పవాళ్లతో పాటు నేను ఎంపిక కావడం ఆనందంగా ఉంది" అని శేష్ పేర్కొన్నారు. కాగా, అడవి శేష్ ప్రస్తుతం మహేష్ బాబు నిర్మిస్తున్న ''మేజర్'' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన చిత్రాలు విలక్షమైన పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. 'క్షణం' 'గూఢచారి' 'ఎవరు' చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్టింగ్ తో పాటు స్టోరీ - స్క్రీన్ ప్లే విషయాల్లో కూడా మంచి పట్టున్న అడవి శేష్ మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు దక్షిణ ఆసియాలోని '400 మంది అత్యంత ప్రభావవంతులు' జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.