సోనూసూద్ బాటలో యువ హీరో నిఖిల్..!

Update: 2021-05-18 03:30 GMT
క‌రోనా సెకండ్ వేవ్ విజృంభనతో దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫస్ట్ వేవ్‌ నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకునే లోపే మహమ్మారి తన రూపం మార్చుకుని అతలాకుతలం చేస్తోంది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దీనిని కట్టడి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. సినీ ప్ర‌ముఖులు కూడా వారికి తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. సెలబ్రిటీలు వీలైనంత వరకు సాయం చేస్తున్నా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ లాగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిర్విరామంగా చేయడం లేదనే చెప్పాలి. సోనూ ఈ విపత్కర పరిస్థితుల్లో తన ఫౌండేషన్ ద్వారా అపరిమితమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో సోనూ ప్రజల పాలిట దైవంగా.. నేషనల్ హీరోగా పిలవబడుతున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా కరోనా నేపథ్యంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సేవా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ ముందుడే సిద్దార్థ్ ప్రస్తుత పరిస్థితులపై ఇటీవల ఓ వీడియో ద్వారా బాధను వ్యక్తం చేశారు. అక్కడితో సరిపెట్టుకోకుండా ఒక బృందాన్ని ఏర్పరచుకొని కోవిడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభాగ్యులను ఆదుకుంటున్నాడు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన దాకా వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాడు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ఆక్సిజన్ సిలిండర్స్ - హాస్పిటల్స్ లో బెడ్స్ గురించి సమాచారం అందిస్తున్నారు. తన టీమ్ తో పాటుగా ప్రైవేట్ వ్యక్తులను కూడా సమన్వయం చేసుకుంటూ ఏదో రకంగా సాయం చేస్తున్నారు. బ్లాక్ ఫంగస్ తో బాధపడుతున్న ఓ వ్యక్తికి విరాళాలు అందేలా చేయడంతో పాటు ఆరోగ్యాంధ్ర ద్వారా అతడికి వైద్య సదుపాయం అందేలా చేశాడు నిఖిల్.

సోనూ సూద్ లాగా భారీగా ఖర్చు చేసి దేశవ్యాప్తంగా ప్రజలను ఆదుకోవడం అందరికీ సాధ్యం కాదు. కానీ తోటివారికి వీలైనంత వరకు సహాయం చేయగలిగితే అది గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పుడు నిఖిల్ కూడా అదే చేస్తున్నాడు. గతేడాది కూడా యువ హీరో సినీ క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డానికి ఆర్థిక సాయం అందించాడు. అలానే డాక్ట‌ర్స్‌ - పారిశుద్ధ్య కార్మికులకు రెసిపిరేట‌ర్స్‌.. రీయూజ‌బుల్ గ్లౌవ్స్‌.. ఐ ప్రొటెక్ష‌న్‌ గ్లాసెస్‌.. శానిటైజర్స్.. మాస్కుల‌ను అందజేశాడు. ఇలా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ అందరి మన్ననలు పొందుతున్న నిఖిల్, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Tags:    

Similar News