ఏకంగా ఆస్కార్ పైనే క‌న్నేసిన యువ‌హీరో

Update: 2022-05-30 02:31 GMT
'ఆస్కార్ అవార్డ్' అన్న ప‌దమే ఎంతో గంభీర‌మైన‌ది. దానిని ఛేజిక్కించుకోవాల‌ని త‌పించే భార‌తీయ ఫిలింమేక‌ర్స్ ఎంద‌రో ఉన్నారు. బాలీవుడ్ నుంచే కాదు టాలీవుడ్ నుంచి ఆస్కార్ నామినేష‌న్‌ వ‌ర‌కూ వెళ్లిన సినిమాలున్నాయి. స్వ‌ర‌మాంత్రికుడు  ఏ.ఆర్.రెహ‌మాన్ ఆస్కార్ అందుకున్నారు. స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ తో ఈ ఫీట్ సాధ్య‌మైంది. ఇండియాలో జ‌రిగిన ఒరిజిన‌ల్ క‌థ‌ను తెర‌పై చూపించి ఆస్కార్ లు గెలుచుకున్నారు. ఇక ఆస్కార్ పుర‌స్కారాల ప‌రంగా గ‌త చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే.. అమీర్ ఖాన్ న‌టించిన లగాన్ కి గొప్ప హిస్ట‌రీ ఉంది.

క్రికెట్ నేప‌థ్యం దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో రూపొందిన‌ 'ల‌గాన్' చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఆస్కార్ గెలుచుకుంటుంద‌నే భావించారు. కానీ క‌మిటీ నిర్ధ‌య‌గా తిర‌స్క‌రించింది. అది 100 కోట్ల మంది భార‌తీయుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ల‌గాన్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ‌ ఆస్కార్ మిస్సింగ్ పై అమీర్ త‌న ఆవేద‌న‌ను వెలిబుచ్చారు. మిస్ట‌ర్ ప‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ క‌థానాయకుడిగా అశుతోశ్ గోవారిక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ల‌గాన్ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్రొఫెష‌నల్ బ్రిటీష్  క్రికెట‌ర్ల‌కు.. క్రికెట్ ఆట‌ అంటే ఏంటో తెలియ‌ని గ్రామ‌స్థుల‌కి మ‌ధ్య జరిగిన క్రీడా పోరు నేప‌థ్యంలో ఎంతో ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించిన మూవీ ఇది. ఆంగ్లేయుల‌పై భార‌తీయ విలేజ‌ర్ల క్లైమాక్స్ గేమ్ స‌న్నివేశం సినిమా గ్రాఫ్ ని అమాంతం పెంచుతుంది. ఈ చిత్రం అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. స‌రిగ్గా ఈ సినిమా రిలీజ్ అయి రెండు ద‌శాబ్ధాలు పైగా పూర్త‌యింది. 2001 జూన్ 15న ల‌గాన్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.  

ల‌గాన్ ఆస్కార్ బ‌రిలోనూ నిలిచి తృటిలో అవార్డును మిస్సైంది. 2002 లో ఉత్త‌మ విదేశీ చిత్రంగా పోటీ బ‌రిలో నిలిచి టాప్ -5 లో స్థానం ద‌క్కించుకుంది. ల‌గాన్ దాదాపు 25 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. 65 కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ను సాధించింది. అయితే ల‌గాన్ కి ఆస్కార్ ద‌క్క‌న‌ప్ప‌టికీ రేసులో టాప్ 5 లో నిల‌వ‌డంతో అమీర్ దానినే పెద్ద రివార్డుగా భావించారు. ఇది గొప్ప విజ‌యం అంటూ అమీర్ ప్ర‌క‌టించారు.

ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల పేర్లు వినిపించినా కానీ ఏదీ ఆస్కార్ ని సాధించ‌లేదు. వీటిలో స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ ఉనికిని చాటుకుంది. చాలా కాలానికి ఇప్పుడు మ‌రో సినిమాని ఆస్కార్ రేసుకు వెళుతుంద‌ని గుస‌గుస వైర‌ల్ అవుతోంది. యంగ్ బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా న‌టించిన కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అనేక్ ఆస్కార్ కి వెళుతుందంటూ బాలీవుడ్ మీడియా గుస‌గుస‌ల్ని వైర‌ల్‌ చేస్తోంది. దీనికి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు వంత పాడుతున్నాయి. హీరో ఆయుష్మాన్ కి ఇదే  ప్ర‌శ్న ఎదురైతే హుందాగా స‌మాధాన‌మిచ్చాడు. మంచి సినిమాల‌కు భార‌తీయ హీరోల‌కు స‌రిహ‌ద్దులు ఉండ‌కూడ‌ద‌ని కూడా ఆయుష్మాన్ అన్నారు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల‌తో ఆక‌ట్టుకుంటున్న ఆయుష్మాన్ ఇంత‌కుముందు ఆర్టిక‌ల్ 15 లాంటి విల‌క్ష‌ణ చిత్రంలో న‌టించి విజ‌యం అందుకున్నాడు. అదే త‌ర‌హాలో అనేక్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

రీమేక్ పైనా నిర్మాత‌ల‌ ఆస‌క్తి..!ఆయుష్మాన్ ఖురానా-నటించిన 'అనేక్' డీసెంట్ ఓపెనింగుల‌ను సాధించింది. ఈ సంవత్సరం కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇది మరో కంటెంట్-ఆధారిత చిత్రం. కాశ్మీర్ మారణహోమం నేప‌థ్యంలో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన భౌగోళిక-రాజకీయ చిత్రం త‌ర‌హాలోనే అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన 'అనేక్' ఈశాన్య ప్రాంతాల భౌగోళిక రాజకీయాలను ఎంచుకొని ప్రస్తుత కాలంలో సెట్ చేసిన స్టోరీతో ర‌న్ అవుతుంది. ఇది అండ‌ర్ కాప్ స్టోరీ. ఈ మూవీ గొప్ప అనుభూతుల స‌మాహారంగా తెర‌కెక్కింద‌ని.. చాలా పెద్ద కమర్షియల్ సెటప్ తో మెప్పించనుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఒరిజిన‌ల్ కంటెంట్ తో ట్రైల‌ర్ మెప్పించ‌గానే జ‌నాల అటెన్ష‌న్ అటువైపు మ‌ళ్లింది. యాక్షన్ తో పాటు హై డ్రామా డైలాగ్ ప‌వ‌ర్ తో ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది.

ఇంత‌కుముందు ఆర్టికల్ 15 ప్రధాన అంశం నేప‌థ్యంలో అనుభవ్ సిన్హా-ఆయుష్మాన్ ఖుర్రానా కాంబినేష‌న్ మూవీ పెద్ద హిట్ట‌య్యింది. దేశంలోని ప్రస్తుత స్థితి కులతత్వంపై  తీసిన సినిమా ఆర్టిక‌ల్ 15 తొలిరోజు రూ. 5.02 కోట్లు వ‌సూలు చేయ‌గా టోట‌ల్ ర‌న్ లో రూ. 65.45 కోట్లు తేగ‌లిగింది.

ఇప్పుడు థియేటర్లలో ఇదే త‌ర‌హా వ‌సూళ్లు సాధించాల‌ని 'అనేక్' బృందం భావిస్తోంది. తూర్పు ఇండియాలో అస్థిర ప‌రిస్థితుల్ని స‌రిదిద్దే అండ‌ర్ కాప్  స్టోరీతో తెర‌కెక్కిన ఈ సినిమా యూత్ కి న‌చ్చుతుంద‌ని చెబుతున్నారు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా ఆరంభ వ‌సూళ్లు ఆశించినంత‌గా ఉండ‌వు. మౌత్ టాక్ ద్వారా ఆ త‌ర్వాత పుంజుకునే వీలుంటుంది. అనేక్ ఈనెల 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది. ఇక ఈ మూవీకి ఉన్న ముంద‌స్తు టాక్ దృష్ట్యా ఈ సినిమా సౌత్ రీమేక్ హ‌క్కుల‌కు డిమాండ్ ఏర్ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. గ‌తంలో ఆయుష్మాన్ న‌టించిన సినిమాల రీమేక్ హ‌క్కుల‌ను ఛేజిక్కించుకునేందుకు  ప్ర‌య‌త్నించిన ప‌లువురు టాలీవుడ్ నిర్మాత‌లు అనేక్  రైట్స్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మాచారం.
Tags:    

Similar News