లైగర్ బ్యూటీకి జీరో మార్క్స్..!

Update: 2022-08-26 12:30 GMT
బాంబే నుంచి హీరోయిన్లను ఇంపోర్ట్ చేసుకోవడం మనం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో చూస్తున్నాం. నార్త్ బ్యూటీస్ గ్లామర్ షోకు అడ్డు చెప్పరనో.. ఎలాంటి హద్దులు పెట్టకుండా అందాలు ఆరబోస్తారనో.. ఫ్రెష్ నెస్ కోసమో తెలియదు కానీ కొన్నేళ్లుగా అందరూ అదే ఫాలో అవుతున్నారు. వారిలో అందం అభినయంతో ఇక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నావారు చాలా మందే ఉన్నారు.

అయితే ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న తరుణంలో.. మేకర్స్ హిందీ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాది జనాలకు తెలిసిన బాలీవుడ్ హీరోయిన్ ను ఎంచుకోవడం అవసరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య పలువురు బాలీవుడ్ భామలు తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఇస్తూనే ఉన్నారు.

ఇప్పుడు లేటెస్టుగా "లైగర్" సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'సాలా క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన సినిమా ఇది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు.

పాన్ ఇండియా స్థాయిలో గురువారం 'లైగర్' చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏ విషయంలోనూ సంతృప్తి పరచలేకపోయింది. తొలి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి రివ్యూలు కూడా అలానే వచ్చాయి.

హీరోయిన్ అనన్య పాండే ని 'లైగర్' సినిమాకు ప్రధాన మైనస్ లలో ఒకటిగా ఆడియన్స్ పేర్కొంటున్నారు. అనన్య స్క్రీన్ మీద కనిపించిన ప్రతీసారి అసహనానికి ఫీల్ అవుతున్నారు. సినిమా ట్రాక్ లోకి వస్తుందని అనుకున్నప్పుడల్లా అనన్య ఎంట్రీతో సైడ్ ట్రాక్ లోకి వెళ్లిపోయిందని అంటున్నారు.

పూరీ జగన్నాథ్ ప్రధాన జోడీ అన‌న్య పాండే - విజ‌య్ దేవరకొండ మధ్య ల‌వ్ ట్రాక్ ని చాలా పేలవంగా రాడుకోవడం కూడా దీనికి కారణంగా చెప్పాలి. దీనికి తగ్గట్టుగానే అమ్మడి పెర్ఫార్మన్స్ ఉంది. ఆమె యాక్టింగ్ మరియు లుక్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఆమె కనిపించే ఏ సీన్ కూడా బలంగా లేకపోవడం.. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ పలకపోవడం ప్రధాన సమస్యగా మారాయి.

'లైగర్' సినిమాలో అనన్య ని చూసి అసలు ఈమె హీరోయిన్ మెటీరియల్ కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రేక్షకులతో పాటుగా సినీ విమర్శకులు సైతం బాలీవుడ్ బ్యూటీని రిజెక్ట్ చేశారు. ఓవరాల్ గా అనన్య కు ఈ సినిమాలో హీరోయిన్ గా జీరో మార్క్స్ పడ్డాయి. అనన్య పాండే పాత్ర ఈ సినిమాకు బిగ్ మైనస్ గా చెబుతున్నారు.

బాలీవుడ్ లోని నెపోటిజంతో హీరోయిన్ గా నెట్టుకొస్తున్న అనన్య ను తెలుగులో పరిచయం చేయాలనే కరణ్ జోహార్ ప్లానింగ్ బెడిసి కొట్టిందని అంటున్నారు. అసలు పూరీ ఈమెను కరణ్ ఒత్తిడి వల్లే తీసుకున్నాడేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వేరే హీరోయిన్ ని తీసుకొని ఉంటే స్క్రీన్ మీద కాస్తో కూస్తో ప్రభావం చూపించేదేమో అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద అనన్య కు తెలుగులో 'లైగర్' ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆడియన్స్ తీర్మానించారు.
Tags:    

Similar News