శ్రీరాముడిగా యానిమల్ నటుడు ఓకేనా?
రామాయణంలో రణబీర్ లార్డ్ రామ్ పాత్రను పోషించడం గురించి తాను ఏమనుకుంటున్నాడో గోవిల్ వెల్లడించాడు.
రామానంద్ సాగర్ ఐకానిక్ దూరదర్శన్ సీరియల్ `రామాయణం`లో శ్రీరాముడిగా నటించిన అరుణ్ గోవిల్ కి భారతీయ ప్రజల్లో గొప్ప ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే నటుడు ఆయన. తన పాత్రకు గోవిల్ ఇప్పటికీ గౌరవ మర్యాదలు అందుకుంటున్నారు. అతడు ఇటీవల విడుదలైన ఆదిపురుష్ పైనా తనదైన శైలిలో స్పందించారు. ఇప్పుడు నితీష్ తివారీ- రామాయణం ట్రయాలజీలో రణబీర్ కపూర్ హిందూ దేవుడు శ్రీరాముడి పాత్రలో నటించడం సరైనదేనా? అన్న దాని గురించి ఓపెన్ గా చర్చించారు.
రామాయణంలో రణబీర్ లార్డ్ రామ్ పాత్రను పోషించడం గురించి తాను ఏమనుకుంటున్నాడో గోవిల్ వెల్లడించాడు. ఐకానిక్ దూరదర్శన్ సీరియల్‌లోని శ్రీరాముడి పాత్రధారిని రణబీర్ సమం చేయగలరా అని ప్రశ్నించగా, అరుణ్ గోవిల్ ఇలా అన్నారు. ``అది జరుగుతుందో లేదో కాలమే చెప్పగలదు.. దాని గురించి ముందుగా ఏమీ చెప్పలేము`` అని అన్నారు. అయితే రణబీర్ నటప్రతిభ వ్యక్తిగత క్యారెక్టర్ ని తనదైన శైలిలో ఆకాశానికెత్తేశారు. రణబీర్ విషయానికి వస్తే అతడు మంచి నటుడు. అవార్డు గెలుచుకున్న మేటి నటుడు. అతడి గురించి నాకు తెలిసినది చాలా కష్టపడి పనిచేస్తాడు. అతడు చాలా సంస్కారవంతమైన పిల్లవాడు. మంచి నైతిక సాంస్కృతిక విలువలను కలిగి ఉన్నవాడు. నేను చాలాసార్లు గమనించాను. అతడు తన స్థాయిని ఉత్తమంగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు అని అన్నారు. యానిమల్ లో హింసాత్మకమైన పాత్రలో నటించిన రణబీర్ పై అరుణ్ గోవిల్ వ్యతిరేకతను కనబరచకపోవడం ఆసక్తికరం.
రామాయణం పనులు ఎంతవరకూ?
నితీష్ తివారీ రామాయణం ప్రీప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపికలు వేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీడియోల్ ఆంజనేయునిగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కింగ్ దశరథ్‌గా నటించడానికి అంగీకరించారు. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారా దత్తా ఎంపికయ్యారని ఇప్పటికే కథనాలొచ్చాయి. ఇతర పాత్రల ఎంపిక పూర్తవుతోంది. రామాయణాన్ని మార్చి నాటికి సెట్స్ పైకి తీసుకురావడానికి దర్శకనిర్మాత నితేష్ తివారీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ పాత్ర కోసం నవీన్ పోలిశెట్టిని సంప్రదించారని మీడియాలో కథనాలొచ్చాయి.
చిన్ననాటి రాముడు, లక్ష్మణుడు పాత్రల కోసం ప్రస్తుతానికి నలుగురైదుగురు యువ నటులు షార్ట్‌లిస్ట్‌లో ఉన్నారు. రామాయణం చిత్రీకరణ మార్చి 2024లో ప్రారంభమవుతుంది. సన్నీ డియోల్ మేలో తన పాత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. జూలైలో యష్ తారాగణంలో చేరనున్నారు. దీపావళి 2025 విడుదలను లక్ష్యంగా చేసుకుని యష్ సన్నివేశాలను పూర్తి చేసిన తర్వాత రామాయణం షూటింగ్‌ను ముగించాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రం మూడు భాగాల సిరీస్‌గా ప్లాన్ చేసారు. కొన్ని నెలల క్రితం రణబీర్ లాస్ ఏంజెల్స్ కు వెళ్లి VFX కంపెనీతో రామాయణం ప్రీ-విజువలైజేషన్ ని పరిశీలించారని తెలిసింది.