'ఆర్య'.. ఇది సినిమా మాత్రమే కాదు: బన్నీ

ఈ చిత్రం తన జీవిత గమనాన్నే మార్చేసిందని పేర్కొన్నారు.

Update: 2024-05-07 07:25 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'గంగోత్రి' చిత్రంతో హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. డెబ్యూ మూవీ మంచి హిట్ ఇచ్చినప్పటికీ, బన్నీకి ఫేమ్ తెచ్చిపెట్టిన సినిమా మాత్రం 'ఆర్య' అని చెప్పాలి. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ఈ మూవీతో డైరెక్టర్ సుకుమార్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. 2004 మే 7న రిలీజైన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నేటికి ఈ సినిమా వచ్చి 20 ఏళ్ళు పూర్తైన నేపథ్యంలో, హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం తన జీవిత గమనాన్నే మార్చేసిందని పేర్కొన్నారు.

''ఆర్య చిత్రానికి 20 ఏళ్లు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను'' అని అల్లు అర్జున్ తన ట్విట్టర్ 'ఎక్స్'లో పోస్ట్ చేసారు. స్వీట్‌ మెమొరీస్‌ అంటూ సెట్స్ లో షూటింగ్‌ కు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకుంటూ ఆ రోజులను గుర్తుచేసుకున్నారు. మరోవైపు బన్నీ ఫ్యాన్స్ సైతం ‘ఆర్య’ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. #2DecadesForClassicArya #20YearsOfArya వంటి హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు.

‘ఆర్య’ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అను మెహతా హీరోయిన్ గా నటించింది. శివ బాలాజీ కీలక పాత్ర పోషించగా.. సుబ్బరాజు, సునీల్, రాజన్ పి. దేవ్, వేణు మాధవ్ ఇతర పాత్రల్లో నటించారు. అభినయశ్రీ స్పెషల్ సాంగ్ లో ఆడి పాడింది. ‘వన్‌ సైడ్‌ లవ్‌’ అనే డిఫెరెంట్ కాన్సెప్ట్‌ తో తీసిన ఈ సినిమా మార్నింగ్‌ షోకి డివైడ్‌ టాక్‌ వచ్చింది. అయితే యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈవెనింగ్ షోల నుంచి పుంజుకుంది. కట్ చేస్తే థియేటర్లలో 125 రోజులు ప్రదర్శితమై, టాలీవుడ్‌ లో సరికొత్త ట్రెండ్‌ సెట్‌ చేసింది.

‘ఆర్య’ సినిమాని కేవలం రూ. 4 కోట్లతో నిర్మిస్తే.. బాక్సాఫీస్ దగ్గర రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అదే పేరుతో మలయాళంలో డబ్‌ చేసి రిలీజ్ చేస్తే, రూ. 35 లక్షల వరకూ వసూలు చేయడమే కాదు, బన్నీకి కేరళలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడేలా చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. డీఎస్పీ కంపోజ్ చేసిన అన్ని పాటలూ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ‘ఫీల్‌ మై లవ్‌’ సాంగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిస్తే, ‘అ అంటే అమలాపురం’ పాట ఐటెమ్ సాంగ్స్ లో బెస్ట్ అనిపించుకుంది.

ఇకపోతే 'ఆర్య' చిత్రానికి గాను బెస్ట్ డైరెక్టర్ గా డెబ్యూతోనే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్ అందుకున్నారు సుకుమార్. అలానే బెస్ట్ స్క్రీన్‌ప్లే (సుకుమార్‌), స్పెషల్‌ జ్యూరీ (అల్లు అర్జున్‌), బెస్ట్ ఫైట్స్‌ (రామ్‌- లక్ష్మణ్‌), ఉత్తమ గాయకుడు (సాగర్‌) కేటగిరీల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురష్కారాలు లభించాయి. 2009లో ఆర్య సీక్వెల్ గా తెరకెక్కించిన 'ఆర్య 2' సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ - సుకుమార్‌ - దేవీశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. దీని రెండో భాగం ‘పుష్ప 2: ది రూల్’ ఆగస్టు 15న విడుదల కానుంది.

ఇదిలా ఉంటే 'ఆర్య' మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు సాయంత్రం జరిగే మూవీ యూనిట్‌ రీ యూనియన్‌ పార్టీకి బన్నీ, సుకుమార్, దిల్ రాజులతో పాటుగా ఈ చిత్రంలో భాగమైన పలువురు నటీనటులు సాంకేతిక నిపుణులు హాజరు కానున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

Tags:    

Similar News