'స్టార్‌డం' వెయిట్‌ పెంచబోతున్న స్టార్‌ హీరో

వీరిద్దరు మాత్రమే కాకుండా బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ ఏదో ఒక సమయంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం జరిగింది.

Update: 2024-09-18 13:00 GMT

బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలు ఒకరి సినిమాల్లో మరొకరు నటించడం అనేది చాలా కామన్‌ విషయం. సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో షారుఖ్‌ ఖాన్ నటించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే షారుఖ్ ఖాన్‌ హీరోగా నటించిన సినిమాల్లో గతంలో సల్మాన్ ఖాన్‌ గెస్ట్‌ అప్పియరెన్స్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. వీరిద్దరు మాత్రమే కాకుండా బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ ఏదో ఒక సమయంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈసారి ఒక వెబ్‌ సిరీస్‌ కోసం షారుఖ్ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ లు గెస్ట్‌ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్‌ లో చక్కర్లు కొడుతోంది.

షారుఖ్ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ దర్శకుడిగా 'స్టార్‌డం' అనే వెబ్‌ సిరీస్‌ ను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఓటీటీ లో అడుగు పెట్టబోతున్న ఆర్యన్ ఖాన్‌ కోసం షారుఖ్ ఖాన్‌ ఇప్పటికే గెస్ట్‌ గా నటించేందుకు ఒప్పుకున్నాడని, షారుఖ్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ను సైతం స్టార్‌డం కోసం ఆర్యన్‌ ఖాన్‌ తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడట. ఆర్యన్‌ స్వయంగా సల్మాన్‌ ఖాన్‌ తో మాట్లాడి, తన సిరీస్‌ గురించి చెప్పి ఒప్పించి, నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఆర్యన్ ఖాన్‌ రూపొందిస్తున్న స్టార్‌డం సిరీస్‌ లో షారుఖ్ ఖాన్‌, సల్మాన్ ఖాన్‌ లు వారి నిజ జీవిత పాత్రల్లోనే కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం ఆరు ఎపిసోడ్స్ గా రూపొందుతున్న ఈ వెబ్‌ సిరీస్ లో ఒక ఎపిసోడ్‌ మొత్తం షారుఖ్‌ ఖాన్‌ చుట్టూ, మరో ఎపిసోడ్‌ మొత్తం సల్మాన్ ఖాన్ చుట్టూ తిరిగేలా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌ పై సన్నివేశాల చిత్రీకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారని, ఇప్పటి వరకు చూడని విభిన్నమైన కాన్సెప్ట్‌ లో 'స్టార్‌డం' ను ఆర్యన్‌ ఖాన్‌ రూపొందిస్తున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు ఓటీటీ ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'స్టార్‌డం' లో కేవలం షారుఖ్ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్ మాత్రమే కాకుండా మరికొందరు గెస్ట్‌ లు ఈ సిరీస్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీ చుట్టూ తిరిగే కథ తో ఈ సిరీస్‌ ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌ తో ఒక స్టార్‌ హీరో సినిమా స్థాయిలో ఈ వెబ్‌ సిరీస్‌ ను నిర్మిస్తున్న ఆర్యన్ ఖాన్‌ స్ట్రీమింగ్ కు సంబంధించి ఎప్పుడు ప్రకటన చేస్తాడా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News