లైగర్ బాకీలతో నాకెలాంటి సంబంధం లేదు - ఏషియన్ సునీల్!
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పూరి జగన్నాథ్ ని లైగర్ మూవీ వివాదం ఇప్పటికి వెంటాడుతుంది. లైగర్ సినిమా రైట్స్ ని కొనుగోలు చేసి భారీగా నష్టపోయిన డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పూరి జగన్నాథ్ పై అప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు. తాము నష్టపోయిన సొమ్ము తిరిగి చెల్లించాలని పూరి జగన్నాథ్ ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై చాలా సార్లు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో పంచాయితీలు జరిగాయి.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన హోమ్ బ్యానర్ లోనే తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. సినిమాపై పూరి టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అయితే మూవీ రిలీజ్ కి లైగర్ ఎగ్జిబిటర్స్ నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. మా బాకీలు చెల్లించే వరకు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానిచ్చే ఛాన్స్ లేదని ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో వారందరూ పంచాయితీ పెట్టారు.
దీనిపై కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయంట. ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్, డిస్టిబ్యూటర్ ఏషియన్ సునీల్ లైగర్ బాకీలు తీర్చడానికి ఒప్పుకున్నారని న్యూస్ తెరపైకి వచ్చింది. దీని కోసం పూరి జగన్నాథ్ ఏషియన్ మూవీస్ లో ఒక సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేస్తున్నారనే ప్రచారం నడిచింది. అయితే తాజాగా ఏషియన్ సునీల్ ఈ ప్రచారాన్ని ఖండించారు. లైగర్ బాకీలు నేనెందుకు తీరుస్తాను. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఆ వార్తలలో వాస్తవం లేదని తేల్చేశారు. పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలని అనుకుంటే డైరెక్ట్ గానే చేస్తాను. ఇలా లైగర్ బాకీలకి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం నాకేముంటుందని ప్రశ్నించారు. పూరి జగన్నాథ్ తో సినిమా అనేది ఎప్పటి నుంచో ఉన్న ఆలోచనే అని తెలిపారు. అది ఎప్పుడు ఉంటుందో ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదని అన్నారు. పూరికి, ఎగ్జిబిటర్స్ కి మధ్యవర్తిగా ఉంటూ ఆ బాకీలు నేను చెల్లించడానికి ముందుకి రావాల్సిన అవసరం నాకు లేదని తేల్చేశారు.
ఇక లైగర్ మూవీ డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అయితే తమ సమస్యని పరిష్కరించాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో రెగ్యులర్ గా మీటింగ్ పెడుతున్నారంట. నిర్మాత స్రవంతి రవి కిషోర్ వారితో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ వరకు వెయిట్ చేయాలని చెప్పిన వారు వినడం లేదంట. తమ సమస్య పరిష్కారం అయితేనే డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అవుతుందని, లేదంటే అడ్డుకుంటామని ఎగ్జిబిటర్స్ తేల్చి చెప్పారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ ఇష్యూలో ఫైనల్ గా ఎలాంటి పరిష్కారం వస్తుందనేది వేచి చూడాలి.