డైరెక్టర్‌తో హీరోకి సయోధ్య కుదిరేదెలా?
టాలీవుడ్ బిజినెస్ లో ఈ ఛేంజ్ కొంతకాలంగా మరీ ఎక్కువగా కనిపిస్తోంది.
ఇటీవలి కాలంలో సినిమా వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. అంతేకాదు.. సినిమా వ్యాపారంలో హీరోల ప్రమేయం ఎక్కువగా ఉంది. ఇప్పుడు కేవలం నిర్మాత మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించలేడు. హీరో, దర్శకుడి భాగస్వామ్యంతో చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. టాలీవుడ్ బిజినెస్ లో ఈ ఛేంజ్ కొంతకాలంగా మరీ ఎక్కువగా కనిపిస్తోంది.
ఈపాటికే బన్ని- అట్లీ సినిమా సెట్స్ కెళ్లాల్సి ఉన్నా కానీ, అది అంతకంతకు ఆలస్యమవ్వడానికి కారణం ఇలాంటిదేనని అంటున్నారు. అట్లీతో సినిమా తన సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ లోనే తెరకెక్కాలని బన్ని భావిస్తున్నాడు. కానీ అట్లీ తనకు సన్ పిక్చర్స్ వాళ్లతో కమిట్ మెంట్ ఉంది. ఎట్టి పరిస్థితిలో ఆ బ్యానర్‌లోనే చేయాలని అంటున్నాడు. దీనిపై చాలా కాలంగా చర్చోపచర్చలు సాగుతున్నాయట. కానీ ఎటూ తెగడం లేదు. దీంతో మొన్న ప్రారంభం కావాల్సిన సినిమా కాస్తా వాయిదా పడిందని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సుకుమార్ తో `పుష్ప2` చిత్రీకరణ పూర్తయాక బన్ని తన తదుపరి చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో చేయనున్నాడు. `జవాన్` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని అట్లీ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. అందువల్ల పుష్ప స్టార్ తో జవాన్ డైరెక్టర్ సినిమాకి ఉండే క్రేజ్ వేరే లెవల్. అమాంతం పెరిగిన బజ్ వల్ల గీతా ఆర్ట్స్ లోనే సినిమా తెరకెక్కాలని అరవింద్ - అల్లు అర్జున్ బృందాలు పట్టుబడుతున్నాయట. కానీ అట్లీ కమిట్ మెంట్ వీడలేనని చెబుతున్నారట. దీనిని బట్టి అలవైకుంఠపురములో ఫార్ములాని ఇప్పుడు అప్లయ్ చేస్తారని చెబుతున్నారు. ఇరు బ్యానర్లకు సమస్య లేకుండా సన్ పిక్చర్స్- గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కించేందుకు సయోధ్య కుదిరే వీలుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.