ఏ పార్టీని ఉద్ధేశించి ఆ సీన్స్ తీయలేదన్న అట్లీ!
తాజాగా ప్రముఖ జాతీయ మీడియా చాటింగ్ సెషన్ లో అట్లీ చాలా విషయాలపై ముచ్చటించారు.
తమిళ దర్శకుడు అట్లీ తన బ్లాక్ బస్టర్ చిత్రం 'జవాన్' రాజకీయ సందేశం గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. జవాన్ ఇటీవల విడుదలై అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాకుండా కింగ్ ఖాన్ షారూఖ్ ను కొత్త ఎత్తులకు చేర్చింది. ఇది విడుదలైన తర్వాత చాలామంది షారూఖ్ ఖాన్‌కు రాజకీయాలను ఆపాదించారు. అతడి వ్యక్తిగత జీవిత అనుభవాలను ప్రతిబింబించే సన్నివేశాలను ఇందులో చూపించారని చాలామంది వ్యాఖ్యానించారు. ఒక ఇంటర్వ్యూలో అట్లీ తమిళ ఇండస్ట్రీలో తన మునుపటి సినిమాల్లోను సామాజికంగా తెలివైన విషయాల్ని చూపించినందున అవి బాగా ఆడాయని అన్నారు. సినిమాలో సందేశం ఇవ్వాలని ఆలోచిస్తానని అట్లీ తెలిపాడు. అయితే రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకుని జవాన్ లో ఏ సీన్ ని తెరకెక్కించలేదని అన్నాడు.
తాజాగా ప్రముఖ జాతీయ మీడియా చాటింగ్ సెషన్ లో అట్లీ చాలా విషయాలపై ముచ్చటించారు. జవాన్ రాజకీయ సందేశాలలో ఎక్కువ భాగం షారుఖ్‌కు వ్యక్తిగతంగా ఆపాదించబడినా కానీ, అట్లీ ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకోడని గమనించాలి. అట్లీ మాట్లాడుతూ "నేను కూడా ప్రెస్‌లో భాగమే.. మీడియాలోను భాగమే. నేను ఒక బాధ్యతతో వినోదం అందించాలి. అయితే నేను ఇప్పటికీ సందేశం లేకుండా ప్రేక్షకులను అలరించగలను. కానీ నేను నా పనిని సరైన మార్గంలో చేయలేను. నేటి సమస్యల గురించి నాకు తెలుసు.
రచయితగా దర్శకుడిగా నేను వాటి గురించి మనం ఏమి చేయగలమో ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను" అని అన్నాడు. "ఇది నా వాయిస్.. ఇది సామాన్యుడి వాయిస్...'' అని వివరణ ఇచ్చాడు. జవాన్ లో సందేశం తమకు అనుకూలంగా ఉందని బిజెపి .. కాంగ్రెస్ రెండూ క్లెయిమ్ చేస్తున్న విషయాన్ని అట్లీ దృష్టికి తీసుకెళ్లగా అతడు ఇలా అన్నాడు, ''ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరూ చాలా బాధ్యత వహించాలి.
నేను సినిమాలో రాజకీయాలు ఏవీ పేర్కొనడం లేదు… మీరు తెలుసుకోవాలి. మీ ఓటు విలువ, ఎలా ఓటు వేయాలి? ఏ ప్రాతిపదికన ఎవరికి ఓటు వేయాలి? అనే నిర్ణయానికి రావాలి.ఇది కేవలం మాన్యువల్. మీ బాధ్యత ఏమిటో మేము వివరిస్తాము. ఏం చేయాలో మీరే నిర్ణయించాలి'' అని సూచించాడు.
ఈ చిత్రం ప్రత్యేకంగా ఏదైనా రాజకీయ పార్టీ కార్యకలాపాలకు సంబంధించినదా అని ప్రశ్నించగా, ''ఇప్పటి నుండి 100 సంవత్సరాల తర్వాత కూడా నా సినిమాతో ప్రజలు రిలేట్ కావాలని అనుకుంటాను'' అని అన్నారు. ''ఒక కోచ్ ఒక విద్యార్థికి ఎలా బౌలింగ్ చేయాలో నేర్పిస్తే, అది తదుపరి మ్యాచ్ కోసం కాదు. జీవితకాలం కోసం. నేను జీవితకాల సందేశం సినిమాల్లో చెబుతున్నాను. నా సినిమాలు 100 సంవత్సరాలు నిలబడాలి'' అని అట్లీ తెలివైన జవాబిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లతో, KGF: చాప్టర్ 2, RRR, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, దంగల్ తర్వాత జవాన్ ఆల్ టైమ్ ఐదవ అతిపెద్ద భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం షారుఖ్ వ్యక్తిగత రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద బాలీవుడ్ విడుదలగా నిలిచింది.