'డ్రింకర్ సాయి' డైరెక్టర్ పై ఎటాక్.. ఎందుకంటే..
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన డ్రింకర్ సాయి మూవీ లేటెస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన డ్రింకర్ సాయి మూవీ లేటెస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కించగా బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. డిసెంబర్ 27వ విడుదలైంది డ్రింకర్ సాయి చిత్రం.
రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పిన డ్రింకర్ సాయి.. ఇప్పుడు అలరిస్తోంది. అదే సమయంలో రీసెంట్ గా డైరెక్టర్ కిరణ్ క్రేజీ ఆఫర్ ఇచ్చారు. ప్రేక్షకుల నుంచి రివ్యూస్ తీసుకుంటున్నామని, ఒక కంటెస్ట్ ను నిర్వహించామని తెలిపారు. అందులో 100 మందిని ఎంపిక చేసి 31న పార్టీ ఇస్తామని చెప్పారు.
ఇప్పుడు సినిమా ఆడియన్స్ ను అలరిస్తున్న వేళ.. డైరెక్టర్ కిరణ్ అండ్ టీమ్ టూర్ వేశారు. అందులో భాగంగా గుంటూరులోని శివ థియేటర్ కు వెళ్లారు. ఆ తర్వాత థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో మూవీ టీమ్ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా ఎవరూ ఊహించని విధంగా డైరెక్టర్ కిరణ్ పై దాడి జరిగింది.
అయితే డైరెక్టర్ కిరణ్ పై మంతెన సత్యనారాయణ ఫాన్స్ దాడి చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఆయనను కించపరిచేలా సీన్లు ఉన్నాయని వారు ఆరోపించారు. ఆ సీన్స్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెగ చక్కర్లు కొడుతున్నాయి.
నేచురోపతి డాక్టర్ గా మంతెన సత్యనారాయణ ఎంతో ఫేమస్ అన్న విషయం తెలిసిందే. ఆయన చెప్పే ప్రకృతి వైద్య విధానాలను భారీ సంఖ్యలో ప్రజలు పాటిస్తుంటారు. ఇప్పుడు ఆయన స్టైల్ లోనే డ్రింకర్ సాయిలో క్యారెక్టర్ ఉంది! దీంతో మంతెనను కించపరిచేలా సీన్స్ ఉన్నాయని ఆరోపిస్తూ డైరెక్టర్ పై దాడి చేశారు.
అయితే సినిమాను సినిమాలాగే చూడాలని మూవీ టీమ్ చెబుతోంది. అందుకే పాత్రలు కల్పితాలు, ఎవరినీ ఉద్దేశించినవి కావని స్టార్టింగ్ లో డిస్క్లైమర్ వేస్తామని డైరెక్టర్ కిరణ్ తెలిపారు. ఆయన (మంతెన గారు)ను కించపరచలేదని చెప్పారు. కానీ సీరియస్ గా కొందరు ఎందుకు తీసుకున్నారో తెలియడం లేదని అన్నారు. ఏదైనా ఉంటే చెప్పాలి గానీ, డిస్కస్ చేయాలి గానీ, దాడి చేయడమేంటని, అది కరెక్ట్ కాదని మండిపడ్డారు.