'ఆవేశం' రీమేక్ లో ఆ హీరో? పెద్ద డిస్కషనే!
మరి అది ఎలా ఉంటుందో చూడాలంటే ఆ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
మాలీవుడ్ నటుడు ఫహాద్ ఫాజిల్.. మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా.. తెలుగు రాష్ట్రాల సినీ ప్రియులకు కూడా దాదాపు అందరికీ సుపరిచితమే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో విలన్ రోల్ లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు ఫహాద్ ఫాజిల్. ఇప్పుడు పుష్ప పార్ట్ -2లో ఆయన విలనిజాన్ని ఇంకాస్త పవర్ ఫుల్ గా మేకర్స్ చూపించనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి అది ఎలా ఉంటుందో చూడాలంటే ఆ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ క్రమంలో రీసెంట్ గా ఫహాద్ ఫాజిల్.. హీరోగా ఆవేశం మూవీ చేసిన విషయం తెలిసిందే. జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 14న థియేటర్లోకి వచ్చి ఊహించని విజయం సాధించింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది మలయాళంలో హైయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా నిలిచింది. రీసెంట్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఓటీటీలోకి వచ్చింది. అక్కడ కూడా మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.
ఒక గ్యాంగ్ స్టర్ స్టోరీకి ఇటు మదర్ సెంటిమెంట్ ను అటు కామెడీని జోడించి దర్శకుడు ఈ సినిమాను క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు. గ్యాంగ్ స్టర్ రంగా పాత్రలో కనిపించిన ఫహాద్.. తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. మూవీ క్లైమాక్స్ వరకు అసలు ఫైటే చేయని ఈ ఫన్నీ గ్యాంగ్ స్టర్ ను చూసి సినీ ప్రియులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ అదిరిపోయిందని చెబుతున్నారు.
ఇప్పుడు ఈ సినిమాలో ఫహాద్ రోల్ ను చూస్తుంటే టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య మేనరిజమ్ గుర్తొస్తుందని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. బాలయ్య ఈ సినిమా రీమేక్ లో నటిస్తే బాగుంటుందని ఇంకొందరు అంటున్నారు. తెలుగు ఆడియన్స్.. కచ్చితంగా బాలయ్య రోల్ కు కనెక్ట్ అవుతారని కామెంట్స్ పెడుతున్నారు. డైరెక్టర్ కాస్త తెలుగు ఆడియన్స్ కు తగ్గట్లు సీన్స్ ను రీ క్రియేట్ చేస్తే చాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి ఈ మలయాళం సూపర్ హిట్ మూవీని రీమేక్ చేయాలనుకుంటే.. బాలయ్యతో కచ్చితంగా చేయవచ్చని చెబుతున్నారు నెటిజన్లు. గతంలో బాలయ్య.. ఆవేశం మూవీలో హీరో రోల్ లాంటి పాత్రను పైసా వసూల్ సినిమాలో చేశారు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ గా మారింది. ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్.. కాస్త మార్పులు చేర్పులు చేసి ఆవేశం మూవీని బాలయ్యతో రీమేక్ చేయొచ్చంటున్నారు సినీ ప్రియులు. మరి ఎవరైనా డైరెక్టర్ ఆవేశం మూవీ రీమేక్ వైపు మొగ్గు చూపుతారేమో చూడాలి.