BSS10.. హైదరాబాద్ డీఎస్పీగా బెల్లంకొండ
ప్రస్తుతం సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అయితే హిందీలో ఛత్రపతి రీమేక్ చేయడం వల్ల ఆయన తెలుగు సినిమాలకు మూడేళ్ల బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో హైదరాబాద్ నగర డీఎస్పీగా కనిపించనున్నారు. ఈ విషయాన్ని కాస్త వినూత్నంగా తెలిపింది చిత్రయూనిట్. ప్రజా ప్రయోజనాల కోసం ఓ నోటీసు జారీ చేశారు మేకర్స్.
అందులో ఓ యంగ్ డైనమిక్ ఆఫీసర్ కు హైదరాబాద్ డీఎస్పీగా పోస్టింగ్ వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. ఫ్యాన్స్ తో పాటు మీడియాకు నోటీస్ కాపీ ఇచ్చినట్లు చెప్పారు. దీంతో ఈ మూవీలో లాఠీ పట్టనున్న బెల్లంకొండ.. మాస్ యాక్షన్ తో అదరగొట్టనున్నారన్న మాట.
సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 10వ చిత్రమిది. అందుకే BSS10 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. విజయ్, వెంకట్, రియల్ సతీశ్ మాస్టర్లు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
అయితే జనవరి 3వ తేదీ బెల్లంకొండ పుట్టినరోజు కనుక.. BSS10 మూవీ యూనిట్ సాలిడ్ అప్డేట్ ఇవ్వనుంది. టైటిల్, హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనుంది. ఈ మూవీకి టైసన్ నాయుడు అనే పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఒకప్పడు ఈ టైటిల్ దివంగత నటుడు శ్రీహరి సినిమాకు అనుకున్నారట. కానీ ఆ తర్వాత శేషాద్రి నాయుడు అని పెట్టినట్లు తెలిసింది. శ్రీహరిని హీరోగా చేసింది బెల్లంకొండ సురేశ్ అన్న విషయం తెలిసిందే.
ఈ సినిమాతోపాటు బెల్లంకొండ... మున్నా దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమాకు దేవుడే దిగి వచ్చినా టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ ను పవన్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపొందిన బ్రో మూవీకి అప్పుడు పెడదామనుకున్నారట కానీ కుదరలేదట. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.