కమర్షియల్ మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకునేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఆ రూట్లో అతను పూర్తిస్థాయిలో సక్సెస్ అందుకున్న సందర్భాలు తక్కువే. కానీ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా బిగ్ బడ్జెట్ సినిమాలు చేసిన ఏకైక హీరోగా బెల్లంకొండ రికార్డు క్రియేట్ చేశాడు. ఆ మధ్య రాక్షసుడు హిట్టవ్వగానే వినాయక్ తో కలిసి బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ చేసిన అతనికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది.
హిందీలో బెల్లంకొండ డబ్బింగ్ సినిమాలు ఒక రేంజ్ లో క్లిక్కయ్యాయి. యూట్యూబ్ లో వందల మిలియన్ల వ్యూవ్స్ రావడం అతనికి కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కానీ ఫ్రీగా యూట్యూబ్ లో చూసిన ఆడియెన్స్ బెల్లంకొండను వెండితెరపై డబ్బులిచ్చి చూసేందుకు పెద్దగా ఆసక్తిని చూపించలేదు. ఛత్రపతి రీమేక్ సినిమా హిట్టయ్యి ఉంటే మరో పెద్ద పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకున్నాడు.
టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కూడా చర్చల్లోకి వచ్చింది కానీ అప్పటికే రవితేజ మరో డైరెక్టర్ తో ఆ ప్రాజెక్టు మొదలు పెట్టడంతో అది క్యాన్సిల్ అయ్యింది. ఇక ప్రస్తుతం భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో టైజన్ నాయుడు అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు రాక్షసుడు సీక్వెల్ కూడా లిస్టులో ఉంది.
అయితే రెగ్యులర్ గా కమర్షియల్ మాస్ సినిమాలు కంటిన్యూ చేయకుండా ఉండాలని ఈ హీరో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఒక డిఫరెంట్ కథను సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. పెగళ్లపాటి కౌశిక్ అనే దర్శకుడితో సినిమా చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇది ఒక హారర్ బ్యాక్ డ్రాప్ మూవీ అని తెలుస్తోంది. ఈ దర్శకుడు ఇంతకుముందు చావు కబురు చల్లగా అనే సినిమా చేశాడు.
కార్తికేయ హీరోగా నటించిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదు. కానీ ఇపుడు భయపెట్టేలా ఒక దెయ్యం కథ కోసం బెల్లంకొండను లైన్ లోకి తీసుకు వస్తున్నాడు. దాదాపు కథ ఓకే అయినట్లుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని దర్శకుడు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు టైజన్ నాయుడు సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా ఫినిష్ అయ్యింది. అందులో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.