బెట్టింగ్ యాప్స్ కేసుపై స్పందించిన విజయ్ దేవరకొండ టీం
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, నటుడు విజయ్ దేవరకొండ పేరు కూడా తెరపైకి వచ్చింది;
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, నటుడు విజయ్ దేవరకొండ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్ నైపుణ్యం ఆధారిత ఆటలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారని వారు స్పష్టం చేశారు.
విజయ్ దేవరకొండ టీమ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన కేవలం చట్టబద్ధంగా పనిచేస్తున్న కంపెనీల యొక్క నైపుణ్యం కలిగిన ఆటలనే ప్రోత్సహించారు. ఆన్‌లైన్ నైపుణ్యాధారిత ఆటలకు అనుమతి ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఆయన ప్రచారకర్తగా వ్యవహరించారు. ఏదైనా సంస్థ లేదా ఉత్పత్తికి ప్రచారం చేసే ముందు, అది చట్టపరంగా అనుమతి పొందిందా లేదా అని విజయ్ టీమ్ పూర్తిగా పరిశీలిస్తుంది. అన్ని అనుమతులు ఉన్న A23 అనే సంస్థకు విజయ్ గతంలో బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. రమ్మీ ఒక నైపుణ్యం కలిగిన ఆట అని సుప్రీం కోర్టు కూడా గతంలో స్పష్టం చేసింది. అయితే A23తో విజయ్ యొక్క ఒప్పందం గత సంవత్సరం ముగిసింది, ప్రస్తుతం ఆయనకు ఆ సంస్థతో ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండకు సంబంధించి కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకు కూడా ఆయన ప్రచారకర్తగా వ్యవహరించడం లేదని ఆయన టీమ్ పేర్కొంది.
‘‘మీడియాలో వస్తున్న అపోహలు/తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకండి.. చట్టబద్ధంగా గుర్తింపు పొందిన నైపుణ్యం ఆధారిత గేమింగ్ కంపెనీని విజయ్ దేవరకొండ గతంలో ప్రచారం చేశారంటూ’’’ ఆయన టీం ఈ పత్రికా ప్రకటన విడుదల చేసి ఈ ఊహాగానాలకు తెరతెసింది..
ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘కింగ్‌డమ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 30న విడుదల కానుంది. దీని తర్వాత రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక సినిమా, ఆ తర్వాత రవి కిరణ్ కోలా దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు. అలాగే, నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వంలో ఒక ప్రేమ-కథా చిత్రం కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.