మూవీ రివ్యూ : భామా కలాపం-2

Update: 2024-02-16 10:51 GMT

'భామా కలాపం-2' మూవీ రివ్యూ

నటీనటులు: ప్రియమణి-శరణ్య ప్రదీప్-బ్రహ్మాజీ-సీరత్ కపూర్-రుద్ర ప్రతాప్-రఘు ముఖర్జీ-అనూజ్ గుర్వారా తదితరులు

సంగీతం: ప్రశాంత్ విహారి

ఛాయాగ్రహణం: దీపక్ ఎరగెర

నిర్మాతలు: భోగవల్లి బాపినీడు-సుధీర్ ఈదర

రచన-దర్శకత్వం: అభిమన్యు తాడిమేటి

ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఆహా' వారి భామా కలాపం మంచి వినోదాన్నిచ్చి ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడా వెబ్ ఫిలింకి సీక్వెల్ తెరకెక్కింది. అభిమన్యు తాడిమేటి రూపొందించిన 'భామా కలాపం-2' ఆహా ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వంటల అమితాసక్తితో యూట్యూబ్ ఛానెల్ నడిపే అనుపమ (ప్రియమణి)కు ఇరుగు పొరుగు వాళ్ల సంగతులంటే అమితాసక్తి. ఈ ఆసక్తితోనే తన అపార్ట్మెంట్లో సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చి ఒక హత్య కేసులో చిక్కుకుంటుంది. ఎన్నో ఇబ్బందుల తర్వాత ఆ కేసు నుంచి అనుపమ బయటపడ్డాక.. భర్త ఆమెతో కలిసి వేరే ఇంటికి మకాం మారుస్తాడు. అక్కడికి వెళ్లాక సొంతంగా ఒక హోటల్ తెరుస్తుంది. దాన్ని సజావుగా నడిపిస్తూ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో అనుపమ వల్ల పోలీసులకు పట్టుబడ్డ ఒక క్రిమినల్.. ఆమెను బెదిరిస్తాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు పోలీస్ అధికారి అయిన సదానంద్ (రఘు ముఖర్జీ)ని ఆశ్రయిస్తుంది అనుపమ. కానీ అతను ఆ క్రిమినల్ కథ ముగించి.. అనుపమను ఒక దొంగతనం చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అనుపమ ఆ పని చేయడానికి సిద్ధపడుతుంది. ఇంతకీ ఆమె దొంగతనం చేయాల్సిన వస్తువేంటి.. రఘు దాంతో ఏం చేయాలనుకుంటాడు.. చివరికి అనుపమ ఈ టాస్క్ పూర్తి చేసి అన్ని సమస్యల నుంచి బయటపడిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఆహాలో వచ్చిన 'భామాకలాపం' ఎప్పుడూ చూసే క్రైమ్ థ్రిల్లర్లకు భిన్నంగా అనిపించడానికి ప్రధాన కారణం.. అందులో ప్రియమణి చేసిన లీడ్ రోల్. ఒక మధ్య తరగతి హౌస్ వైఫ్ ను లీడ్ రోల్ లో పెట్టి క్రైమ్ కామెడీ తీయాలనుకోవడం భలే ఐడియా. ఓవైపు వంటల మీద యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ.. ఇంకోవైపు అవసరం లేని పొరుగిళ్ల కబుర్లు తెలుసుకునేందుకు విపరీతమైన క్యూరియాసిటీ చూపించే సగటు మధ్య తరగతి మహిళగా ఆమె పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. కొంచెం లాజిక్కులకు దూరంగా సాగినప్పటికీ.. 'భామాకలాపం' చాలా వరకు మంచి వినోదమే పంచింది. ఇప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని కొనసాగిస్తూ.. ఆమెకో కొత్త సమస్య.. కొత్త టాస్క్ ఇచ్చి సీక్వెల్ తీశారు. అదే.. భామాకలాపం-2. తొలి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడ్నుంచే కథను మొదలుపెట్టి ఒక ప్రాపర్ సీక్వెల్ తీశారు. ఈసారి 'భామ'కు ఇచ్చిన టాస్క్ పెద్దదే. కానీ సినిమా రేంజ్ పెరిగింది కానీ.. కంటెంట్ రేంజ్ మాత్రం పెరగలేదు. రెండు గంటలు ఏదో అలా అలా టైంపాస్ చేయించడంలో 'భామాకలాపం' సక్సెస్ అయినా.. ఎక్కువ థ్రిల్ చేయలేకపోయింది. మరీ నవ్వించనూ లేకపోయింది.

'భామాకలాపం'లో ప్రేక్షకులను ప్రధానంగా ఎంగేజ్ చేసేది ప్రియమణి చేసిన అనుపమ పాత్రే. ఐతే ఆ సినిమా చూస్తున్నపుడు కొత్తగా అనిపించే ఆ పాత్ర.. 'భామాకలాపం-2'లో మామూలుగానే అనిపిస్తుంది. ఆ పాత్ర వ్యవహారమంతా ఆల్రెడీ అలవాటైపోయి ఉండడం వల్ల క్యూరియాసిటీ ఏమీ ఉండదు. కథ పరంగా ఏం కొత్తదనం ఉంటుందా అనే చూస్తాం. వెయ్యి కోట్ల విలువైన కొకైన్ చుట్టూ పెద్ద సెటప్పే పెట్టుకున్నారు కానీ.. ఇలాంటి క్రైమ్ కామెడీలు పదుల సంఖ్యలో వచ్చాయి కాబట్టి ఆ విషయంలోనూ ఎగ్జైట్మెంట్ ఏమీ కలగదు. ఒక విలువైన వస్తువు లేదా డబ్బు కోసం కొన్ని గ్యాంగులు ఎవరి ప్లాన్లు వాళ్లు వేసుకుని రంగంలోకి దిగడం.. ఎత్తులు పైఎత్తులు వేయడం.. చివరికి ఈ గ్యాంగులన్నీ కొట్టేసుకుని లీడ్ క్యారెక్టర్ సేఫ్ గా బయటపడి హీరో అవడం.. 'క్షణక్షణం' రోజుల నుంచి ఈ టెంప్లేట్ చూస్తున్నాం. 'భామాకలాపం' కూడా ఇదే లైన్లో సాగిపోతుంది.

'భామా కలాపం-2' ఆరంభంలో వినోదాత్మకంగా సాగుతూ బాగానే టైంపాస్ చేయిస్తుంది. ఫస్ట్ పార్ట్ లో హైలైట్ గా నిలిచిన ప్రియమణి-శరణ్యల కెమిస్ట్రీ... ఇందులోనూ బాగానే వర్కవుట్ అయింది. వీళ్లిద్దరి మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్రైమ్ సెటప్ కూడా ఆరంభంలో ఆసక్తి రేకెత్తించేలానే ఉంటుంది. వెయ్యి కోట్ల కొకైన్.. దాని కోసం వేర్వేరు గ్యాంగుల ప్లానింగ్ అంతా చూసి ఒక పెద్ద రేంజి సినిమా చూడబోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఐతే ప్రియమణిని ఫ్రేమ్ చేస్తూ పోలీసాఫీసర్ తన పని కోసం వాడుకునే క్రమమే అంత కన్విన్సింగ్ గా అనిపించదు. అసలా పోలీసాఫీసర్ పాత్రే సరిగా అర్థం కాదు. డిపార్టుమెంట్లో తనకు గుర్తింపు దక్కట్లేదని పెద్ద క్రైమ్ చేయడంలో ఔచిత్యం కనిపించదు. ఇక క్రైమ్ చేయడానికి అతను టీంతో కలిసి చేసే ప్లానింగ్.. దాని ఎగ్జిక్యూషన్ కొంత ఆసక్తికరంగానే అనిపిస్తుంది కానీ.. చాలా వరకు సీన్లు కన్వీనియెంట్ గా సాగిపోతాయి. ఎక్కడా పెద్ద టాస్క్ ఎదురు కాకపోవడంతో థ్రిల్ ఉండదు. కథనం మరీ బోరింగ్ గా అయితే అనిపించదు కానీ.. అదే సమయంలో ఎగ్జైట్మెంగ్ గానూ ఉండదు. హై ఇచ్చే సీన్లయితే లేవు. క్లైమాక్సులో అయినా మెరుపులు ఉంటాయనుకుంటే.. అదీ మామూలుగా సాగిపోతుంది. 'భామాకలాపం'తో పోలిస్తే 'భామాకలాపం-2' రిచ్ గా అనిపిస్తుంది కానీ.. కంటెంట్ మాత్రం అంత రిచ్ గా లేదన్నది వాస్తవం. ఓటీటీ సినిమానే కాబట్టి ప్రియమణి కోసం ఒకసారి చూడ్డానికి ఇది ఓకే.

నటీనటులు:

అనుపమ పాత్రలో ప్రియమణి మరోసారి ఆకట్టుకుంది. సినిమాను ఆమె తన భుజాల మీద మోసిందని చెప్పాలి. కానీ ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత ఆసక్తికరంగా ఈసారి తన పాత్ర లేదు. శిల్ప పాత్రలో శరణ్య అదరగొట్టింది. ఆమె కామెడీ బాగా చేయగలదని ఈ సినిమాతో రుజువవుతుంది. సినిమా బోర్ కొట్టకుండా చూడడంలో తన పాత్రే కీలకం. రఘు ముఖర్జీ కీలక పాత్రలో బాగానే చేశాడు. ప్రియమణి భర్త పాత్రలో రుద్ర ప్రతాప్ కు పెద్దగా స్కోప్ దక్కలేదు. బ్రహ్మాజీ కనిపించిన కాసేపు నవ్వించాడు. కానీ ఆయనది మరీ తక్కువ నిడివి ఉన్న పాత్ర. దాన్ని ఇంకా వాడుకోవాల్సింది. సీరత్ కపూర్ చాలా గ్లామరస్ గా కనిపించింది. కానీ అందువల్ల ఈ సినిమాకు ఒనగూరిన ప్రయోజనం తక్కువే. అనూజ్.. మిగతా నటీనటులు ఓకే.

సాంకేతిక వర్గం:

'భామాకలాపం-2'లో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓటీటీ మూవీ అయినా థియేటర్ సినిమా రేంజిలో కనిపిస్తుంది. ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం థ్రిల్లర్ సినిమాలకు తగ్గట్లు స్టైలిష్ గా సాగింది. పాటలు సోసోగా అనిపిస్తాయి. దీపక్ ఎరగెర కెమెరా వర్క్ బాగుంది. రైటర్ కమ్ డైరెక్టర్ అభిమన్యు తాడిమేటికి థ్రిల్లర్ సినిమాలు తీయడంలో కొంత నైపుణ్యం చూపించాడు. అతను ఎంచుకున్న సెటప్ ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడూ చూసే థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఏమీ చేయలేకపోయాడు. ప్రియమణి పాత్రను అతను ఇంకా బాగా ఉపయోగించుకోవాల్సింది.

చివరగా: భామాకలాపం-2.. సోసో వినోదం

రేటింగ్ - 2.25/5

Tags:    

Similar News