భారతీయుడు 2: ఆ క్యారెక్టర్ చుట్టే అసలు కథ!

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "భారతీయుడు 2" సినిమా జూలైలో విడుదలకు సిద్ధంగా ఉంది

Update: 2024-05-28 11:49 GMT

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "భారతీయుడు 2" సినిమా జూలైలో విడుదలకు సిద్ధంగా ఉంది. అందరి దృష్టి సేనాపతి విశ్వరూపం మీదనే ఉన్నప్పటికీ, కథలో కీలకమైన పాత్రను సిద్దార్థ్ పోషిస్తున్నట్లు కోలీవుడ్ నుండి టాక్ గట్టిగానే వినిపిస్తోంది. కథ ప్రకారం, సేనాపతి విదేశాల్లో ఉన్న సమయంలో భారతదేశంలో అవినీతి రాజకీయాలపై పోరాటం చేస్తున్న ఒక యువకుడిని గురించి తెలుసుకుంటాడు.

ధర్మం కోసం సొంత కొడుకునే చంపేసిన సేనాపతి ఈసారి తన కొడుకు వయసున్న మరొక యువకుడిని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడట.

ఆ యువకుడిని లక్ష్యంగా పెట్టుకున్నారని, ప్రాణాలు పోవచ్చు అనిపించినప్పుడు అతన్ని రక్షించేందుకు వయసు మళ్ళిన సేనాపతి తిరిగి భారతదేశంలో అడుగుపెడతాడు.

సేనాపతి ఇండియాలోకి రాగానే ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలు రజనీకాంత్ "శివాజీ" తరహాలో వ్యవస్థలో డొల్లతనాన్ని చూపించేలా ఉంటాయట. ఇక దర్శకుడు శంకర్ ఈసారి మరింత ప్రత్యేకంగా సేనాపతి విధించే శిక్షలను డిజైన్ చేశారని సమాచారం. సిద్దార్థ్ ప్రియురాలిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ ఇద్దరి మధ్య డ్యూయెట్ ను రెండో ఆడియో సింగల్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటివరకు ఒక పాట తప్ప ఇంకే ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయని "భారతీయుడు 2" బృందం జూన్ 1న చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్ స్పెషల్ గెస్టులుగా వస్తారనే ప్రచారం ఉంది. తమిళ సినిమాల్లో బాగా ఆఫర్లు ఉన్నప్పటికీ, తెలుగులో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సిద్దార్థ్‌కు "భారతీయుడు 2" మంచి అవకాశం అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.

మూడో భాగం కూడా ఉంది కాబట్టి సిద్దార్థ్ ఆ సినిమాలో కూడా ఉండొచ్చని సమాచారం. కమల్ హాసన్‌తో కలిసి నటించడం పట్ల సిద్దార్థ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కాజల్ అగర్వాల్ మరో స్పెషల్ పాత్రలో నటిస్తుండగా బ్రహ్మానందం, బాబీ సింహా వంటి ప్రముఖ నటులు కూడా "భారతీయుడు 2"లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత, శంకర్ "గేమ్ ఛేంజర్" మీద పూర్తి ఫోకస్ పెడతారని తెలుస్తోంది. "భారతీయుడు 2"తో శంకర్ మరోసారి తన సత్తా చటాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోబో తరువాత మళ్ళీ సరైన సక్సెస్ చూడలేదు. భారతీయుడు 2 హిట్టాయితేనే శంకర్ భవిష్యత్తు ప్రాజెక్టులపై అంచనాలు పెరిగే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News