అమితాబ్ కంటే పెద్ద స్టార్.. సొంత సోదరుడే ముంచాడు!
1950ల నాటి కథ ఇది. బాలీవుడ్‌లో ముగ్గురు పెద్ద స్టార్లుగా దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్ త్రయం ఏలే రోజులవి.
1950ల నాటి కథ ఇది. బాలీవుడ్‌లో ముగ్గురు పెద్ద స్టార్లుగా దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్ త్రయం ఏలే రోజులవి. ఈ ముగ్గురి స్టార్‌డమ్ అసమానమైనది. కానీ ఇదే దశాబ్దంలో ఒక నటుడు వారి ఆధిపత్యాన్ని సవాల్ చేశాడు. ఎవరూ ఊహించని శైలి అతడికి మాత్రమే సొంతమని అభిమానులు కీర్తించేవారు. దాదాపు ఒక దశాబ్దం పాటు మీరట్‌కు చెందిన ఈ వ్యక్తి హిందీ చిత్రాలలో ఇతర స్టార్లందరినీ కొట్టేసేంత పెద్ద స్టార్. కానీ ఆ కీర్తి ఎక్కువ కాలం నిలవలేదు. ఆ డబ్బు నిలబడలేదు. పరిశ్రమలో అయినవారే లేకుండా పోయారు.
అతడు ఎవరు? అంటే.. పేరు భరత్ భూషణ్. 1941లో `చిత్రలేఖ` సినిమాతో గ్లామర్ రంగంలోకి వచ్చినా దశాబ్ద కాలం పాటు కష్టపడ్డాడు. 1952 లో `బైజు బావ్రా`తో అతను స్టార్ అయ్యాడు. బసంత్ బహార్, ఫాగున్, బర్సాత్ కీ రాత్ వంటి హిట్‌లను అందించి ఒక దశాబ్దం పాటు అగ్ర నటుడిగా కొనసాగాడు. 1960ల చివరి నాటికి అతడి స్టార్ డమ్ అనూహ్యంగా క్షీణించినా కానీ.. అతడు ఇప్పటికీ బాలీవుడ్‌లో అగ్రశ్రేణి స్టార్‌లలో ఒకరిగా గణాంకాల్లో ఉన్నాడు.
భవిష్యత్ సూపర్ స్టార్‌లు రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్‌లు ఓవైపు ఉన్నా కానీ.. నాటి యువతరం నటుల కంటే భరత్ భూషణ్ రేసులో ముందున్నాడు. ఒకానొక సమయంలో అతడు భారతదేశపు అత్యంత ధనిక నటుడు అని కీర్తినందుకున్నాడు. అయితే అతడి జీవితంలో అనూహ్యమైన మలుపు అతడి సోదరుడి వల్లనే.. భరత్ భూషణ్ అన్న గారు అయిన రమేష్‌చంద్ర గుప్తా సినిమా నిర్మాత. అతడు సినిమాలలో పెట్టుబడి పెట్టడానికి .. నిర్మాతగా మారడానికి భరత్‌ను ఒప్పించాడు. అయితే వీటిలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 70వ దశకం నాటికి భరత్ భూషణ్ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాడు. దాదాపుగా దివాళా తీసాడు. ఆర్థిక నష్టాల నుండి తనను తాను రక్షించుకోవడానికి భరత్ తన విలువైన బంగ్లాను (తర్వాత రాజేంద్ర కుమార్ .. చివరికి రాజేష్ ఖన్నా కొనుగోలు చేశారు) అలాగే అతడి కార్లన్నింటినీ విక్రయించాల్సి వచ్చింది.
భరత్ భూషణ్ ఆ తర్వాతా నటనను కొనసాగించాడు కానీ ఎక్కువగా సహాయక పాత్రలలో నటించాడు. కొన్నిసార్లు డబ్బు కోసం పెద్ద చిత్రాలలో కూడా గుర్తింపు పొందని అదనపు సహాయక పాత్రలను పోషించాడు. 80ల నాటికి అతడు ఆర్థికంగా కోలుకోగలిగాడు. అయితే అతడు సాధారణ జీవితాన్ని గడిపాడు. అమితాబ్ బచ్చన్ ఒకసారి బస్ స్టాండ్‌లో తనను ఎలా గుర్తించాడో వివరించారు. బస్సు కోసం అతడు వేచి ఉన్నాడు. ఇది స్టార్‌డమ్ చంచల స్వభావం గురించి వెల్లడించింది. 1992లో భరత్ భూషణ్ తన 72వ ఏట మరణించారు. అతడి వెంట కుటుంబం ఉంది. కానీ చివరి రోజుల్లో తనను కలిసేందుకు పరిశ్రమ సహచరులెవరూ రాలేదు. ఇండస్ట్రీ కొలీగ్స్ ఎవరూ పట్టించుకోలేదు.