'భీమా' మూవీ రివ్యూ
ఒక మంచి హిట్ కోసం చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు సీనియర్ హీరో గోపీచంద్. ఇప్పుడతను కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వంలో చేసిన సినిమా 'భీమా'.
'భీమా' మూవీ రివ్యూ
నటీనటులు: గోపీచంద్-ప్రియా భవానీ శంకర్-మాళవిక శర్మ-ముకేష్ తివారి- నాజర్-నరేష్-పూర్ణ-వెన్నెల కిషోర్-రఘుబాబు-రోహిణి తదితరులు
సంగీతం: రవి బస్రూర్
ఛాయాగ్రహణం: స్వామి గౌడ
మాటలు: అజ్జు మహాకాళి
నిర్మాత: కేకే రాధామోహన్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎ.హర్ష
ఒక మంచి హిట్ కోసం చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు సీనియర్ హీరో గోపీచంద్. ఇప్పుడతను కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వంలో చేసిన సినిమా 'భీమా'. టీజర్.. ట్రైలర్ చూస్తే మాంచి మాస్ మూవీలా కనిపించిన 'భీమా' ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రమైనా గోపీచంద్ నిరీక్షణకు తెరదించేలా ఉందేమో చూద్దాం పదండి.
కథ: ఆంధ్రా-కర్ణాకట సరిహద్దుల్లోని ఓ ప్రాంతాన్ని గుప్పెట్లో పెట్టుకున్న భవాని (ముకేష్ తివారి) తన అరాచకాలతో ఆ ప్రాంత వాసుల హడలెత్తిస్తుంటాడు. భవానిని అడ్డుకోబోయిన ఆ ప్రాంత ఎస్ఐని తన మనుషులు హతమారుస్తారు. ఆ ప్రాంతానికి కొత్తగా ఎస్ఐగా వస్తాడు భీమా (గోపీచంద్). అతను వచ్చీ రాగానే భవానీ మనుషులను కొట్టి నెల రోజుల్లో తన ముందు లొంగిపోవాలని భవానికి వార్నింగ్ ఇస్తాడు. ఈలోపు ఊర్లో పరిస్థితులను చక్కదిద్దడం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే ఒక రోజు భవానికి చెందిన ఆయిల్ ట్యాంకర్ ను ఆపి పరిశీలించగా అందులో పిల్లల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తుంది. పిల్లల్ని ఇలా తరలించడం వెనుక పెద్ద కుట్రే ఉందని తెలుస్తుంది. ఇంతకీ ఆ కుట్ర ఏంటి.. దాని వెనుక ఎవరెవరున్నారు.. భీమా వీళ్లందరి ఆటకట్టించగలిగాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: ఏదైనా ఓ భాషలో కొంచెం భిన్నంగా చేసిన ఓ ప్రయత్నం పెద్ద సక్సెస్ అయిందంటే చాలు.. అందులో హైలైట్ పాయింట్ పట్టుకుని అలాంటి కథలు అల్లి వరుసబెట్టి ప్రేక్షకుల మీదికి వదిలేస్తుంటారు. కానీ ఇలా చేస్తున్నపుడు అనుకరిస్తున్న 'హైలైట్ పాయింట్' ఎలాంటి కథలో సింక్ అవుతుంది అన్నది కూడా కొంచెం చూసుకోవాలి. 'కాంతార' సినిమాలో షాకింగ్ గా అనిపించే ఫాంటసీ ఎలిమెంటుని పట్టుకొచ్చి ఒక మాస్ కథలో ఇరికించడానికి ట్రై చేసింది 'భీమా' టీం. కానీ అది కాస్తా వెజ్ కర్రీ కోసం నూరిపెట్టుకున్న మసాలాను నాన్ వెజ్ వంటకానికి వేసినట్లుగా తయారైంది. చాలా వరకు రొటీన్.. సిల్లీ సీన్లతో సినిమానంతా నడిపించి.. మొదట్లో చివర్లో ఫాంటసీ ఎలిమెంట్ పెట్టి.. దానికి తోడు గోపీచంద్ ఇమేజికి తగ్గట్లు భారీ యాక్షన్ బ్లాక్స్ జోడించి 'భీమా'ను ఒక మిక్చర్ పొట్లంలా తయారు చేశాడు కన్నడ దర్శకుడు హర్ష. మంచి కటౌట్ ఉన్న గోపీకి సరిగ్గా కుదిరిన యాక్షన్ బ్లాక్స్ వరకు వారెవా అనిపించినా.. ఒక తీరూ తెన్నూ లేకుండా సాగే కథాకథనాలు.. బోరింగ్ రొమాన్స్-కామెడీ సీన్లు.. ఈ కథలో అస్సలు కుదరని ఫాంటసీ ఎలిమెంట్ 'భీమా' నీరుగారిపోయేలా చేశాయి.
ప్రతి సీన్లోనూ దాదాపు ఒక వ్యాంప్ తరహాలో డ్రెసింగ్ చేసుకునే హీరోయిన్ స్కూల్లో టీచరుగా పని చేస్తుంటుంది. తనను ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తానని ఒకడు తిరుగుతుంటాడు. ఆమె వచ్చి ఎస్ఐ అయిన హీరోకి కంప్లైంట్ చేస్తే.. ఇంకెవరూ లేరన్నట్లు ఎస్ఐ అయిన హీరోగానే ఆమెకు బాడీ గార్డుగా వెళ్తాడు. నిజానికి హీరోయిన్ మీద యాసిడ్ పోస్తానన్న రౌడీగాడు పెద్ద కామెడీ ఫెలో. ఆమెను అసలు ఏమీ చేయడు. కానీ అతగాడిని అడ్డు పెట్టుకుని హీరో వెయ్యాల్సిన వేషాలన్నీ వేసేస్తుంటాడు. హీరోయిన్ నడిచి వెళ్తుంటే ఆమె జఘన భాగాన్ని చూస్తూ ఆ కదలికలకు తగ్గట్లుగా తల ఊపుతుంటాడు. అది పసిగట్టి హీరోయిన్ తలతిప్పి చూడకుండానే అలా చేయొద్దని సిగ్నల్ ఇస్తుంటుంది. రౌడీని అడ్డం పెట్టుకుని హీరో ఆమె హాస్టల్లో తిష్టవేస్తాడు. ఆపై ఆమె బెడ్రూంలోకి కూడా అడుగుపెట్టేస్తాడు. హాస్టల్లో హీరోను చూసిన ప్రతి అమ్మాయి సర్వం అర్పించేయడానికి రెడీ అయిపోతుంటుంది. 'భీమా' ప్రథమార్ధంలో సుదీర్ఘంగా సాగే రొమాంటిక్ కామెడీ ట్రాక్ ఇది. హీరో హీరోయిన్ల పాత్రలను ఇలా చూపించి.. ఆ తర్వాత వాళ్లో పెద్ద కాజ్ కోసం కష్టపడుతున్నట్లు.. ప్రాణాలే లెక్కచేయనట్లు చూపిస్తే.. ఆ కథను ప్రేక్షకులు ఎంతమాత్రం సీరియస్ గా తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చు.
హీరోని.. విలన్ని ఓ బిల్డప్ తో పరిచయం చేయడం.. తర్వాతి సీన్లోనే తుస్సుమనిపించే సీన్లు పెట్టి ఇంటెన్సిటీ మొత్తం తగ్గించేయడం.. మళ్లీ యాక్షన్ ఎపిసోడ్లు రాగానే హీరో పరాక్రమం-విలన్ క్రూరత్వం చూపించేయగానే ప్రేక్షకులు ఇంటెన్సిటీ ఫీలైపోవాలని కోరుకోవడం.. ఎన్ని మాస్ సినిమాల్లో చూడలేదు ఇలాంటి వ్యవహారాలు. పరశురామ క్షేత్రం గురించి మొదట్లో వచ్చే సన్నివేశాలు చూసి ఏదో ఊహించుకుంటాం కానీ.. హీరో ఎంట్రీ ఇవ్వడం ఆలస్యం.. 'భీమా' చల్లబడిపోతుంది. ఆ తర్వాత పైన చెప్పుకున్న రొమాన్స్-కామెడీ ట్రాక్ అనే హింస మొదలవుతుంది. ఇంటర్వెల్ వరకు అసలు ఈ సినిమాతో ఏం చెప్పాలనుకున్నారో.. కథ ఎటు పోతోందో అర్థం కాదు. ఇంటర్వెల్ టైంకి ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ పెట్టి మాస్ ప్రేక్షకులను కొంత ఎంగేజ్ చేయగలిగారు.
ఇంటర్వెల్ తర్వాత కథ మళ్లీ మామూలే. హీరో పాత్రలో కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ముందుకు వెనక్కి సాగే సీన్లు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. సగటు మాస్ మూవీలో కథేంటో.. ఏది ముందో ఏది వెనుకో తెలియని అయోమయంలో ప్రేక్షకుడు ఉంటే.. ఇక ఆ సినిమాను ఏం ఎంజాయ్ చేస్తాడు? హీరో ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన సన్నివేశాలైతే కనీస స్థాయిలో కూడా ఆసక్తి రేకెత్తించవు. విలన్లకు సంబంధించి ఏమాత్రం కన్విన్సింగ్ గా లేని పాయింట్ చూపించారిందులో. అది చూశాక అప్పటిదాకా ఉన్న కొంచెం సీరియస్నెస్ కూడా పోతుంది. చివర్లో అసలీ సినిమాలో సింక్ కాని విధంగా ఫాంటసీ ఎలిమెంట్ జోడించారు. సినిమాకు కొంచెం భారీతనం.. విజువల్ అప్పీల్ తేవడానికి అది ఉపయోగపడింది. క్లైమాక్స్ లో యాక్షన్ ఎపిసోడ్ అయితే బాగా తీశారు. ఇంటర్వెల్ తర్వాత మాస్ ప్రేక్షకులు మళ్లీ కొంచెం ఎంగేజ్ అయ్యేది ఇక్కడే. కానీ ఈ రెండు మూడు ఎపిసోడ్ల కోసం మిగతా వ్యవహారాన్ని భరించడం కష్టం. గోపీచంద్ నుంచి వచ్చిన చివరి సినిమా 'రామబాణం'తో పోలిస్తే 'భీమా' కొంచెం బెటర్ అన్న మాటే కానీ.. ప్రేక్షకులకు సంతృప్తినిచ్చే చిత్రం కాదు. భారీ యాక్షన్ ఎపిసోడ్ల కారణంగా గోపీ మాస్ ఫ్యాన్సుకి ఈ సినిమా కొంత ఎక్కొచ్చు.
నటీనటులు: గోపీచంద్ గడ్డం పెంచి లుక్ కొంచెం మార్చుకున్నాడు. ఎప్పట్లాగే చూడ్డానికి బాగున్నాడు. రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని బాగానే చేశాడు. పాత్రకు అవసరమైనట్లు కనిపించాడు. నటించాడు. కానీ మాస్ అంశాల విషయానికి వస్తే అతను కొత్తగా చేసిందేమీ లేదు. ఎప్పుడూ చేసే ఊర మాస్ ఫైట్లు చేశాడు. హీరోయిన్లలో ఎవ్వరూ తమదైన ముద్ర వేయలేకపోయారు. తక్కువసేపు కనిపించినా ప్రియా భవాని శంకర్ నటన పర్వాలేదు. మాళవిక శర్మను పూర్తిగా గ్లామర్ కోసమే వాడుకున్నారు. కానీ ఆమెను ప్రెజెంట్ చేసిన తీరు బాగా లేదు. సందర్భంతో సబంధం లేకుండా పనిగట్టుకుని ఎక్స్ పోజింగ్ చేయించినట్లు అనిపిస్తుంది. మాళవిక నటన గురించి చెప్పడానికి ఏమీ లేదు. నాజర్ పాత్ర మొదట్లో ఒకలా అనిపించి.. తర్వాత రూటు మార్చుకుంటుంది. కానీ దాన్ని అంచనా వేయడం కష్టమేమీ కాదు. ముకేష్ తివారి.. మిగతా విలన్లు మామూలుగా అనిపిస్తారు. వెన్నెల కిషోర్ కొంచెం స్క్రీన్ టైం ఉన్న పాత్రే చేశాడు కానీ.. అతను నవ్వించలేకపోయాడు. రఘుబాబు.. నరేష్ లాంటి వాళ్లు పర్వాలేదు.
సాంకేతిక వర్గం: 'భీమా' టెక్నికల్ గా జస్ట్ ఓకే అనిపిస్తుంది. రవి బస్రూర్ తన మార్కు నేపథ్య సంగీతంతో హోరెత్తించేశాడు. కానీ అన్ని చోట్లా సన్నివేశాలను అది ఎలివేట్ చేయలేకపోయింది. సన్నివేశాల్లో విషయం లేక కొన్ని చోట్ల ఆర్ఆర్ ఓవర్ గా కూడా అనిపిస్తుంది. పాటలేవీ అంతగా ఆకట్టుకోవు. స్వామి గౌడ ఛాయాగ్రహణం ఒక మాస్ సినిమాకు అవసరమైన విధంగా సాగింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక పెద్ద సినిమా రేంజిలో ఔట్ పుట్ ఉంది. అజ్జు మహాకాళి డైలాగులు అక్కడక్కడా పేలాయి. రైటర్ కమ్ డైరెక్టర్ హర్ష మీద తమ కన్నడ సినిమాల ప్రభావం ఎక్కువ ఉన్నట్లుంది. మరీ లౌడ్ గా తీశాడీ సినిమాను. ప్రధానంగా యాక్షన్ ఘట్టాల మీద అతను ఫోకస్ పెట్టాడు. కథను ఒక తీరుగా చెప్పలేకపోయాడు. గోపీని కొంచెం భిన్నంగా.. మాస్ కు నచ్చేలా చూపించడంలో మినహా అతను దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటలేకపోయాడు.
చివరగా: భీమా.. బోరింగ్ డ్రామాలో మాస్ మెరుపులు
రేటింగ్-2.25/5