భూమి తగలబడటంపై సినిమాలు తీస్తానన్న నటి
అయితే బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ని ఇలాంటి అరుదైన అంశంపై మాట్లాడే అవకాశం వరించింది.
గ్లోబల్ వార్మింగ్ పెను ప్రభావం ఎలా ఉంటుందో చాలా ఎగ్జాంపుల్స్ కళ్ల ముందే కనిపిస్తున్నాయి. వాతావరణం అంతకంతకు దిగజారి, మనిషి తట్టుకోలేనంత భయానకంగా మారుతోంది. వేడి, శీతల పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అమెరికాలో వేల ఎకరాలు తగలబడిన ఘటన దేనిని చెబుతోంది? అమెజాన్ తగలబడటానికి ప్రధాన కారణమేమిటి?.. హిమానీ నదులు వేగంగా కరగడానికి కారణమేమిటీ? ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ప్రభావమేనా? హిమాలయాలు కరిగి నదీజలాలు పొంగి చివరికి సముద్రాలు అల్లకల్లోలమైతే దానికి కారణం కచ్ఛితంగా గ్లోబల్ వార్మింగ్ అవుతుందని సైంటిస్టులు ఇప్పటికే విశ్లేషించారు.
ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణం గురించి స్పృహ, జ్ఞానం ప్రజలకు అవసరం. కానీ దీనిని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అయితే బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ని ఇలాంటి అరుదైన అంశంపై మాట్లాడే అవకాశం వరించింది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరిగే ప్రపంచ వార్షిక సమావేశంలో మాట్లాడటానికి భూమికి ఆహ్వానం అందింది. గతంలో ఇదే సమావేశంలో పాల్గొన్న కింగ్ ఖాన్ షారుఖ్ బాటలో తనను కూడా అవకాశం వరించింది. ఈ శనివారం నుంచి ప్రారంభమయ్యే ఐదు రోజుల సమావేశంలో ఆమె యంగ్ గ్లోబల్ లీడర్‌గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక్కడ ఆర్థిక అంశాలతోపాటు పర్యావరణ అంశాలను ముచ్చటించనుంది.
ఈ ఆహ్వానం అందుకున్న వెంటనే భూమి ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. నేను చాలా సంవత్సరాలుగా శిఖరాగ్ర సమావేశాన్ని అనుసరిస్తున్నాను. నా గొంతు వినిపించే వేదిక దొరకడం నా అదృష్టం. ఇది ప్రారంభం మాత్రమే.. అని అన్నారు. సినీ సెలబ్రిటీలకు గ్లామర్ ప్రపంచం గురించి మాత్రమే జ్ఞానం ఉంటుందని, బయటి ప్రపంచంపై అంతగా అవగాహన ఉండదనే విమర్శలు ఉన్నాయి. కానీ అందరూ అలా కాదని నిరూపిస్తాను. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి మనం పని చేయకపోతే జీవితంలో సాధించే విజయాలను పట్టించుకోనవసరం లేదు! అని భూమి వ్యాఖ్యానించారు. పర్యావరణ కాలుష్యం, ఇతర సమస్యలపైనా, ఏఐ వంటి టెక్నాలజీతో ముడిపడిన అంశాలపైనా భూమి దావోస్ సదస్సులో ప్రసంగిస్తారు. పర్యావరణంపై భూమి ఫెడ్నేకర్ స్పష్ఠమైన అభిప్రాయలను కలిగి ఉన్నారు. గొప్ప వేదికపై అవకాశం దక్కినందుకు తన పరిజ్ఞానాన్ని ఆవిష్కరించేందుకు ఛాన్సుంది.
వాతావరణ మార్పులపై సినిమాలు:
భవిష్యత్ లో తాను వాతావరణ మార్పులపై సినిమాలు తీస్తానని కూడా భూమి పెడ్నేకర్ వెల్లడించారు. ప్రస్తుతం వాతావరణ సమస్యలపై మనకు సినిమాలు అవసరం. కలుషిత వాతావరణం లేకుండా మంచి సమాజం కావాలి. దానికోసం కృషి చేస్తానని భూమి తాజా ఇంటర్వ్యూలో అన్నారు. భూమి పెడ్నేకర్ తదుపరి హాలీవుడ్ లోను నటిస్తున్నానని వెల్లడించారు. భారతీయ సంస్కృతి మూలాలను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయాల్సి ఉందని కూడా భూమి అభిప్రాయపడ్డారు.